
లంకలో.. జంకు లేకుండా..
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఇటు రాజమహేంద్రవరం నగరానికి.. అటు కొవ్వూరు పట్టణానికి మధ్యన.. గోదావరి నడుమ అనేక లంకలున్నాయి. కేతావారిలంక, బ్రిడ్జి లంక, వెంకట నగరం లంక వంటివి వీటిలో ముఖ్యమైనవి. ఈ లంకల్లో చిన్నచిన్న పూరిళ్లు కట్టుకుని మత్స్యకారులు నివసిస్తూంటారు. గోదావరిలో చేపల వేట చేసుకుంటూ జీవనం సాగిస్తారు. వరద గోదారి పోటెత్తితే ముందు జాగ్రత్తగా రాజమహేంద్రవరం తీరానికి వచ్చేస్తారు. వరద తగ్గిన తర్వాత తిరిగి ఆయా లంకలకు పయనమవుతారు.
ఈ లంకల్లో ఇటు రాజమహేంద్రవరం, అటు కొవ్వూరుకు చేరువగా బ్రిడ్జి లంక ఉంది. సువిశాలంగా ఉన్న ఈ లంక విస్తీర్ణం సుమారు 100 ఎకరాలు ఉంటుంది. చారిత్రక హేవలాక్ వంతెన (పాత రైల్వే బ్రిడ్జి), కొత్త ఆర్చిల వంతెనల వద్ద ఉండటంతో దీనికి బ్రిడ్జి లంక అనే పేరు వచ్చింది. నిన్నమొన్నటి వరకూ సాధారణంగా అక్కడకు విహారానికి ఎవ్వరూ వెళ్లిన దాఖలాలు లేవు. అటువంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆ లంకకు తరచుగా పదుల సంఖ్యలో జనాలు బోట్లపై రాకపోకలు సాగిస్తున్నారు. ఇటు రాజమహేంద్రవరం, అటు కొవ్వూరు ప్రాంతాల నుంచి భారీగానే జనం బ్రిడ్జి లంకకు వెళ్తున్నారు. ఇలా ఎందుకు వెళ్తున్నారనే దానిపై ఇప్పటి వరకూ అధికారుల పర్యవేక్షణే లేదు.
కోడిపందాలు, పేకాటకు అడ్డాగా..
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత కోడిపందాలు, పేకాట స్థావరాలకు బ్రిడ్జి లంక అడ్డాగా మారిపోయింది. సంక్రాంతి పండగతో సంబంధం లేకుండా.. రాజమహేంద్రవరం నగరం, పరిసర ప్రాంతాల్లో పేకాటలు, కోడిపందాలు నిత్యం జోరుగానే జరుగుతున్నాయి. బయటి ప్రాంతాల్లో బరులు వేసి, పందాలు సాగిస్తే పోలీసు అధికారులతో అప్పుడప్పుడు ఇబ్బందులు తప్పవు. ఈ తలనొప్పి లేకుండా ఉండటానికి, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవడానికి బ్రిడ్జి లంక అనువుగా ఉంటుందని పందాల నిర్వాహకులు భావించారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఈ లంకలో కోడి పందాలు, పేకాట యథేచ్ఛగా సాగుతున్నాయి. రాజమహేంద్రవరంతో పాటు, కొవ్వూరు ప్రాంతం నుంచి పలువురు జూద ప్రియులు బోట్లలో బ్రిడ్జి లంకకు చేరుకుని, కోడి పందాలు, పేకాట ఆడి, తిరిగి రాత్రి సమయాల్లో చేరుకుంటున్నారు.
ఇలా వెళ్తున్నారు
బ్రిడ్జి లంకలో కోడిపందాల నిర్వాహకుడు రాజమహేంద్రవరం, కొవ్వూరు ప్రాంతాల్లోని పందాల ప్రియులకు, జూదరులకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నాడు. పందాలు, జూదాల కోసం వెళ్లే వారి నుంచి ఆయా ప్రాంతాల్లోని బోట్ రైడర్లు రూ.100 చొప్పున వసూలు చేసి, బ్రిడ్జి లంకకు తీసుకుని వెళ్తున్నారు. తిరిగి పందాలు అయిపోయిన తరువాత లంక నుంచి తిరిగి తీరానికి చేరుస్తున్నారు. దీనిలో భాగంగానే సోమవారం మధ్యాహ్నం కోటిలింగాల రేవు నుంచి బోటు రైడర్, హెల్పర్ రూ.100 చొప్పున తీసుకుని 10 మందిని బ్రిడ్జి లంకకు తీసుకుని వెళ్లారు. కొవ్వూరు, రాజమహేంద్రవరం నుంచి అక్కడకు వెళ్లిన సుమారు 40 మంది కోడి పందాలు ఆడారు. పలువురు అక్కడే మద్యం తాగారు. రాత్రి 7.30 గంటల సమయంలో బోట్ రైడర్, హెల్పర్‌తో కలిపి 12 మంది బోటులో తిరుగు పయనమయ్యారు. హేవలాక్ బ్రిడ్జి 7 – 8 పిల్లర్ల మధ్యకు చేరుకునే సరికి లోపలకు నీరు చేరి బోటు మునిగిపోయింది. ఈత వచ్చిన వారు దూకి పిల్లర్లను పట్టుకోగా, స్థానిక మత్స్యకారులు వారిని రక్షించి, గోదావరి ఒడ్డుకు చేర్చారు. స్థానిక సింహాచల నగర్‌కు చెందిన చవల అన్నవరం (54), కాతేరు మిలటరీ కాలనీకి చెందిన గాడా రాజు (24) ఈత రాక మృత్యువాత పడ్డారు.
గోదారిలో కలుస్తున్న నిబంధనలు
రాజమహేంద్రవరం, కొవ్వూరు ప్రాంతాల్లోని గోదావరి ఘాట్లలో ఉన్న బోట్ల నిర్వాహకులు నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు. ఎటువంటి లైఫ్ జాకెట్లు లేకుండా బోట్లలో ఎక్కించేసుకుంటున్నారు. గోదావరి నదిలో ఫ్లోట్ బోటింగ్ హోటల్ ఏర్పాటు చేశాక రాత్రి వేళల్లో మహిళలు సైతం అధిక సంఖ్యలో అక్కడకు వెళ్లి పార్టీలు చేసుకుంటున్నారు. ఫ్లోట్ బోటింగ్‌కు తీసుకుని వెళ్లే బోట్లలో సైతం ప్రయాణికులకు లైప్ జాకెట్లు ఇవ్వడం లేదు. దీనిపై పోలీసులు, పర్యాటక అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
కూటమి సర్కార్ నిర్లక్ష్యం
ఫ ప్రజల ప్రాణాలంటే లెక్కే లేదు
ఫ గోదావరిలో రాకపోకలపై
నియంత్రణ కరవు
ఫ బాధ్యులపై చర్యలు చేపట్టాలి
ఫ తక్షణం కంట్రోలు
రూము ఏర్పాటు చేయాలి
ఫ మృతుల కుటుంబాలకు
ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి
ఫ వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ డిమాండ్
ఫ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా బ్రిడ్జి లంక
ఫ యథేచ్ఛగా కోడిపందాలు, పేకాట
ఫ రాజమహేంద్రవరం – కొవ్వూరు
ప్రాంతాల నుంచి వెళ్తున్న ప్రజలు
ఫ కానరాని అధికారుల పర్యవేక్షణ
ఫ ఈ నేపథ్యంలోనే పడవ
ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వానికి నిర్లక్ష్యానికి ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవు సమీపాన సోమవారం రాత్రి గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పుష్కర్ ఘాట్‌ను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కోటిలింగాల ఘాట్ నుంచి బ్రిడ్జి లంకకు తరచూ బోట్ల మీద జనాలు వెళ్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇలా ఎందుకు వెళ్తున్నారో కూటమి ప్రభుత్వం పర్యవేక్షించకపోవడం దారుణమన్నారు. రాత్రి వేళ బ్రిడ్జి లంకకు వెళ్లాల్సిన అవసరమేమిటో అర్థం కావడం లేదన్నారు.
గతంలో గోదావరి పుష్కరాల సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పుష్కరాల రేవులో 29 మంది ప్రాణాలు కోల్పోయారని మార్గాని భరత్‌రామ్ గుర్తు చేశారు. మళ్లీ పుష్కరాలు రాబోతున్నాయని, ఈ పరిస్థితిల్లో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందో అర్థం కావడం లేదని విమర్శించారు. ఒకవైపు లంకలోని రెస్టారెంట్ వద్దకు టూరిజం బోటులో జనం వెళ్తున్నారని, అటువంటప్పుడు జాగ్రత్తలేమైనా తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని అన్నారు. బోటు ప్రమాదం రాత్రి 7 గంటలకు జరిగితే రెస్క్యూ ఆపరేషన్ టీమ్ రాత్రి 11 గంటల ప్రాంతానికి అక్కడకు చేరుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఎటువంటి ప్రభుత్వ నియంత్రణా లేనందు వల్లనే ప్రమాదం జరిగిందని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో శంకరమఠం ఎదురుగా కంట్రోలు రూము ఏర్పాటు చేయించి, పాపికొండలు టూర్‌ను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టామన్నారు. కనీసం దీనినైనా 24 గంటలూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికై నా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని కంట్రోల్ రూము ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తక్షణం స్పందించి బోటు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, వారికి న్యాయం చేయాలని, ప్రమాద బాధ్యులపై తక్షణ చర్యలు చేపట్టాలని భరత్‌రామ్ డిమాండ్ చేశారు
ఇసుక పైనే దృష్టి
కోటిలింగాల రేవులో స్థానిక ఎమ్మెల్యే అనుయాయుల ఆధ్వర్యాన ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయని, 12, 13 సొసైటీలు రోజూ బోట్ల మీద ఇసుక తవ్వుతూ, వందల లారీల్లో తరలిస్తున్నారని భరత్‌రామ్ ఆరోపించారు. బోట్ల మీద ఇసుక కోసం వెళ్లిన వారు పడవ ప్రమాదంపై కనీసంగా కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారు స్పందించి ఉంటే, ఆ ఇద్దరి ప్రాణాలు దక్కేవని చెప్పారు. డబ్బులు దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజలను కాపాడటంలో లేదని మండిపడ్డారు. మహాశివరాత్రి రోజున తాళ్లపూడి మండలం తాడిపూడిలో ఐదుగురు యువకులు చనిపోవడంతో పాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున.. తగిన కార్యాచరణతో చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గౌతమీ సూపర్ బజార్ స్థలం లీజు విషయంలో తనకు రూ.5 కోట్ల లంచం ఇచ్చినట్లు ఆరోపించిన ఈవీఎం ఎమ్మెల్యే.. ఇప్పుడు అక్కడ నిర్మాణాలు జరుగుతూంటే ఏం చేస్తున్నారో తెలియడం లేదని విమర్శించారు. ఆయనకు డబ్బులు ముట్టాయేమోననే అనుమానం కలుగుతోందన్నారు. అక్రమంగా లీజుకు ఇచ్చారని చెప్పి, ఇప్పుడు నిర్మాణం జరుగుతూంటే ఆపకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. గౌతమీ సూపర్ బజార్ స్థలాన్ని పరిరక్షించే చర్యలు చేపట్టి, నిర్మాణం ఆపాలని, లేకుంటే అక్కడ ధర్నా చేస్తామని భరత్‌రామ్ ప్రకటించారు.

లంకలో.. జంకు లేకుండా..

లంకలో.. జంకు లేకుండా..
Comments
Please login to add a commentAdd a comment