
టిడ్కో ఇళ్లు ఇవ్వడంలో జాప్యం ఎందుకు?
సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు–2లో 1,200 టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మించిన ఇళ్లు పాడవుతున్నాయని ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవుతోందన్నారు. బుధవారం సీపీఐ రాజకీయ ప్రచార జాత 8వ రోజు లో భాగంగా బొమ్మూరు 2 లో టిడ్కో గృహాలను పరిశీలించారు. ఆనంతరం టిడ్కో ఏఈ అనంతలక్ష్మితో మాట్లాడి ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులపై చర్చించారు. అనంతరం ఫేజ్– 1 లో ఉన్న టిడ్కో గృహాలు, బొమ్మూరు సెంటర్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ప్రచార జాత నిర్వహించారు. మధు మాట్లాడుతూ బొమ్మూరు ఫేజ్–1 లో 2,528 గృహాలు నిర్మించారని కానీ 75శాతం మాత్రమే నివసిస్తున్నారని, ఫేజ్–2 లో 1,200 గృహాలు నిర్మించి ఆరు సంవత్సరాలు అవుతున్నా లబ్ధిదారులకి అందజేయకపోవడం దారుణం అన్నారు. బ్యాంకులకు రుణం సొమ్ము కడుతూ, ఇల్లు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని లేని పక్షంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నాయకత్వంలో మేమే వారికి అందజేస్తామని మధు తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షుడు కుండ్రపు రాంబాబు, సీపీఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ, టౌన్ కమిటీ సభ్యులు పి.లావణ్య, టి నాగేశ్వరరావు, టీ త్రిమూర్తులు, జట్టు సంఘం అధికారి బాడీ సభ్యులు అప్పలనాయుడు, బాలకృష్ణ, వెంకట్రావు పాల్గొన్నారు.