
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించి, నివారణ దిశగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు ఎస్పీ డి.నరసింహాకిశోర్ అదేశించారు. సీసీటీఎన్‌ఎస్ సమాచారం ద్వారా నెలవారీ నేర సమీక్షా సమావేశం జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గ్రేవ్ ఎక్విటల్ కేసులు, మిస్సింగ్ కేసులు, పొక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీట్ హోల్డర్స్‌పై ప్రత్యేకంగా నిఘా ఉంచి వారి కదలికలు పసిగడుతూ ఉండాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించదగ్గ కేసులు ఉంటే ఆ దిశగా పనిచేయాలన్నారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్షలో అడిషనల్ ఎస్పీలు ఎన్‌బీఎం మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు, ఎల్.అర్జున్, ఎస్‌బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్ రెడ్డి, జోనల్ డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
పాలిసెట్‌కు నేడు తుది గడువు
రాయవరం: పదో తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే ‘పాలిసెట్’ దరఖాస్తుకు గురువారం సాయంత్రంతో గడువు ముగియనుంది. ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ విడుదలైన విషయం పాఠకులకు విదితమే. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు లభిస్తాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు తుది గడువు గురువారంతో ముగుస్తున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4,236 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.