వరద సాయం.. తూతూమంత్రం! | - | Sakshi
Sakshi News home page

వరద సాయం.. తూతూమంత్రం!

Published Wed, Aug 7 2024 2:34 AM | Last Updated on Wed, Aug 7 2024 1:43 PM

No He

No Headline

వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 44 గ్రామాల్లో నష్టం

కళ్ల ముందే కనిపిస్తున్నా.. రేషన్‌ కార్డు ఉంటే సాయమంటూ నిబంధన

రూ.3 వేల తక్షణ సాయం కొన్ని కుటుంబాలకే

నేటికీ అరకొరగానే బియ్యం పంపిణీ

ఇళ్లు ధ్వంసమైనా, దెబ్బతిన్నా రూ.3 వేలతోనే సరిపెట్టుకోవాలి

సాక్షి ప్రతినిధి, ఏలూరు: అసలే ముంపు మండలాలు.. ఆపై గోదావరి ఉగ్రరూపం చూపితే.. వారి బతుకులు ఛిన్నాభిన్నమే. పునరావాస కేంద్రాలు, కొండ గట్లకు చేరుకుని రోజుల తరబడి ఉండిపోతారు. గోదావరి శాంతించాక బురదలోనే ఇళ్ళకు వెళ్ళి బాగుచేసుకుంటారు. తిప్పలుపడి చిన్నపాటి గుడిసెలు ఏర్పాటు చేసుకుంటారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఏటా వరద విలయం కొనసాగుతుండడతో.. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో వరద బాధితులను ఆదుకుంది. ప్రస్తుత ప్రభుత్వం వారిని ఆదుకుంటామన్న ప్రచారం తప్ప పూర్తి స్థాయిలో అందరికీ సాయం అందని పరిస్థితి. రేషన్‌ కార్డు అర్హతే ప్రామాణికం అంటూ వందల మందికి పరిహారాన్ని ఎగ్గొట్టారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో బాధితులు ఉన్నారు.

50 శాతం మందికి అందని సాయం
పెద్దవాగు ఉధృతి, గోదావరి వరదకు ఏలూరు జిల్లా వేలేరుపాడులోని 43 గ్రామాలు, కుక్కునూరులో ఒక గ్రామం దెబ్బతింది. అధికారులంతా అక్కడే ఉండాలని ప్రభుత్వం రెండు రోజులు హడావుడి చేసి ఆ తరువాత దాని సంగతి పూర్తిగా మరిచిపోయింది. వేలేరుపాడులోనే పెద్దవాగు దాటికి 12 గ్రామాలు, గోదావరి వరద ఉధృతికి 31 గ్రామాల్లో 18 వేల మందికి పైగా నష్టపోయారు. సుమారు 7200కు పైగా కుటుంబాలు నష్టపోయాయి. అత్యధిక శాతం మంది పునరావాస కేంద్రానికి వెళ్ళగా ఎక్కువ మంది కొండ గుట్లపైనే మకాం ఉన్నారు. వారికి భోజనం, వసతి మొదలుకొని కొవ్వొత్తుల వరకు సరిగా ఏదీ పంపిణీ జరగలేదు. ప్రతి కుటుంబానికీ రూ.3 వేలు సాయం అందిస్తామని ప్రకటించి, రేషన్‌ కార్డు ఉన్నవారికే సాయం అంటూ అనేక మందికి పరిహారం ఎగ్గొట్టారు. 25 కేజీల బియ్యం, కందిపప్పు, లీటరు నూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలతో పాటు కూరగాయలు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించి రెండు రోజులు హడావుడి చేశారు. 50 శాతం మందికి అందని పరిస్థితి.

జగన్‌ పాలనలో అందరికీ సాయం..
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు గోదావరి వరద ముంపు మండలాల్లో పర్యటించారు. తక్షణ సాయం, నిత్యావసరాలు, నూరు శాతం అందించాలని ఆదేశించి క్షేత్రస్థాయిలో బాధితులకు భరోసా ఇచ్చారు. నష్టపోయిన కుటుంబాలే కాకుండా మండలాన్ని, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రతి ఇంటికీ పరిహారంతో పాటు నిత్యావసరాలు అందజేశారు. పునరావాస కేంద్రాల్లో రెండు పూటలా భోజనం, టిఫిన్లు, టీ ఏర్పాటుతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించాయి. ఈ సారి పునరావాస కేంద్రాలు సక్రమంగా నిర్వహించకపోవడం, అరకొర సౌకర్యాలు, ఇతర కారణాలతో ఏమీ పట్టించుకోలేదు.

రేషన్‌ కార్డు ఉంటేనే..
కళ్ళ ముందే నష్టం కనిపిస్తున్నా రేషన్‌ కార్డు కావాలని అడ్డగోలు నిబంధన పెట్టి కార్డు లేనివారికి రూ.3 వేల సాయం అందించలేదు. వాస్తవానికి వేలేరుపాడు మండలంలో 7200 కుటుంబాలకు పైగా నష్టపోయారు. అధికారుల అంచనా మాత్రం తక్కువగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం పెద్దవాగు వల్ల 12 గ్రామాల్లో 1647 కుటుంబాలు, గోదావరి వరద వల్ల 3278 కుటుంబాల నిరాశ్రయులయ్యారు. మొత్తం 4925 మంది వరద వల్ల నిరాశ్రాయులైనట్టు అధికారులు చెబుతున్నారు. పరిహారం మాత్రం 4025 కుటుంబాలకే ఇచ్చారు. మిగిలిన వారికి రేషన్‌కార్డులు లేకపోవడంతో పరిహారం తీసుకునే అర్హత లేదని తేల్చేశారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఇల్లు దెబ్బతింటే రూ.95 వేలు, గుడిసె దెబ్బతింటే రూ.10 వేలు పరిహారం అందించారు. ఇప్పుడు ఇంటి నష్టాలకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని పరోక్షంగా తేల్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement