24, 25 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
రాజమహేంద్రవరం సిటీ: బ్యాంక్ ఉద్యోగులు, అధికారుల సంఘం ఆధ్వర్యాన ఈ నెల 24, 25 తేదీల్లో సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు లక్ష్మీపతిరావు, పాపారావు, శేషుకుమార్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో పార్లమెంట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించి, ఆర్థిక శాఖ అధికారి నాగరాజుకు వినతిపత్రం అందజేశారని మంగళవారం తెలిపారు. వెంటనే అన్ని క్యాడర్ నియామకాలు చేపట్టాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని, తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు ఆపాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 24, 25 తేదీల్లో సమ్మె తప్పదని తెలిపారు.
వేసవిలో విద్యుత్
సమస్యలపై దృష్టి
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వేసవిలో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కోనసీమకు 6 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు కేటాయిస్తామని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. అమలాపురం మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో ఎక్కడా లోఓల్టేజీ సమస్య లేకుండా చూడాలని, ట్రాన్స్‌ఫార్మర్ల ఓవర్ లోడ్‌ను గుర్తించి అందుకు తగిన యాక్షన్ ప్లాన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. వేసవిలో విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ బిల్లుల బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్యానల్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, వినియోగదారులకు చౌకగా సోలార్ విద్యుత్ అందించే విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సర్కిల్ కార్యాలయం ఏర్పాటుకు నల్లవంతెన వద్ద అనువైన భవనాలను పరిశీలించారు. తొలుత ఈదరపల్లిలోని విద్యుత్ కార్యాలయం వద్ద లైన్‌మెన్ దివస్ కార్యక్రమంలో లైన్‌మన్లను సత్కరించారు. సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్.రాజబాబు, టెక్నికల్ డీఈ ఎస్.నాగేశ్వరరావు, ఈఈలు కె.రాంబాబు, కె.రత్నాలరాజు, అక్కౌంట్ ఆఫీసర్ సత్యకిషోర్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
హాకీ జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): అంతర్ జిల్లాల హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపిక స్థానిక జిల్లా క్రీడా మైదానంలో మంగళవారం జరిగింది. జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యాన జరిగిన ఈ ఎంపికలకు 25 మంది హాజరయ్యారు. డీఎస్‌ఏ హాకీ కోచ్ నాగేంద్ర పర్యవేక్షణలో 18 మందిని జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకూ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరిగే అంతర్ జిల్లాల హాకీ పోటీలో పాల్గొంటారు. ఈ జట్టుకు కోచ్‌గా దుర్గాప్రసాద్, మేనేజర్‌గా బాబ్జీ వ్యవహరిస్తారని హాకీ సంఘం ప్రతినిధి రవిరాజు తెలిపారు.
పాదగయకు రూ.11.75
లక్షల ఆదాయం
పిఠాపురం: పాదగయ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి ఆలయం హుండీని మంగళవారం తెరచి ఆదాయం లెక్కించారు. సీఎస్‌ఓ సీహెచ్ రామ్మోహనరావు, ఇన్‌స్పెక్టర్లు వడ్డి ఫణీంద్రకుమార్, జోగా సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ ఈఓ కె.జగన్‌మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని 17 రోజులకు గాను హుండీల ద్వారా రూ.11,74,660 ఆదాయం లభించిందని ఈఓ తెలిపారు.
24, 25 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
24, 25 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
Comments
Please login to add a commentAdd a comment