Mystery: నేరాన్ని దాచే నేరం! | death mystery of Rachel Timerman | Sakshi
Sakshi News home page

Mystery: నేరాన్ని దాచే నేరం!

Published Sun, Jan 12 2025 8:28 AM | Last Updated on Sun, Jan 12 2025 8:29 AM

death mystery of Rachel Timerman

అది అమెరికా, మిషిగన్‌  రాష్ట్రంలోని సీడర్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతం. 1996 ఆగస్ట్‌ 7, అర్ధరాత్రి 12 దాటింది. రేచల్‌ టిమెర్‌మన్‌  (18) అనే అమ్మాయి, మార్విన్‌  గేబ్రియల్‌ (43) అనే ఫ్యామిలీ ఫ్రెండ్‌ కారులో బర్త్‌డే పార్టీ నుంచి ఇంటికి బయలుదేరింది. ఆ కారులో మరో ఇద్దరు సుపరిచితులున్నారు. అయితే మార్విన్‌  ఉన్నట్టుండి కారు ఆపి, మిగిలిన ఇద్దరితో గొడవపడి, కారు దింపేశాడు. రేచల్‌ను ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, తీవ్రంగా హింసించి, అత్యాచారం చేశాడు. ‘ఎవరికైనా చెబితే నిన్నూ నీ కూతుర్నీ చంపేస్తాను’ అని ఆమెను బెదిరించి వదిలిపెట్టాడు. రేచల్‌కి రెండేళ్ల షానన్‌  అనే కూతురుంది. ఓ రెస్టరెంట్‌లో పని చేసుకుంటూ, తల్లిదండ్రులైన వెల్డా, టిమ్‌లకు సమీపంలోనే నివాసముండేది. టిమ్‌ దంపతులకు తమ కూతురు, మనవరాలంటే ప్రాణం.

మార్విన్‌  చేసిన పనికి రేచల్‌ మానసికంగా కుంగిపోయింది. ఎవరినీ నమ్మలేని స్థితికి చేరుకుంది. తెలిసినవారిని చూసినా భయపడేది. కొన్ని వారాలు గడిచాయి. ఆమె తీరు గమనించి ఆరా తీస్తూ వస్తున్న తల్లి వెల్డాకు– ఒకరోజు తట్టుకోలేక ఏడ్చుకుంటూ జరిగిందంతా చెప్పింది రేచల్‌. వెంటనే వెల్డా ధైర్యం చెప్పింది. టిమ్‌ను తోడుగా పంపించి, రేచల్‌తో మార్విన్‌ పై పోలీసులకు ఫిర్యాదు ఇప్పించింది. వెంటనే పోలీసులు మార్విన్‌ ను అదుపులోకి తీసుకుని, విచారణ మొదలుపెట్టారు. తిరిగి రేచల్‌ను మామూలు మనిషిని చేయడానికి టిమ్, వెల్డాలు తీవ్రంగా శ్రమించారు. ‘వాడికి శిక్షపడేలా చేద్దాం. నువ్వు భయపడొద్దు. మనుషులంతా ఒకేలా ఉండరు’ అని ధైర్యం చెబుతూ, సాధారణ జీవితానికి అలవాటు చేశారు.

అయితే, విచారణ తేదీ వచ్చిన ప్రతిసారీ మార్విన్‌ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సి వస్తుందని భయపడేది. సుమారు ఆరు నెలల విచారణ తర్వాత మార్విన్‌ ను జైలుకు పంపారు. తర్వాత రెండు వారాలకే బెయిల్‌పై బయటికి వచ్చిన మార్విన్‌ – ‘కేసు వెనక్కి తీసుకోకపోతే నిన్నూ నీ కూతుర్నీ చంపేస్తాను’ అని రేచల్‌ను బెదిరించాడు. అయినా భయపడొద్దని టిమ్‌ ఆమెకు ధైర్యం చెప్పాడు. మరో ఐదు నెలలు గడిచేసరికి రేచల్‌ పూర్తిగా మామూలు మనిషయింది. ఒకరోజు సంబరంగా తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. నాతో డేటింగ్‌కి ఇష్టపడుతున్నాడు. నా కూతురు షానన్‌ ని కూడా నాతోనే తీసుకుని రమ్మన్నాడు. నేను వెళ్తున్నాను’ అని కూతుర్ని తీసుకుని వెళ్లింది.

