గోదావరి స్నానానికి దిగి ఐదుగురు యువకుల మృతి
మరో ఏడుగురు సురక్షితం మృతులంతా తాడిపూడి వాసులే
తాడిపూడిలో మిన్నంటిన రోదనలు
ఎన్నో కలలు.. మరెన్నో ఆశలు.. ఇంకెన్నో కోరికలు.. యుక్తవయసు పిల్లలు. చదువులు గట్టెక్కాలని..అమ్మానాన్నలను ఆదుకోవాలని.. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని ఎన్ని విషయాలు శివయ్యకు చెప్పుకొందామనుకున్నారో.. వారికేం తెలుసు ఆ స్వామి నేరుగా తన వద్దకే తీసుకుపోతాడని? గోదారి గంగలో శుచిగా స్నానమాచరించి స్వామి దర్శనం చేసుకుందామనుకున్న వారిని ఆ అమ్మే స్వయంగా అయ్య వద్దకు తీసుకువెళ్తుందని అనుకుని ఉండరు. అర్ధాంతరంగా తనువులు చాలించిన ఆ యువకుల పరిస్థితి అలా ఉంటే.. లయకారుడివని తెలుసు కానీ ఇంత నిర్దయగా మా కంటి పాపలను తీసుకుపోయి మా బతుకులలో అంధకారం మిగులుస్తావనుకోలేదని ఆ తల్లిదండ్రులు దీనంగా స్వామివారివైపు చూస్తున్నారు. నీ ఆటలు మాపైనా శివయ్యా.. ఇది నీకు తగునా అని కన్నీటి పర్యంతమవుతున్నారు.
కొవ్వూరు/తాళ్లపూడి: మహా శివరాత్రి రోజు తాడిపూడిలో తీరని విషాదం చోటు చేసుకుంది. పరమేశ్వరుని దర్శనానికి గోదావరి నదిలో స్నానాలు ఆచరించి వెళ్దామనుకున్న 12 మంది యువకులలో ఐదుగురు నీట మునిగి మృతి చెందగా మరో ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం ఉదయం తాడిపూడి గ్రామ శివారున ఇసుక ర్యాంపు వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆ యువకులు నదిలో శివరాత్రి పుణ్య స్నానాలు ఆచరించేందుకు గ్రామ శివారున చింతలపూడి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వెనుక భాగంలోని ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లారు.
నదిలో స్నానాలు ఆచరించి ప్రక్కిలంక శివాలయానికి వెళ్దామనుకున్నారు. స్నానాల కోసం నదిలో దిగారు. ఆ ప్రాంతంలో ఇసుక మేటలు వేయడంతో నదిలోతు తక్కువగా ఉంది. రెండు మూడు అడుగుల మేర మాత్రమే నీరు ఉండడంతో వారంతా ఉత్సాహంగా జలకాలాడుతూ కొంత ముందుకు వెళ్లారు. అక్కడ నది లోతుగా ఉండడంతో వారిలో పడాల దుర్గా ప్రసాద్ (19), పడాల దేవదత్త సాయి (18), అనిశెట్టి పవన్ గణేష్(18), గర్రే ఆకాష్ (19), తిరుమలశెట్టి పవన్ కుమార్ (19) అదుపుతప్పి ఒకరి తర్వాత మరొకరు నీట మునిగి మృత్యువాత పడ్డారు. వీరితో పాటు వెంట వెళ్లిన పడాల మల్లికార్జున్, ఆకుల రాజేష్, గంటా రాజా నరేంద్ర, గర్రే హర్షవర్ధన్, దుర్గాప్రసాద్, కరిబండి వినయ్‌తేజ, టేకు అంజనికుమార్ సురక్షితంగా బయటపడ్డారు.
మునిగిపోతున్న వాళ్లను రక్షించేందుకు వారు యత్నించినప్పటికీ, ఈత రాకపోవడంతో వారి కళ్లెదుటే నదిలో మునిగిపోయారు. విషయం తెలుసుకుని స్థానిక గ్రామస్తులు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్, ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ జి.దేవకుమార్‌తో ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. స్థానిక జాలర్లు, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలతో నదిలో పడవల సాయంతో గాలించి మృతదేహాలను వెలికితీశారు. రిస్క్యూ టీం నాలుగు గంటల పాటు శ్రమించి, వెలికితీసిన మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు.
ఘటనా ప్రదేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, కొవ్వూరు రూరల్ సీఐ కె.విజయబాబు, డీఎఫ్‌వో మార్టిన్ లూథర్, తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ తలారి వెంకట్రావు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతదేహాలను పరిశీలించి, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని ప్రకటించారు.
వారందరిదీ ఒకే గ్రామం
గోదావరిలో మునిగి మృత్యువాత పడిన ఐదుగురు యువకులు తాడిపూడి వాసులే. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు నిరుపేదలు. వీరి మృతితో ఆ సామాజిక వర్గంలో విషాదం అలుముకుంది. మృతుల్లో ముగ్గురు వారి కుటుంబాల్లో ఏకైక కుమారులు కావడం, 20 ఏళ్ల లోపువారే కావడంతో వారి బాధ వర్ణనాతీతం.
నాలుగేళ్ల క్రితం ముగ్గురు దుర్మరణం
కొవ్వూరు పట్టణంలో సీతారామ స్నాన ఘట్టం సమీపంలో గోదావరి నదీ పాయల్లో స్నానాలకు వెళ్లి చాగల్లుకి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. 2021 ఏప్రిల్ 11న గోదావరి నదీ పాయల్లో నీరు తక్కువగా ఉందని వెళ్లి చాగల్లుకి చెందిన ఆరుగురు యువకులు ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందారు. అదే ఏడాది కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ముగ్గురు మత్యువాత పడ్డారు. గోదావరి నదిలో వేసవి కాలంలో నీరు తగ్గిపోవడంతో ఇసుక మేటలు బయటపడుతున్నాయి. ఆ సమయంలో లోతు తక్కువగా కనిపిస్తుందని భావించి స్నానాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. వీటి నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలి
గోదావరి నదిలో మునిగి మృత్యువాత పడిన ఐదుగురు యువకుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కొక్కరి కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తలారి వెంకట్రావు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. అంతకు ముందు ఘటన స్థలానికి వెళ్లి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఐదేళ్ల క్రితమే తండ్రి మృతి
మృతుడు అనిశెట్టి పవన్ గణేష్ తండ్రి ఐదేళ్ల కిత్రమే మృతి చెందారు. తల్లి రజని చిన్న ప్రైవేటు స్కూలు టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెతో పాటు సోదరి ఉంది. పవన్ గణేష్ పదో తరగతి చదివి అనంతరం రాజమహేంద్రవరంలో గైట్ కాలేజీలో పాలిటెక్నిక్ డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉద్యోగం చేసి కుటుంబానికి ఆసరా అవుతాడనుకున్న కొడుకును అకాల మృత్యువు కాటేయడంతో గర్భశోకంతో ఆ తల్లి దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తోంది.
ఉన్న ఒక్క కొడుకునూ కోల్పోయాం
మృతుడు తిరుమలశెట్టి పవన్ కుమార్ తల్లిదండ్రులకు ఏకై క కుమారుడు. ప్రస్తుతం కొవ్వూరులో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి రంగబాబు, తల్లి ఆదిలక్ష్మి, ఒక అక్క ఉన్నారు. తండ్రి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు ప్రయోజకుడై కుటుంబానికి ఆధారంగా నిలుస్తాడని భావించిన వారి ఆశలు ఆవిరయ్యాయి.
పెద్ద కొడుకుని కోల్పోయాం
మృతుడు పడాల దుర్గా ప్రసాద్ ప్రక్కిలంకలోని ఐటీఐ చదువుతున్నారు. తండ్రి వెంకన్న దొర, తల్లి కుమారిలకు మొదటి సంతానం. తమ్ముడు మల్లికార్జున స్వామి ఇంటర్ చదువుతున్నాడు. తండ్రి వెంకన్న దొర వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నాడు. మహా శివరాత్రి పర్వదినం రోజు పెద్ద కుమారుడిని గోదావరి కబళించిడంతో ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.
స్టాఫ్‌వేర్ ఉద్యోగం చేస్తానన్నాడు
గర్రే ఆకాశ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తానని చెప్పి అందని తీరాలకు వెళ్లిపోయాడు. తాళ్లపూడిలో ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి సీతారాం, తల్లి లక్ష్మి, తమ్ముడు ఉన్నారు. చదువులో చురుకుగా ఉండే ఆకాష్ ఇంటర్ తరువాత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తానని చెప్పేవాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే తండ్రికి ఆసరాగా నిలవాలనుకున్నాడు. ఇటీవల కళాశాల ఫేర్‌వెల్ డేలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు. మార్చి రెండు నుంచి జరిగే పరీక్షలకు ఇంటి దగ్గర కష్టపడి చదువు కుంటున్నాడని, ఇంతలోనే అతడు ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేక పోతున్నామని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
అండగా ఉంటాడనుకున్నాం
మృతుడు పడాల దేవదత్త సాయి తండ్రి రామ దుర్గారావు వ్యవసాయ కూలి. ప్రస్తుతం తాళ్లపూడి కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తల్లి లక్ష్మి గృహిణి. సోదరి దివ్య ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిది పేద కుటుంబం. మార్చి ఒకటి నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. చదువులో ముందుండే సాయి ఇంటర్‌లో మంచి మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. చేతి అందివచ్చిన కొడుకు తమకు అండగా ఉంటాడానని భావించాం. ఇలా ఆకాల మృత్యువుకు బలవుతాడని అనుకోలేదంటూ తండ్రి రామదుర్గారావు కన్నీటి పర్యంతం అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment