వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!

Apr 5 2025 1:28 AM | Updated on Apr 5 2025 1:28 AM

వేసవి

వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!

పాలకొల్లు సెంట్రల్‌: వేసవిలో చిన్నారులకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి ప్రారంభమైందంటే చాలు చికెన్‌ పాక్స్‌(ఆటలమ్మ), గవద బిళ్లలు వంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటి నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు పాలకొల్లు మండలం లంకలకోడేరు పీహెచ్‌సీ వైద్యుడు అడ్డాల ప్రతాప్‌ కుమార్‌.

చికెన్‌ పాక్స్‌ అన్ని వయసుల వారికి సోకినా.. ముఖ్యంగా చిన్నారులకు వేగంగా సోకే ప్రమాదం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి సోకిన వారు ఆహారం సరిగా తీసుకోలేకపోవడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో నీరసంగా కనిపిస్తుంటారు. ఆటలమ్మ, గవద బిళ్లల లక్షణాలు కనిపించిన వెంటనే సంబందిత వైద్యులను సంప్రదించాలి. వ్యాధి తీవ్రతను బట్టి వైద్యుల సూచనల మేరకు యాంటీ వైరల్‌, యాంటీ బయోటిక్‌ మందులు వాడాల్సి ఉంటుంది.

గవద బిళ్లలు

చల్లటి పానీయాలు అతిగా తీసుకోవడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గి గవద బిళ్లలు వస్తాయి. ప్రధానంగా లాలాజల గ్రంధులు ఉబ్బడంతో గవద బిళ్లలు ఏర్పడతాయి. గోరు వెచ్చని నీళ్లు తాగాలి. ఏ ఆహారం తిన్నా నోటిలో నీళ్లు వేసుకుని పుక్కిలించాలి. ఎంఎంఆర్‌ టీకా వేయించుకోవడం వల్ల గవద బిళ్లలు రాకుండా నివారించవచ్చు. గవద బిళ్లలకు మందులు వాడితే మూడు రోజుల్లో తగ్గుతుంది. వాపు ఎక్కువగా ఉంటే తగ్గడానికి ఏడు రోజులు పడుతుంది.

చికెన్‌ పాక్స్‌

ఆటలమ్మ వైరస్‌ వల్ల వస్తుంది. జ్వరం.. శరీరంలో వేడి ఎక్కువై పొక్కులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో స్కిన్‌ ఎలర్జీని కూడా ఆటలమ్మ అనుకుంటారు. ఆటలమ్మ అరి చేతులు, పాదాలు, నెత్తి మీద రాదు. అలా వచ్చాయంటే అవి స్కిన్‌ ఎలర్జీగా గుర్తించాలి. ఆటలమ్మ సోకిన వాళ్లు ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ప్రతి రోజూ శుభ్రంగా స్నానం చేయాలి. టీకా అందుబాటులో ఉంది. వేయించుకోవడం మంచిది. చికెన్‌ పాక్స్‌ వచ్చిన వారికి దురద ఎక్కువగా ఉంటుంది. ఒక చోట గోకి మరో చోటు గోకితే అక్కడ పొక్కులు వస్తాయి. అందువల్ల గోర్లు పెరగకుండా చూసుకోవాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఆటలమ్మ సోకిన వారిని ఇంట్లో మిగిలిన సభ్యులకు దూరంగా ఉంచాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే అందించాలి. గవద బిళ్లలు వచ్చిన వారికి గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది. నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కువగా ద్రవ పదార్ధాలు ఉండేలా శ్రద్ధ తీసుకోవాలి. మూఢ నమ్మకాలు, అపోహలకు పోకుండా వైద్య సహాయం తీసుకోవాలి. ఈ వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వైద్యులు చెబుతున్నారు. వ్యాధులు సోకకుండా ఉండాలంటే వేడి నీళ్లు తాగడంతో పాటు.. శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త! 1
1/1

వేసవిలో పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement