
హోటళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి
రాజమహేంద్రవరం సిటీ: పర్యాటకపరంగా జిల్లాలో హోటళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ఆసక్తి ఉన్నవారిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జోనల్ స్పెషల్ అధికారి అజయ్ జైన్ అన్నారు. జిల్లా ప్రగతి, ప్రభుత్వ ప్రాధాన్యం కార్యక్రమాల అమలు, సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై శుక్రవారం ఇక్కడ నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాజమహేంద్రవరంతో పాటు జిల్లాలో 5 వేల హోటల్ రూములు అందుబాటులోకి తీసుకుని రావాలన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. పీఎం సూర్యఘర్ పథకానికి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో 15.57 శాతం, హార్టికల్చర్ 16.33, పశు సంవర్ధక శాఖ 19.76, అటవీ రంగం 0.16, మత్స్య రంగం 2.92, తయారీ రంగం 7.93, వనరులు, నిర్మాణ రంగంలో 8.36 శాతం చొప్పున వృద్ధి రేటు సాధించేలా చర్యలు తీసుకోనున్నామని వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న అజయ్ జైన్