
ఆత్మహత్య కాదు హత్యే అంటూ నిరసన
పోలీసుల అదుపులో 17 మంది
సీతానగరం: మండలంలోని రాపాక పంచాయతీ పరిధిలోగల శ్రీరామనగరంలోగల రాజుగారి కల్యాణ మండపంలో ఆదివారం రామచంద్రపురానికి చెందిన వేమగిరి సునీల్ (26) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోలేదని, అది హత్యేనంటూ బంధువులు, స్నేహితులు రాజుగారి గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద నిరసన చేపట్టారు. సోమవారం రాజమహేద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సునీల్ మృతదేహం అంబులెన్స్‌లో తీసుకువచ్చి ఫంక్షన్ హాల్ వద్ద నిరసన తెలిపారు. మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి కిందకు దించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఫంక్షన్ హాల్ యజమాని రాజు, హైదరాబాద్ నుంచి వచ్చిన మహిళ సునీల్‌ను హత్య చేశారని, వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కోరుకొండ ఇన్‌చార్జి సీఐ, రాజమహేంద్రవరం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ బాలసౌరి అక్కడికి వచ్చారు. సీతానగరం – రాజమహేంద్రవరం రోడ్డుపై ధర్నాకు ప్రయత్నించగా ఎస్సై డి.రామ్‌కుమార్ తన సిబ్బందితో అడ్డుకుని 17 మందిని అదుపులోకి తీసుకుని కోరుకొండ తరలించారు. ఇన్వెష్టిగేషన్ ఆఫీసర్ బాలసౌరి విలేకరులతో మాట్లాడుతూ మృతుడు సునీల్‌కు వరుసకు మరదలైన మహిళ హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం ప్రయివేట్ బస్‌లో సీతానగరం చేరుకుందని, రాజు గారి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో గది తీసుకున్నారన్నారు. సాయంత్రం 4 గంటలకు మహిళ బాత్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వచ్చే సరికి సునీల్ ఉరివేసుకుని ఉన్నాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.