మరుసటి రోజు రేచల్‌ నుంచి టిమ్‌కు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో ‘నేను సెలవుపై వెళ్తున్నాను’ అని రాసింది. కొన్ని రోజుల ముందే కొత్త ఉద్యోగంలో చేరిన రేచల్‌ సెలవు పెట్టడం ఏంటనే అనుమానంతో పాటు మార్విన్‌  కోర్టు వాయిదా దగ్గర పడుతుండటంతో టిమ్‌కు భయం మొదలైంది. వాయిదా రోజుకు కూడా రేచల్‌ రాలేదు. షానన్‌  ఏమైందో తెలియలేదు. వాయిదా రోజున రేచల్‌ రాకపోయేసరికి మరో 11 రోజులకు కేసు వాయిదాపడింది. ఆ 11 రోజులు గడిచాక, వాయిదా నాటికి రేచల్‌ నుంచి మరో లేఖ కోర్టుకు వచ్చింది. ‘నా అంతట నేనే మార్విన్‌ తో సంబంధాన్ని కోరుకున్నాను. అతడు నిరాకరించేసరికి ఆ కోపంతోనే అతడిపై అత్యాచారం కేసు పెట్టాను’ అని అందులో రాసింది. 

దాంతో టిమ్‌తో పాటు అధికారులకు రేచల్‌ కిడ్నాప్‌ అయ్యి ఉంటుందనే అనుమానం మొదలైంది. దాంతో ఆమె కోసం గాలింపు మొదలైంది. సరిగ్గా రెండు వారాలకు సమీపంలోనే ఆక్స్‌ఫర్డ్‌ సరస్సులో రేచల్‌ శవమై తేలింది. నోటికి, కళ్లకు పెద్దపెద్ద ప్లాస్టర్స్‌ చుట్టి, చేతులు, కాళ్లకు రెండు సిమెంట్‌ దిమ్మలు కట్టి సరస్సులో ముంచేశారు. అంటే ఆ లేఖలు బలవంతంగా రాయించారని అధికారులు నమ్మారు. వెంటనే మార్విన్‌  ఇంటిని తనిఖీ చేయగా పసిపిల్లల పాలసీసా దొరికింది. అది షానన్‌ ది కావచ్చని నమ్మారు. పైగా రేచల్‌ కాళ్లు, చేతులకు  కట్టిన సిమెంట్‌ దిమ్మల్లాంటి దిమ్మలు మార్విన్‌  ఇంటి ముందున్నాయి.

 అయితే, అప్పటికే మార్విన్‌  తప్పించుకున్నాడు. ఇక్కడే అసలు ట్విస్ట్‌ బయటపడింది. ఈ కేసుకు సంబంధించి మార్విన్, షానన్‌ తో పాటుగా మరో ఇద్దరు కనిపించడం లేదని పోలీసులు గుర్తించారు. మొదటి వ్యక్తి వేన్‌  డేవిస్‌. అతడు మార్విన్‌  స్నేహితుడు. అలాగే రేచల్‌పై అత్యాచారం జరిగిన రాత్రి కారులో ఉన్న ఇద్దరిలో ఒకడైన రెండవ వ్యక్తి జాన్‌  వీక్స్‌. అతడు మార్విన్‌కు పరిచయస్థుడు, రేచల్‌కు స్నేహితుడు. ఆమెను డేట్‌కి పిలిచింది అతడేనని తర్వాత విచారణలో తేలింది. రేచల్‌ అతడ్ని నమ్మే షానన్‌ తో పాటు అతడితో వెళ్లిందట! వీళ్లందరినీ మార్విన్నే మాయం చేసి ఉంటాడనే క్లారిటీకి వచ్చారు పోలీసులు.

కొన్ని నెలలకు న్యూయార్క్‌ పోలీసులు– రాబర్ట్‌ అలెన్‌  అని చెప్పుకుని తిరిగే వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. రాబర్ట్‌ అలెన్‌  అనే వ్యక్తి అప్పటికే కనిపించడం లేదని అతడి ఫ్యామిలీ కంప్లైంట్‌ ఇచ్చిందట! అయితే అతడి కార్డ్స్‌ అన్నీ వాడుకలో ఉన్నాయని గుర్తించిన పోలీసులు రాబర్ట్‌ కోసం నిఘా పెట్టారు. చివరికి న్యూయార్క్‌లో పట్టుకున్నారు. అయితే, అతడు రాబర్ట్‌ అలెన్‌  పేరుతో చలామణీ అవుతున్న మార్విన్‌  అని గుర్తించి, పోలీసులు షాక్‌ అయ్యారు. ‘రాబర్ట్‌ ఎక్కడ?’ అని మార్విన్‌ ని నిలదీస్తే తెలియదన్నాడు. ఇక అరెస్ట్‌ చేసి, తీసుకొచ్చి రాబర్ట్‌ మిస్సింగ్‌ కేసుతో పాటు రేచల్‌ మర్డర్‌ కేసులో కూడా మార్విన్‌ ను విచారించడం మొదలుపెట్టారు. రేచల్‌ హత్యకు తనకు సంబంధం లేదని మార్విన్‌  వాదించాడు. 

రాబర్ట్‌ మిస్సింగ్‌ కేసులో కొన్ని కీలక ఆధారాలతో కేసు బిగుసుకుంది. మార్విన్‌ కు మరణశిక్ష పడింది. తర్వాత మార్విన్‌  అప్పీలు చేసుకోవడంతో మరణశిక్ష రద్దయి, విచారణ మళ్లీ మొదలైంది. ఆ క్రమంలోనే మార్విన్‌  తన పక్క ఖైదీకి ఆక్స్‌ఫర్డ్‌ సరస్సు మ్యాప్‌ ఇవ్వగా దానిపై ఒక క్లూ ఉంది. ‘3+ 1, ఒక మృతదేహం దొరికింది’ అని రాసుకున్నాడు మార్విన్‌ . అతడి దృష్టిలో 3 అంటే పాప షానన్, జాన్‌  వీక్స్, వేన్‌  డేవిస్‌ కాగా, 1 అంటే రేచల్‌ కావచ్చు అని అధికారులు అంచనా వేశారు. సరిగ్గా రేచల్‌ మృతదేహం దొరికిన ఐదేళ్లకు అదే సరస్సులో వేన్‌  డేవిస్‌ మృతదేహం దొరికింది. 

రేచల్‌ చనిపోయినట్లే డేవిస్‌ కూడా చనిపోయాడని రిపోర్ట్స్‌ తేల్చాయి. డేవిస్‌ని కూడా రేచల్‌ను కట్టినట్లే సిమెంట్‌ దిమ్మలతో కట్టి, కళ్లకు, నోటికి ప్లాస్టర్స్‌ వేసి సరస్సులో పడేశారు. మరోవైపు మార్విన్‌  తన తోటి ఖైదీలతో బిడ్డ (షానన్‌ )ను ఎక్కడ దాచాలో తెలియక చంపేశాను’ అని చెప్పాడట! అయితే, ఈ కేసులో మిస్‌ అయిన పాప షానన్, జాన్‌  వీక్స్, రాబర్ట్‌ అలెన్‌  వీరంతా ఏమయ్యారో తేలలేదు. దాంతో ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. 
∙సంహిత నిమ్మన 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement