![Andhra Pradesh Woman Cultivates Kashmiri Saffron Learn How To Grow - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/30/saffron_650x400.jpg.webp?itok=KQrvS6o0)
కుంకుమ పువ్వు ఎలా వస్తుంది? కుంకుమతో తయారు చేస్తారా? లేక... మొక్కకు పూస్తుందా? ఇది నిజంగా పువ్వేనా? చూస్తే పువ్వులా కనిపించదే మరి! అయినా... ఈ మొక్కలు ఎక్కడ ఉంటాయి? ఎవరు పెంచుతారు? ఎలా పెంచుతారు? ఈ సందేహాలకు చక్కటి వివరణ ఇస్తోంది... ఎర్ర బంగారాన్ని పండిస్తున్న శ్రీనిధి.
కశ్మీర్ కుంకుమ పువ్వుకు మన తెలుగు నేల కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వీపుకు బుట్ట కట్టుకుని టీ తోటలో కలియతిరుగుతూ మునివేళ్లతో లేత చివుళ్లను కోసి బుట్టలో వేసుకునే అస్సామీ అమ్మాయిలను చూస్తుంటాం. భూతల స్వర్గంలాంటి కశ్మీర్ నేల మీద లేతనీలిరంగు పూలను కోసి బుట్టలో వేస్తున్న మహిళలనూ చూçస్తాం. కానీ అది కుంకుమ పువ్వు అని నమ్మాలంటే ఏదో సందేహం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లా, మదనపల్లె, పొన్నేటిపాలేనికి చెందిన ఓ తెలుగమ్మాయి శ్రీనిధి ఆ సందేహాలను నివృత్తి చేస్తోంది.
కుంకుమ పువ్వు సాగు చేస్తూ మనకు పెద్దగా పరిచయం లేని రంగాన్ని ఎంచుకుని ట్రెండ్ సెట్టర్ అవుతోంది. కెరీర్ అంటే... ఇంటర్ తర్వాత బీటెక్ చేసి సాఫ్ట్‌వేర్ కంపెనీలో కంప్యూటర్ ముందు చేసే ఉద్యోగాలే అనుకుంటున్న సమాజానికి కొత్త దారి చూపిస్తోంది శ్రీనిధి. ‘వ్యవసాయ రంగం విస్తారమైనది. ఒకింత సృజనాత్మకత తో ముందుకెళ్తే మనమే మరికొందరికి మార్గదర్శనం చేసినవారమవుతాం’ అంటూ... కుంకుమ పువ్వు సాగులో తన అనుభవాలను ఆమె సాక్షితో పంచుకుంది.
‘‘నేను బెంగళూరులో ఏజీ బీఎస్సీ, వారణాసిలోని బీహెచ్‌యూలో ఎమ్మెస్సీ సాయిల్ సైన్స్ చేశాను. ‘వ్యవసాయరంగం ఎంతో విస్తారమైనది, అందులో నీకు తెలియని ఎంతో జ్ఞానం ఉంది’ అని నాన్న చెప్పిన మాటలే నన్ను నడిపించాయి. ఆ ఇంటరెస్ట్‌తో సాగు కోర్సునే చదివాను. కుంకుమ పువ్వు సాగును ఎంచుకోవడానికి మా పర్పుల్ స్ప్రింగ్స్ కంపెనీ కో పార్టనర్ శ్రీనాథ్ కారణం. తను అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ స్కాలర్. కుంకుమ పువ్వు సాగును సిలబస్‌లో ఒక భాగంగా చదివాను, కానీ ఆచరణలో విజయం సాధించడానికి మరింతగా అధ్యయనం చేశాను, ఇంకా చేస్తున్నాను.
సాగు శోధన
ఈ ఆలోచన 2021లో వచ్చింది. మరుసటి ఏడాది ఫిబ్రవరికి రంగంలోకి దిగాం. అది నేరుగా సాగు కాదు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. రెండు వందల యాభై చదరపు అడుగుల గదిలో అరలను ఏర్పాటు చేసి దాదాపు 550 అడుగుల విస్తీర్ణంలో కుంకుమ పువ్వు గింజలు నాటాం. మట్టి లేకుండా ఏరోఫోనిక్ విధానంలో సాగు చేస్తున్నాం. గదిలో ర్యాక్‌లు, చిల్లర్‌లు, కశ్మీర్‌కి వెళ్లి సీడ్ కొనుగోలు, రవాణా ఇతర ఖర్చులన్నీ కలిపి పది లక్షలు ఖర్చయింది. ఇది ఏడాదికి ఒక పంట వస్తుంది. తొలి ఏడాది దిగుబడి రెండు వందల గ్రాములు వచ్చింది. ఇప్పుడు రెండో పంట సాగు చేస్తున్నాం.
ఈ సాగు సెలవు ఇవ్వదు
కుంకుమ పువ్వు సాగు అంటే నిరంతరం పంట క్షేత్రాన్ని కనిపెట్టుకుని ఉండాల్సిందే. వెకేషన్‌కు వెళ్లాలంటే ఆగస్టు నుంచి మే నెల వరకు అసలే కుదరదు. మే నుంచి ఆగస్టు మధ్యలో కొంత వెసులుబాటు ఉంటుంది, కానీ పూర్తిగా హాలిడే కాదు. మరొకరికి బాధ్యత అప్పగించి వెళ్లి, పర్యవేక్షించుకుంటూ ఉండాలి. ఇండోర్‌లో చేసే కుంకుమ పువ్వు సాగుకు ఎక్కువ మంది సహాయకుల అవసరం ఉండదు. ఎందుకంటే శీతల గదిలోకి ఎక్కువ మంది వెళ్లరాదు. చాలా పరిశుభ్రత పాటించాలి. తలకు క్యాప్, చేతులకు గ్లవ్స్ తొడుక్కుని పూలు కోయాలి. ఆ పూలను నీడలో ఆరబెట్టి, ఆరిన తర్వాత పూలలోని రేకలను ఫోర్సెప్స్‌తో వేరు చేయాలి. ఆ రేకలు(కేసరాలు) కుంకుమపువ్వు. గ్రాము కుంకుమ పువ్వులో వేల రేకలుంటాయి.
రేక తీయడం ఓ చాలెంజ్
చెట్టు నుంచి పూలు కోయడం, పువ్వు నుంచి రేకలను విరగకుండా వేరు చేయడంలో నైపుణ్యం చాలా అవసరం. ఈ సాగులో అసలైన సవాలు ఇదే. ఈ సాగు మనకు కొత్త కాబట్టి మన దగ్గర ఎవరికీ పరిచయం ఉండదు. సహాయకులకు నేనే శిక్షణ ఇచ్చాను. పూలు విచ్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత 15–25 రోజుల్లో అన్ని పూలూ విచ్చుకుంటాయి, పంట పూర్తవుతుంది. విరిసిన పువ్వుని ఇరవై నాలుగ్గంటల్లోపల చెట్టు నుంచి కోసేయాలి.
పూల కాలం పూర్తయిన తరవాత చెట్టు నవంబర్ నుంచి మే నెల మధ్యలో గింజలను పెంచుకుంటుంది. దీనిని సీడ్ మల్టిప్లికేషన్ అంటాం. ప్రతిసారీ కశ్మీర్‌కెళ్లి విత్తనాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. మనకు కావల్సిన సీడ్స్ మనమే తయారు చేసుకోవచ్చన్నమాట. మేము పరిశోధన దశలోనే ఉన్నాం. పంట పంటకూ విత్తనాల సంఖ్య పెంచుకుంటూ సాగు విస్తీర్ణం పెంచుకోవాలి. కచ్చితంగా చెప్పలేను, కానీ పెట్టుబడి, ఇతర ఖర్చులన్నీ పోయి ఆదాయంలోకి రావాలంటే మరో మూడేళ్లు పట్టవచ్చు.
హార్ట్ వర్కే కాదు స్మార్ట్‌గానూ చేయాలి
చల్లదనాన్ని పది డిగ్రీల నుంచి 22 డిగ్రీల మధ్యలో పంట దశను బట్టి మారుస్తుండాలి. కరెంటు పోకూడదు, హెవీ కెపాసిటీలో ఒక చిల్లర్ తీసుకోవడం కంటే మీడియం కెపాసిటీ చిల్లర్‌లు రెండింటిని అమర్చుకుంటే ఒకదానికి రిపేర్ వచ్చినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏ రంగమైనా సరే... మనం అంకితభావంతో పని చేస్తే మంచి ఫలితాలనే ఇస్తుంది. హార్డ్‌వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ కూడా అవసరమే. నా పంటను ఆన్‌లైన్‌లోనే అమ్మాను. ఇప్పుడు కుంకుమ పువ్వు సాగులో మెళకువలు నేర్చుకుంటున్నాను. ఆ తర్వాత సాగు విస్తీర్ణం పెంచుకుంటూ మార్కెట్‌ను విస్తరిస్తాను’’ అన్నారు శ్రీనిధి.
ఎర్ర బంగారం!
కుంకుమ పువ్వు అవసరం చాలా ఉంది. అవసరానికి తగినంత లభ్యత లేదు. దాంతో మార్కెట్‌ని నకిలీలు రాజ్యమేలుతున్నాయి. ఇది చాలా ఖరీదైన సుగంధద్రవ్యం. అందుకే ఎర్ర బంగారం అంటారు. మన దగ్గర పంట ఉండాలే కానీ కేజీల్లో కొనేవాళ్లు కూడా ఉన్నారు. సౌందర్యసాధనాల తయారీ పరిశ్రమలు, ఔషధాల పరిశ్రమలు, ఆహార, పానీయాల తయారీదారులు టోకుగా కొంటారు. మన దగ్గర వంటల్లో కుంకుమ పువ్వు వాడకం బాగా తక్కువ. గర్భిణులు మాత్రం పాలల్లో కలుపుకుంటూ ఉంటారు.
అయితే... కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే బిడ్డ తెల్లగా పుడతారనే విశ్వాసాన్ని మేము నిర్ధారించలేం. శాస్త్రీయంగా ఆధారం ఏదీ లేదు. కానీ ఆహారంలో కుంకుమ పువ్వు తీసుకున్న వారి చర్మం ఆరోగ్యంగా, క్లియర్‌గా, కాంతివంతంగా మారుతుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ వంటి కొన్ని ఔషధ గుణాలు గాయాలను మాన్పడం వంటి ప్రయోజనాలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కాబట్టి గర్భిణులే కాదు మామూలు వాళ్లు కూడా తీసుకోవచ్చు.
– పప్పు శ్రీనిధి, కుంకుమ పువ్వు రైతు
– వాకా మంజులారెడ్డి,సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment