
పోలీసుల దర్యాప్తు నమ్మశక్యంగా లేదు
పాస్టర్ ప్రవీణ్ మృతిపై మాజీ ఎంపీ
హర్షకుమార్ వ్యాఖ్యలు
రాజమహేంద్రవరం సిటీ: హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిలో పోలీసుల దర్యాప్తు నమ్మశక్యంగా లేదని ఇప్పటికీ ప్రవీణ్ మృతి ఆక్సిడెంట్ వల్ల జరగలేదని నమ్ముతున్నానని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పోలీసులు మొదటి నుంచి యాక్సిడెంట్ కోణంలోనే దర్యాప్తు చేశారన్నారు. ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ అయితే ప్రవీణ్ బ్యాంక్ ఖాతాలు ఎందుకు సీజ్ చేశారో, ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్‌లు పోలీసులు ఎందుకు పట్టుకెళ్లారో అర్థం కావడం లేదన్నారు. ప్రవీణ్ షెడ్యూల్ ప్రకారం ప్రమాదం జరిగిన రోజు మహారాష్ట్రలో ఉండాలని అన్నారు. విజయవాడ, కొవ్వూరులో సమావేశాలకు ప్రవీణ్‌ను పిలిచింది ఎవరు అనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చాలన్నారు. పోలీసులు ఇటువంటి నాన్‌సెన్స్ ఇన్వెస్టిగేషన్‌లు చేసి ప్రవీణ్ మద్యం సేవించి మృతి చెందాడనే విషయం చెప్పడం మానుకోవాలన్నారు. ప్రవీణ్ మృతిపై అనుమానం ఉన్న వారంతా నోరు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ మృతిపై దర్యాప్తునకు మరింత ముందుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు.
పోలీసులకు
సహకరించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజలు వేడుకలను నిర్వహించుకోవాలని ఎస్పీ డి.నరసింహకిశోర్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ వేడుకలలో భాగంగా, శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.