
జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా పలువురు ఘనంగా నివాళి అర్పించారు. స్థానిక జాంపేట చర్చి సెంటర్‌లో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ డి.నరసింహ కిషోర్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సును ఆకాంక్షించే వ్యక్తిగా జగ్జీవన్‌రామ్ చేసిన కృషిని కొనసాగిస్తూ, మరికొందరికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎంఎస్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
గామన్ బ్రిడ్జిపై నేటి నుంచి వన్ వే
కొవ్వూరు: అఖండ గోదావరి నదిపై రాజమహేంద్రవరం రూరల్ కాతేరు – కొవ్వూరు మధ్య ఉన్న రెండు వరుసల గామన్ ఇండియా బ్రిడ్జిపై ఆదివారం నుంచి వన్‌వే అమలు చేస్తున్నారు. వార్షిక మరమ్మతుల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ వరకూ ఒకవైపు ఉన్న బ్రిడ్జి పైనుంచే రెండువైపుల వాహనాలనూ అనుమతిస్తామని టోల్‌ప్లాజా మేనేజర్ రాజీవ్‌సింగ్ శనివారం తెలిపారు. కొవ్వూరు నుంచి కాతేరు వైపు వెళ్లే వాహనాలను రెండో లైన్ మీదుగా అనుమతిస్తామన్నారు. ఇప్పటి వరకూ విశాఖపట్నం వైపు నుంచి వస్తున్న వాహనాలు ఒక బ్రిడ్జిపై, కొవ్వూరు వైపు నుంచి వెళ్లే వాహనాలు మరో వంతెనపై ప్రయాణిస్తున్నాయి. తాజా వన్‌వే అమలు నేపథ్యంలో ఒక్క వంతెన పైనే రెండువైపుల వాహనాలనూ అనుమతిస్తారు. రెండో వంతెనకు మరమ్మతులు నిర్వహిస్తారు. వన్‌వేకు వాహనదారులు సహకరించాలని రాజీవ్‌సింగ్ కోరారు.
8 నుంచి ఇండో – అమెరికా సైనిక విన్యాసాలు
కాకినాడ రూరల్: భారత్ – అమెరికా దేశాల సైనిక దళాల సంయుక్త విన్యాసాలకు కాకినాడ సాగర తీరం మరోసారి వేదిక కానున్నది. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, పరసర్ప నైపుణ్యం పెంపొందించుకునే లక్ష్యంతో టైగర్ ట్రయాంఫ్–2025 పేరిట 13 రోజుల పాటు ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఈ నెల 1న విశాఖ సాగర తీరంలో ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. దీనికి కొనసాగింపుగా ఈ నెల 8 నుంచి కాకినాడ తీరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విన్యాసాలు ఈ నెల 13న కాకినాడలో ముగియనున్నాయి. తూర్పు నౌకాదళంతో పాటు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు, అమెరికా సైనిక దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. కాకినాడ సూర్యారావుపేటలోని నేవల్ ఎన్‌క్లేవ్ వద్ద ఇరు దేశాల ఉమ్మడి విన్యాసాల నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ నుంచి వచ్చిన నావికా దళాలు గుడారాలు ఏర్పాటు చేసుకుని తమ పనిలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం తూర్పు నౌకాదళ పరిధిలోని విశాఖ, కాకినాడ తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో ఐఎన్‌ఎస్ జలాశ్వ, యూఎస్‌ఎస్ కామ్‌స్టాక్ ద్వారా ఇండో, అమెరికా నావికా దళాలు విన్యాసాలు కొనసాగిస్తున్నాయి.
కిటకిటలాడిన శృంగార
వల్లభుని ఆలయం
పెద్దాపురం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయ శనివారం కిటకిటలాడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా ఆలయానికి రూ.3,25,934 ఆదాయం సమకూరిందని ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.

జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి

జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి