
లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే నెల 10వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ గంధం సునీత సూచించారు. అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ, ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాలను జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జిషీట్ ఫైలింగ్ విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు, జామీనుల విషయంలో ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంబంధిత అధికారులకు తగిన సిఫారసులు చేశారు. ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాచరణ, బాధితుల కేసులపై చర్చించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్‌కే జానీ బాషా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి, జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీ సుబ్బరాజు, కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ప్రభుత్వ న్యాయవాది సీహెచ్‌వీ ప్రసాద్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.రాధాకృష్ణంరాజు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు, ప్రత్యేక మహిళా జైలు అధికారులు, జిల్లా సబ్ జైలు అధికారి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.