
పాస్టర్ ప్రవీణ్‌ది హత్యేనన్నది నా నమ్మకం
● అనుమానం వ్యక్తం చేస్తే కేసు పెట్టారు
● మాజీ ఎంపీ హర్షకుమార్
రాజమహేంద్రవరం సిటీ: పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్యేనన్నది తన నమ్మకమని, అలా కాదని నమ్మకం కలిగించాల్సింది పోలీసులేనని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ కేసులో అయినా మూడో రోజు పోస్టుమార్టం నివేదిక ఇవ్వాల్సి ఉందని, అటువంటిది పాస్టర్ ప్రవీణ్ మృతి చెంది 14 రోజులయినా ఇప్పటి వరకూ పోస్ట్‌మార్టం నివేదిక బయటపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. దీనికి సీఎం చంద్రబాబు, పోలీసులు బాధ్యత వహించాలన్నారు. ఇదంతా చూస్తూంటే హత్యను ప్రమాదంగా చూపాలనే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. పోస్టుమార్టం నివేదిక ఎందుకు రావడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రవీణ్ మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం చేయించేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశానని, ఈ నేపథ్యంలోనే పోస్ట్‌మార్టం నివేదిక బయట పెట్టకుండా వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. ప్రవీణ్ మృతిపై వ్యక్తమవుతున్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. పోలీసులు ఎంత త్వరగా ప్రెస్‌మీట్ పెడితే అంత మంచిదని హితవు పలికారు. ప్రవీణ్ మద్యం కొనుగోలు చేసినవి వీడియోలు ఫేక్ అని ఐజీ స్వయంగా చెప్పారని, వాటిని ఎవరు తయారు చేసి, విడుదల చేశారో ఎందుకు కనిపెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రవీణ్ మృతిని తొలి నుంచీ యాక్సిడెంట్‌గానే రుజువు చేయాలని చూస్తున్నారన్నారు. అనుమానం వ్యక్తం చేస్తే తనపై తప్పుడు కేసు పెట్టారన్నారు. ప్రవీణ్ మరణం విషయంలో నిజం బయటకు రావాలన్నానే తప్ప తాను ఏ మతం పైనా నిందలు వేయలేదని అన్నారు. అన్ని మతాలనూ ఆచరించే సెక్యులర్ భావాలుఉన్న కుటుంబం తమదని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై ప్రవీణ్ భార్య జెస్సికా నమ్మకం ఆమె ఇష్టమని, హత్య చేశారన్నదే తన నమ్మకమని హర్షకుమార్ పునరుద్ఘాటించారు.
హర్షకుమార్‌పై కేసు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మాజీ ఎంపీ హర్షకుమార్‌పై కేసు నమోదు చేసినట్లు రాజానగరం పోలీసులు శనివారం వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు ఆయనపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 196, 197 కింద కేసు నమోదు చేశారు. ప్రవీణ్ పగడాలను హత్య చేసి పడేశారని, కేసును పోలీసులు పక్కదోవ పట్టిస్తున్నారని హర్షకుమార్ ఇటీవల ఆరోపించారన్నారు. దీనిపై విచారణకు వచ్చి ఆధారాలు సమర్పించాలని ఆయనకు నోటీసులు ఇచ్చామన్నారు. విచారణకు హాజరు కాకపోగా తిరిగి అవే ఆరోపణలు చేయడంతో తాజాగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.