
దిగుబడి బాగున్నా దయనీయమే!
గోకవరం: చివరి ధాన్యపు గింజ వరకు కొంటాం.. రైతు సంక్షేమమే లక్ష్యం.. ఇవీ నిత్యం కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు. క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి విరుద్ధం. కొనుగోలు కేంద్రాల వద్ద ఇంత ధాన్యమే కొనాలని లక్ష్యం విధిస్తే అంతకు మించి సరకును రైతులు తీసుకువస్తే ససేమిరా.. మేమింతే కొంటామని కొనుగోలు కేంద్రాల సిబ్బంది పొమ్మంటే అన్నదాత పరిస్థితి ఏమిటి? ఎవరైనా పంట వేస్తే దిగుబడి బాగా రావాలనే వేస్తారు. ఆశించినట్టే దిగుబడి వచ్చినా అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్టు పరిస్థితి ఉంటే ఆ రైతు ఎవరికి చెప్పుకోవాలి? ఇదే పరిస్థితి మండలంలోని తంటికొండ రైతులకు ఏర్పడింది. ఈ పరిస్థితిపై రైతులు సోమవారం అధికారులకు మొర పెట్టుకున్నారు. గ్రామానికి చెందిన రైతులు రబీసాగులో 876 ఎకరాల్లో ఎంటీయూ 1121 రకం ధాన్యాన్ని, 12 ఎకరాల్లో 1156 రకాన్ని పండించి ఈ–క్రాప్ నమోదు చేయించుకున్నారు. సుమారు 33,779 క్వింటాళ్లు దిగుబడి రాగా 16,110 క్వింటాళ్లు రైతుభరోసా కేంద్రం ద్వారా విక్రయించారు. అయితే వ్యవసాయశాఖ సిబ్బంది టార్గెట్ లేదని వారి వద్ద ఉన్న సుమారు 14,169 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. దళారులకు విక్రయిద్దామంటే గిట్టుబాటు ధర రావడం లేదని, ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తాము అప్పులపాలవుతామని రైతులు అధికారుల వద్ద వాపోయారు. ధాన్యం టార్గెట్‌ను పెంచి తమ వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తహసీల్దార్ సాయిప్రసాద్, ఎంపీడీఓ గోవిందు, ఏఓ రాజేశ్వరిలను వేడుకున్నారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు.
ధాన్యం కొనండి మహాప్రభో
అని వేడుకుంటున్న అన్నదాతలు
టార్గెట్ మీరలేమంటున్న
కొనుగోలు కేంద్రాల సిబ్బంది
తలలు పట్టుకుంటున్న రైతులు