
ఇసుక లభ్యతపై పటిష్ట ప్రణాళిక
ఏలూరు(మెట్రో): జిల్లా అవసరాలకు అనుగుణంగా ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఉండేలా పటిష్ట ప్రణాళిక రూపొందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి గనుల శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధాత్రిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజల అవసరాలకు, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను అవసరమైన ఇసుక అందుబాటులో ఉంచేలా స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీస్లిటేషన్ పాయింట్, స్టాక్ పాయింట్ల నుంచి వినియోగదారుల వద్దకు చేర్చేందుకు రవాణా చార్జీలు ఖరారు చేయాలనీ రవాణా శాఖాధికారులను ఆదేశించారు. డీస్లిటేషన్ పాయింట్, స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా గోదావరిలో నీటి ప్రవాహం తక్కువగా ఉందని.. ఇసుక లభ్యత ఎక్కువగా ఉంటుందని, జిల్లాలో రాబోయే వర్షాకాలం సీజన్‌లో ఇసుక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు.