
దివాన్‌చెరువులో చైన్ స్నాచింగ్
రాజానగరం: ఓ మహిళ మెడ నుంచి బంగారు గొలుసును అపహరించిన సంఘటన పట్టపగలే దివాన్‌చెరువులో చోటుచేసుకుంది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో రైస్ మిల్లు వీధిలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నీలంతోటకు చెందిన ఇద్దరు మహిళలు రైసు మిల్లు వీధిలో బంధువుల ఇంటికి కాలినడక బయలుదేరారు. ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి యూ టర్న్ తీసుకుని ఓ మహిళ మెడలో ఉన్న ఒకటిన్నర కాసుల బంగారు గొలుసును లాక్కుపోయారు. ఈ ఘటనలో ఆమె మెడకు తీవ్ర గాయమైంది. బైకు నడిపిన వ్యక్తి 40 ఏళ్లలోపు, వెనుక కూర్చున వ్యక్తికి 50 ఏళ్లు పైబడి వయస్సు ఉంటుందని బాధితురాలు తెలిపారు. గొలుసు లాక్కున్న వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న బొమ్మూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వివరాల కోసం సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గత రాత్రి ఓ బైకు అపహరణకు గురైంది.