సమన్వయంతో మున్సిపాలిటీల అభివృద్ధి
నిడదవోలు: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మున్సిపాలిటీలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు పురపాలక సంఘాల్లోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ (ఆర్‌డీ), అప్పిలేట్ కమిషనర్ సీహెచ్ నాగ నరసింహారావు అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించి, అన్ని విభాగాలనూ పరిశీలించారు. అనంతరం కౌన్సిల్ సమావేశ మందిరంలో నిడదవోలు, రామచంద్రపురం, అమలాపురం, కొవ్వూరు, ముమ్మిడివరం, మండపేట మున్సిపల్ కమిషనర్లు, అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పురపాలక సంఘాల వారీగా పరిపాలన, అభివృద్ధి పనులపై అధికారులను ఆరా తీశారు. రెవిన్యూ, శానిటేషన్, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగాల అధికారుల పని తీరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రీజియన్ పరిధిలోని ఆరు పురపాలక సంఘాల్లో ఆస్తిపన్ను వసూళ్లలో కొవ్వూరు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఖాళీ స్థలాల పన్నుల వసూళ్లకు సంబంధించి రెండు జిల్లాల్లో కొవ్వూరు ప్రథమ స్థానంలో ఉండగా, ఫిబ్రవరి నెలకు గాను ప్రైవేట్ ఆస్తి పన్ను వసూళ్లలో నిడదవోలు 75 శాతంతో ప్రథమ స్థానంలో ఉందని వివరించారు. తడి, పొడి చెత్త సేకరణపై దృష్టి పెట్టాలన్నారు. వేసవిలో మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లే అవుట్ నిర్మాణాలపై ఆరా తీశారు. ప్రజారోగ్యం విషయంలో అలసత్వం తగదని శానిటేషన్ అధికారులకు సూచించారు. అనంతరం పట్టణంలోని కంపోస్ట్ యార్డ్, పంపుహౌస్‌ను నాగ నరసింహారావు సందర్శించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సమావేశంలో నిడదవోలు, కొవ్వూరు, మండపేట, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం కమిషనర్లు టి.కృష్ణవేణి, టి.నాగేంద్ర కుమార్, టీవీ రంగారావు, కేవీఆర్‌ఆర్ రాజు, పి.రవివర్మ వీఐ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఫ పన్ను వసూళ్లలో కొవ్వూరు ఫస్ట్
ఫ మున్సిపల్ ఆర్‌డీ నాగనరసింహారావు
Comments
Please login to add a commentAdd a comment