బెజవాడ సతీష్
తూర్పు గోదావరి: సంక్రాంతి పర్వదినాలలో ఉదయమే అక్షయ పాత్ర తలపై ఉంచి ఒక చేత్తో తంబుర, మరో చేత్తో చిడతలు వాయిస్తూ హరిలోరంగ హరి అంటూ హరినామస్మరణ చేసే హరిదాసును ఏటా మనం చూస్తూనే ఉంటాం. వంశపారం పర్యంగా వస్తున్న ఈ వృత్తిని స్వీకరించిన మూడోతరం హరిదాసు బెజవాడ సతీష్. ఈయన స్వగ్రామం భద్రాచలం సమీపంలోని రామనగరం. సతీష్ ఉద్యోగ రీత్యా సరిహద్దు జవాను. సంక్రాంతి పర్వదినాలలో సెలవుపై వచ్చి మండలంలోని చీపురుగూడెం, పోతవరం, కవులూరు తదితర గ్రామాలలో తిరుగుతుంటారు.
తాత చిన్ని కృష్ణ తర్వాత తండ్రి నరసింహరావు ఆయన గతించిన తర్వాత సతీష్ ఈ వృత్తిలోకి వచ్చారు. ఎంత చదువు చదివినా, ఏ ఉద్యోగం చేస్తున్నా వంశపారం పర్యంగావచ్చే ఈ వృత్తి వీడలేదు సతీష్. తెల్లవారుఝూమున 3గంటలకే నిద్రలేచి స్నానాది పూజాకార్యక్రమాలు ముగించి హరినామ సంకీర్తనలు పాడుతూ గ్రామ,గ్రామాన తిరుగుతుంటారు. దాదాపు 10గ్రామాలు తిరిగాక శిరస్సుపై ఉంచిన కలశాన్ని దించి మళ్లీ స్నానం చేశాకే భోజనం చేస్తారు.
ఇది తమకు ఆనవాయితీగా వస్తున్నదని సతీష్ వివరించారు. ఇటీవల హరిదాసులంతా మోపెడ్‌లపై తిరుగుతూ హరినామ సంకీర్తనలు సైతం రికార్డు చేసి లౌడ్ స్పీకర్లలో వినిపిస్తూ ఉంటే ఈయన మాత్రం కాలినడకనే హరినామ సంకీర్తన చేస్తూ తిరుగుతూ కనిపిస్తారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తమ తండ్రి ఈ విధంగానే తిరగాలని చెప్పారని వివరించారు. తాత,తండ్రిల నుంచి వచ్చిన తంబుర, చిడతలు, కలశంనే ఆయన వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment