ఫ భక్తజన సంద్రంలా వాడపల్లి క్షేత్రం
ఫ ఒక్కరోజే రూ.38.21 లక్షల ఆదాయం
కొత్తపేట: కోనేటిరాయా.. కోటి దండాలయ్యా అంటూ వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని అశేష భక్తజనం కొలిచింది. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీవారి క్షేత్రం శనివారం భక్తజన సంద్రంలా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, ఏడువారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఏడు కొండలవాడా.. వెంకటరమణా.. గోవిందా.. గోవిందా అనే నామస్మరణ మార్మోగింది. తెల్లవారుజామున అర్చకస్వాములు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు చేసి, పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని, అర్చక స్వాముల నుంచి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే వెంకన్న ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీఅన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి వారికి దర్శించుకుని పూజలు చేశారు. ఏర్పాట్లను దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, అన్న ప్రసాదాల విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదం విక్రయం, ఆన్‌లైన్ సేవల ద్వారా దేవస్థానానికి రూ.38,21,881 ఆదాయం వచ్చిందని సూర్యచక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన వివిధ వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా క్రమబద్ధీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment