సత్యదేవునికే శఠగోపం! | - | Sakshi
Sakshi News home page

సత్యదేవునికే శఠగోపం!

Published Tue, Mar 4 2025 12:16 AM | Last Updated on Tue, Mar 4 2025 12:15 AM

సత్యద

సత్యదేవునికే శఠగోపం!

షార్ట్‌ టెండర్‌ లేకుండానే కాంట్రాక్ట్‌

ఇప్పటి వరకూ రూ.49 లక్షలకే పనులు

ఇప్పుడు ఆరింటిగా విభజించి

రూ.70 లక్షలకు పెంపు

చక్రం తిప్పిన ఓ ఇన్‌స్పెక్టర్‌

అన్నవరం దేవస్థానంపై ప్రతి నెలా రూ.21 లక్షల భారం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం అండతో అక్రమార్కులు ఏకంగా అన్నవరం సత్యదేవుడికే శఠగోపం పెట్టేశారు. నిబంధనలకు పాతరేసి తస్మదీయులకు రూ.లక్షల విలువైన కాంట్రాక్ట్‌ కట్టబెట్టేశారు. నిబంధనల ప్రకారం రూ.5 లక్షలు దాటే పనులకు టెండర్లు పిలవాలి. ఒకవేళ టెండర్లకు సమయం తక్కువగా ఉంటే కనీసం షార్ట్‌ టెండర్‌ అయినా ఆహ్వానించాలి. కానీ, అన్నవరం దేవస్థానంలో కొందరు అధికారులు, టీడీపీ నేతలు కుమ్మకై ్క అటువంటి నిబంధనలకు మంగళం పాడేశారు.

ఏం జరిగిందంటే..

సత్యదేవుని సన్నిధికి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బంది కలగకూడదని పారిశుధ్యం, హౌస్‌ కీపింగ్‌, ధోబీ, ఎలక్ట్రికల్‌ వంటి పనులను కాంట్రాక్ట్‌కు ఇచ్చేందుకు రెండేళ్లకోసారి టెండర్లు పిలుస్తూంటారు. దేవస్థానంలో ఈ పనులను రెండేళ్లుగా ఒక సంస్థ నిర్వహించేది. దీనికి గాను ఆ సంస్థకు ప్రతి నెలా రూ.49 లక్షల చొప్పున చెల్లించేవారు. దీని కాంట్రాక్టు గడువు గత నవంబర్‌తో ముగిసింది. అయినప్పటికీ ప్రభుత్వం టెండర్‌ ద్వారా కొత్త ఏజెన్సీని ఎంపిక చేయలేదు. దీంతో దేవస్థానం అధికారుల అభ్యర్థన మేరకు ఆ ఏజెన్సీ గత నెల 28వ తేదీ వరకూ సేవలు కొనసాగించింది. గడువు ముగిసినా కాంట్రాక్ట్‌ కొనసాగిస్తూ పోతే ప్రతి నెలా తాము రూ.10 లక్షల మేర నష్టపోతామని నెలన్నర క్రితమే ఆ సంస్థ దేవస్థానం అధికారులకు తెలియజేసింది.

చక్రం తిప్పిన ‘నంబర్‌–2’!

గడువు ముగిసినా సేవలు కొనసాగిస్తున్న ఆ సంస్థను తప్పించి, తమ అనుయాయుడికి కట్టబెట్టేందుకు టీడీపీలో నంబర్‌–2గా చెప్పుకొనే ఓ నేత గట్టి ప్రయత్నమే చేశారు. అయితే, ఆ అనుయాయుడికి ఈ పనుల్లో కనీస అనుభవం కూడా లేకపోవడంతో చివరకు వెనుకడుగు వేశారు. అయినప్పటికీ పాత సంస్థ కాంట్రాక్ట్‌ గడువు ముగిసిపోవడంతో.. తాత్కాలిక సర్దుబాటు అనే సాకుతో ఇన్నాళ్లూ ఒకే ఏజెన్సీ నిర్వహించిన పనులను ఆరింటిగా విభజించి, తన అనుయాయులకు కట్టబెట్టారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. పారిశుధ్య కార్మికుల సరఫరా, పారిశుధ్య పనుల నిర్వహణ, శానిటేషన్‌ మెటీరియల్‌ సరఫరా, పెస్ట్‌ కంట్రోల్‌, గార్బేజ్‌ తరలింపు, ధోబీ, ఎలక్ట్రిసిటీ.. ఇలా పనులను విభజించేసి, షార్ట్‌ టెండర్లు పిలవకుండానే గుంటూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్‌తో పాటు పలువురికి కట్టబెట్టేయడం విస్మయానికి గురి చేస్తోంది. దీనికోసం సంబంధిత ఏజెన్సీలతో ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని అంటున్నారు. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకూ నెలకు రూ.49 లక్షలకే జరిగిన ఈ పనులను ఇప్పుడు రూ.70 లక్షలకు పెంచేశారు. దీనంతటి వెనుక టీడీపీలో నంబర్‌–2గా చెప్పుకొనే ఓ సీనియర్‌ నేత చక్రం తిప్పారని, అందువల్లనే టెండర్లతో ప్రమేయం లేకుండానే పనులు కట్టబెట్టేశారని అంటున్నారు. దీనంతటి ఫలితంగా దేవస్థానంపై ప్రతి నెలా రూ.21 లక్షల మేర అదనపు భారం పడుతోంది. ఈ అంశం అన్నవరం కొండపై ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

ముఖ్య నేత ఆదేశాలతో..

‘దేశం’ ముఖ్య నేత ఆదేశాలతో దేవస్థానం అధికారులు దేవదాయ శాఖ కమిషనర్‌కు నోట్‌ ఫైల్‌ పంపించి, ఆగమేఘాలపై అనుమతులు రప్పించారనే ఆరోపణలు వస్తున్నాయి. విజయవాడ నుంచి డెప్యుటేషన్‌పై వచ్చి, గడువు కూడా ముగిసినా దేవస్థానాన్ని వదిలిపెట్టని ఓ ఇన్‌స్పెక్టర్‌ ఈ వ్యవహారంలో చక్రం తిప్పారని కొండపై ప్రచారం జరుగుతోంది. పైగా ఆయన కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన తన సన్నిహితుడికి ఒక విభాగాన్ని ఇప్పించుకున్నారని తెలిసింది. స్వామి సన్నిధిలో సేవలన్నింటినీ ఒకే ఏజెన్సీ నిర్వహిస్తే బాధ్యతగా ఉంటుందనే ఉద్దేశంతో గతంలో తీసుకున్న నిర్ణయాన్ని గాలికొదిలేసి.. అనుయాయులకు అయాచిత లబ్ధి చేకూర్చే పన్నాగం పన్నారని అంటున్నారు. రెండేళ్లుగా ప్రతి నెలా రూ.49 లక్షలకే జరిగిన పనులను.. ఇప్పుడు ఆరింటిగా విభజించి రూ.70 లక్షలు చెల్లించేందుకు దేవదాయ శాఖ ఏవిధంగా ఆమోదం తెలిపిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం తమ వారికి లబ్ధి చేకూర్చాలనే దుర్బుద్ధితోనే ఇలా చేశారని పలువురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఇన్ని లక్షల రూపాయల విలువైన కాంట్రాక్ట్‌ను కనీసం షార్ట్‌ టెండరయినా పిలవకుండా.. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకూ గట్టి లాబీయింగ్‌ చేసి పని చక్కబెట్టేశారని అంటున్నారు. పాత సంస్థ కాంట్రాక్ట్‌ కాలపరిమితి గత నవంబర్‌లోనే ముగిసింది. ఇన్ని నెలలైనా దేవస్థానం అధికారులు షార్ట్‌ టెండర్‌ పిలవాలనే ఆలోచన చేయకపోవడం వెనుక.. తమ వారికి కాంట్రాక్ట్‌ కట్టబెట్టాలనే టీడీపీ నేత వ్యూహం ఉందని కొండపై చర్చ జరుగుతోంది. అన్నవరం దేవస్థానంలో వస్తున్న ఆదాయానికి, ఖర్చులకు పొంతన లేకుండా పోతోందని కొంత కాలంగా భక్తుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో దేవస్థానం అధికారులు ఖర్చులు తగ్గించుకుని, ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలి. అలా కాకుండా అధికార పార్టీ నేతలకు అయాచిత లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
సత్యదేవునికే శఠగోపం!1
1/1

సత్యదేవునికే శఠగోపం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement