
నేడు ఇంటర్ ఫలితాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. గత నెల 1 నుంచి 19వ తేదీ వరకూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 127 జూనియర్ కళాశాలలుండగా 51 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల స్పాట్ వేల్యుయేషన్ గత నెల 17 నుంచి ఈ నెల 4వ తేదీ వరకూ నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను మన మిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009కు హాయ్ అని మెసెజ్ పంపడం ద్వారా చూసుకోవచ్చు. అలాగే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రిజల్ట్స్‌బీఐఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో కూడా చూసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం 22,817 మంది, రెండో సంవత్సరం 20,937 మంది కలిపి మొత్తం 43,754 మంది వి ద్యార్థులు పరీక్షలు రాశారు. నూరు శాతం ఫలి తాలు లక్ష్యంగా ఇంటర్ బోర్డు అధికారులు కార్యాచరణ రూపొందించి, అమలు చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. పరీక్షల్లో ఉత్తీర్ణత, మంచి మార్కు లు ఎలా సాధించాలనే దానిపై అవగాహన కల్పించారు. నమూనా పరీక్షలు నిర్వహించారు.
బీఈడీ రికార్డుల మూల్యాంకనం పరిశీలన
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో జరుగుతున్న బీఈడీ రికార్డుల మూల్యాంకనాన్ని ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ శుక్రవారం పరిశీలించి, సిబ్బందికి సూచనలిచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాలల విద్యార్థులకు చెందిన 2,500 రికార్డుల మూల్యాంకన ప్రక్రియను ఇక్కడి సెమినార్ హాలులో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, ప్రిన్సిపాల్ కె.సుబ్బారావు, అధ్యాపకులు పాల్గొన్నారు.