
స్వాహా చేసిన చెట్ల సొమ్ము పంచాయతీకి జమ
ఎఫెక్ట్
ద్వారకాతిరుమల: మండలంలోని గుండుగొలనుకుంటలో కొందరు కూటమి నేతలు స్వాహా చేసిన చెట్ల సొమ్మును ఎట్టకేలకు బుధవారం పంచాయతీకి జమ చేశారు. వివరాల్లోకి వెళితే. గుండుగొలనుకుంట నుంచి కామవరపుకోట మండలం వడ్లపల్లికి వెళ్లే గ్రావెల్ రోడ్డుకు మరమ్మతులు చేయించే పేరుతో, రహదారి మార్జిన్‌లోని చెట్లను కొందరు కూటమి నేతలు 6 నెలల క్రితం నరికించి, కలపను విక్రయించారు. ఆ సొమ్మును పంచాయతీకి జమ చేయకుండా, కనీసం రోడ్డుకు మరమ్మతులు చేయించకుండా స్వాహా చేశారు. దీనిపై గతనెల 30న సాక్షి దినపత్రికలో ‘చెట్ల సొమ్ము స్వాహా’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు విచారణ జరిపి, చెట్లు కలప విక్రయించగా వచ్చిన సొమ్మును పంచాయతీకి జమ చేయాలని సదరు నేతలకు సూచించారు. అయితే మొదట్లో మొండికేసిన ఆ నేతలు చివరకు పంచాయతీకి రూ. 56 వేలను జమ చేశారు. ఈ నగదుతో గుండుగొలనుకుంట – వడ్లపల్లి రోడ్డుకు మరమ్మతులు చేయిస్తామని ఎంపీడీవో ప్రకాష్ తెలిపారు.

స్వాహా చేసిన చెట్ల సొమ్ము పంచాయతీకి జమ