
నచ్చిన చోట ధాన్యం అమ్ముకోవచ్చు
ఉండ్రాజవరం: ధాన్యానికి కనీస మద్దతు ధర కంటే అధికంగా లభిస్తే, రైతులు తమకు నచ్చిన చోట అమ్ముకోవచ్చని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడుతో కలసి మోర్త గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. తొలుత రైతు సేవా కేంద్రం వద్ద మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, రబీ ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 2 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామన్నారు. ధాన్యం తేమ శాతం విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, ఎలా ఉన్నా సేకరించాలని అధికారులకు సూచించారు. నాణ్యత లేని సంచులు ఇవ్వరాదన్నారు. ఆన్‌లైన్‌లో ధాన్యం కొనుగోలుకు స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టారన్నారు. ఇందులో భాగంగా రైతులు ఇంట్లోనే కూర్చుని తమ వాట్సాప్ నుంచి 73373 59375 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే కావాల్సిన సమాచారం, సమస్యకు పరిష్కరం లభిస్తాయని మంత్రి చెప్పారు. జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ, ధాన్యం సేకరణకు మిల్లర్లు సరఫరా చేసే గోనె సంచులు నాణ్యతగా ఉండాలనే ఉద్దేశంతో వాటిపై ఆయా మిల్లర్ల క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ రాణి సుస్మిత, జిల్లా ఇన్‌చార్జి పౌర సరఫరాల అధికారి ఎస్.భాస్కరరెడ్డి, తహసీల్దార్ పీఎన్‌డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.