
పూర్వ విద్యార్థుల భూరి విరాళం
హెచ్‌ఎంకు రూ.6లక్షల చెక్కు అందజేత
రాయవరం: సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం చదువుకుని వివిధ రంగాల్లో స్థిరపడిన స్నేహితులంతా తిరిగి అదే చదువులమ్మ చెట్టు నీడకు మరోసారి చేరుకున్నారు. ఇంత స్థాయికి చేరుకోవడానికి కారణమైన పాఠశాల అభివృద్ధికి మిత్రులంతా కలిసి భారీ విరాళాన్ని అందజేశారు. రాయవరం శ్రీరామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 1975–80 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు సోమవారం పాఠశాల హెచ్‌ఎం వీఎస్ సునీతకు రూ.6లక్షల చెక్కును అందజేశారు. పూర్వ విద్యార్థులు ఆర్‌వీవీ సత్యనారాయణచౌదరి, తాడి వెంకటరెడ్డి, కె.సత్యనారాయణరెడ్డి, కె.వెంకటరెడ్డి, ఎం.సూరారెడ్డి తదితరులు పాఠశాల హెచ్‌ఎంకు చెక్కును అందజేశారు. పూర్వ విద్యార్థి ఆర్‌వీవీ సత్యనారాయణచౌదరి మాట్లాడుతూ పాఠశాల భవనంలోని ఒక తరగతి గదికి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ సొమ్మును వినియోగించాలని హెచ్‌ఎం సునీతకు సూచించామన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ వుండవిల్లి రాంబాబు, ఎస్‌ఎంసీ చైర్మన్ దేవిశెట్టి చిన్ని, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.