
నర్సరీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి
కడియం: కడియపులంకలోని శ్రీ శివాంజనేయ నర్సరీని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు మంగళవారం సతీసమేతంగా సందర్శించారు. ఆయనకు నర్సరీ అధినేత మల్లు పోలరాజు స్వాగతం పలికి, బోన్సాయ్, ఆయుర్వేద తదితర మొక్కల గురించి వివరించారు. కడియం ప్రాంత నర్సరీ రైతులు స్వీయ నైపుణ్యంతో మొక్కలను అభివృద్ధి చేస్తూండటాన్ని జస్టిస్ మల్లికార్జునరావు అభినందించారు.
25న జాబ్ ఫెస్ట్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కాలేజియేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ సహకారంతో స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 25న జాబ్ ఫెస్ట్–2025 నిర్వహించనున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్‌కే మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. డిగ్రీ, పీజీ ఫైనలియర్ చదువుతున్న, పాసైన విద్యార్థులకు 40 కంపెనీలతో ఈ జాబ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జాబ్ ఫెస్ట్ ఏర్పాట్లపై సంబంధిత ప్రిన్సిపాళ్లు, ప్లేస్‌మెంట్ కో ఆర్డినేటర్లు, స్కిల్ డెవలప్‌మెంట్ సిబ్బంది తదితరులతో చర్చించారు. జాబ్ ఫెస్ట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ప్రతి కళాశాల నుంచి విద్యార్థులందరూ హాజరై, జాబ్ ఫెస్ట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీరామ్మూర్తి, జేకేసీ కో ఆర్డినేటర్ బి.హరినాథ్‌రెడ్డి, నోడల్ రీసోర్స్ సెంటర్ కో ఆర్డినేటర్ సీహెచ్ సంజీవ్ కుమార్, స్కిల్ డెవలప్‌మెట్ అధికారి వీడీజీ మురళి, గణిత విభాగాధిపతి జి.చంద్రశేఖర్, ప్లేస్‌మెంట్ ట్రైనర్ ఎం.కిరణ్ కుమార్, స్కిల్ డెవలప్‌మెంట్ ప్లేస్‌మెంట్ కో ఆర్డినేటర్ ప్రియ పాల్గొన్నారు.
వర్సిటీ ప్రగతికి ప్రణాళికలు
రూపొందించాలి
రాజానగరం: యూనివర్సిటీ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నూతన ఆలోచనలతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మంగళవారం నిర్వహించిన ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో ఆమె పాల్గొన్నారు. హైదరాబాద్‌కు చెందిన డీఆర్‌డీఓ అడ్వాన్స్‌డ్ సిస్టమ్ లేబొరేటరీ సైంటిస్టు కె.వీరబ్రహ్మం మాట్లాడుతూ, సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. వివిధ సంస్థల నుంచి యూనివర్సిటీకి సీఎస్‌ఆర్ నిధులు తీసుకువచ్చి, అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

నర్సరీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి