
వెంకన్న పెళ్లికొడుకాయనె
ఘనంగా ప్రారంభమైన కోనేటి రాయుడి కల్యాణోత్సవాలు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిచెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాలు సోమవారం కన్నుల పండువగా ప్రారంభమయ్యా యి. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో కల్యాణ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు, భక్తుల కు సౌకర్యాలు కల్పించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపేలా సుందరంగా అలంకరించారు. బొబ్బర్లంక – రావులపాలెం ప్రధాన రహదారి నుంచి వాడపల్లికి వెళ్లే రహదారుల ముఖద్వారాల్లో కల్యాణోత్సవ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో వేద పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు, ఆలయ అర్చకులు స్వామివారిని వేకువ జామున పెండ్లి కుమారునిగా అలంకరించారు. వేద పండితుల మంత్రాలు, మేళతాళాల నడుమ ఈ వేడుక నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వారి గోత్ర నామాలతో పెండ్లి కుమార్తెలుగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6–15 గంటలకు స్వామివారి ధ్వజారోహణ, అంకురార్పణ, నిత్య బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్‌డీఓ పీ శ్రీకర్, సీఐ సీహెచ్ విద్యాసాగర్ కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
నేడు స్వామివారి కల్యాణోత్సవం
వాడపల్లి క్షేత్ర ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాన్ని మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించనున్నట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3గంటలకు స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నామన్నారు. ప్రజాప్రతినిదులు, నాయకులు, ఽఅధికారులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. రథోత్సవం, కల్యాణ వేడుకల్లో భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

వెంకన్న పెళ్లికొడుకాయనె