
లారీ డ్రైవర్‌కు ఆరు నెలల జైలు
సామర్లకోట: ఇద్దరు మహిళల మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు ఆరు నెలల జైలు, రూ.5,500 జరిమానా విధిస్తూ కాకినాడ ఐదవ కోర్టు మెజిస్ట్రేట్ షేక్ షరీన్ గురువారం తీర్పు ఇచ్చారని సీఐ ఎ.కృష్ణభగవాన్ తెలిపారు. 2022, నవంబర్ 10వ తేదీన పీబీ దేవం రైల్వే గేటు ఎదురుగా ఇద్దరు మహిళలను లారీ ఢీ కొంది. వేట్లపాలెం నుంచి ద్వారపూడి అయ్యప్పస్వామి గుడికి నడిచి వెళుతున్న సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ మహిళలను ఢీ కొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనకాపల్లి జిల్లా గుట్టివాడకు చెందిన అద్దం భాస్కరం లారీని నిర్లక్ష్యంగా నడపడం వలన ఈ ప్రమాదం జరిగిందని అప్పటి ఎస్సై టి.సునీత కేసు నమోదు చేశారు. ప్యాసిక్యూషన్ తరఫున పీపీ రఘువీర్ వాదించారు.
అక్రమంగా తరలిస్తున్న 85 గోవుల పట్టివేత
నల్లజర్ల: ఒడిశా రాష్ట్రం నవరంగ్‌పూర్ నుంచి ప్రత్యేక కంటైనర్‌లో హనుమాన్ జంక్షన్‌కు అక్రమంగా తరలిస్తున్న 85 గోవులను నల్లజర్ల శివార్లలో ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ కంటైనర్‌లో బంధించిన 85 గోవులను నల్లజర్ల పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. దీనిపై ఎస్సై రమేష్ కేసు నమోదు చేశారు. వీటన్నింటినీ తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని గోశాలకు అప్పగించనున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ దాడిలో హిందూ ధర్మరక్షణ ప్రచారక్ ఉప్పలపాటి మాధవరావు, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు గుంటముక్కల రామకృష్ణ, సవలం రామకృష్ణ, మద్దూరి విష్ణుమూర్తి, తాడేపల్లిగూడెం గో సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.