విద్యుత్ మోహన్
చలికాలం వచ్చిందంటే చాలు... ఢిల్లీలోని ఏయిర్ క్వాలిటీ ఇండెక్స్ పాయింట్స్‌ను చూస్తే... గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. వాయు కాలుష్యమా మజకా! మరి అలాంటి వాయు కాలుష్యం గుండెల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను పరుగెత్తిస్తున్నాడు ఈ కుర్రాడు... విద్యుత్ మోహన్‌కు చిన్నప్పుడు నానమ్మ ఒక కథ రకరకాల వెర్షన్‌లలో చెప్పేది. ఆ కథ ఇలా ఉంటుంది...
‘అనగనగా ఒక పచ్చటి ఊరు. ఊళ్లో అందరూ బోలెడు మంచివాళ్లు. ఇలా ఉంటే రాచ్చసుడికి నచ్చుతుందా ఏమిటి? ఏదో ఒకరోజు ఆ ఊరి మీద పడి అరాచకం సృష్టించేవాడు....’
పెద్దయ్యాక విద్యుత్‌కు తెలిసింది ఏమిటంటే, బామ్మ చెప్పిన కథలోని ఆ రాక్షసుడు ఎక్కడికీ పోలేదని....దిల్లీలో ఉన్నాడని!
రాక్షసుడు ఏమిటి, దిల్లీలో ఉండడం ఏమిటీ?!
ప్రతి ఏటా చలికాలంలో ఢిల్లీలో ‘వాయు కాలుష్యం’ రూపంలో ఆ రాక్షసుడు వచ్చి ప్రజలను రకరకాలుగా బాధిస్తాడు. ఈ రాక్షసుడు ఎక్కడి నుంచో రావడం లేదు...మన తప్పిదాల నుంచే వస్తున్నాడు.
చలికాలం వస్తుంటే భయపడే ఢిల్లీవాసుల్లో విద్యుత్ కుటుంబం ఒకటి. ఢిల్లీలో వాయుకాలుష్య ప్రభావం ఇంతా అంతా కాదు. బామ్మతో సహా విద్యుత్ కుటుంబ సభ్యులు ఎన్నో రకాల ఆరోగ్యసమస్యలను ఎదుర్కొన్నారు.
చదవండి: Baldness Cure: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు పరిష్కారం..!
ఏనాటికైనా వాయు కాలుష్యానికి చెక్ పెట్టాలనేది విద్యుత్ కల.
మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఆ తరువాత కాలంలో కార్యరూపం దాల్చింది. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు రకరకాలుగా ఉపయోగపడే యంత్రాన్ని కనిపెట్టాలనే తన కల ‘టకాచార్’తో నిజమైంది.
ఢిల్లీ వాయుకాలుష్య కారణాలలో పంట వ్యర్థాలను బహిరంగప్రదేశాలలో కాల్చడం ఒకటి. రైతులు కొత్త పంటకు సిద్ధమయ్యే క్రమంలో ఈ ప్రక్రియ తప్పనిసరి అవుతుంది. పైగా ఇది ఖర్చుతో కూడిన పని. మరోవైపు కాలుష్యం.
విద్యుత్ మోహన్ తయారుచేసిన యంత్రంతో కొబ్బరిచిప్పలు, పంటవ్యర్థాలను ఉపయోగకరమైన ఇంధనంగా మలచవచ్చు. ఈ ప్రక్రియలో వాయుకాలుష్యానికి ఆస్కారం ఉండదు. వాయునాణ్యత పెరుగుతుంది. రైతుల ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి దొరకుతుంది.
మొదట్లో ఈ యంత్రాన్ని ఉత్తరాఖండ్‌లో ఉపయోగించారు. తరువాత దేశంలో మిగిలిన ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు.
‘కాఫీ రోస్టర్’ ప్రిన్సిపుల్ ఆధారంగా పనిచేసే ఈ యంత్రానికి మన ప్రధాని నుంచి ప్రశంసలు లభించాయి. ఎలా పనిచేస్తుంది? రైతులకు ఎలా ఉపయోగపడుతుంది...మొదలైన విషయాలను అడిగి తెలుసుకున్నారు ప్రధాని.
‘టకాచార్’ (టక–డబ్బు చార్–కార్బన్) యంత్రం ఆవిష్కరణతో ‘ఎకో ఆస్కార్’గా పిలవబడే ఎర్త్‌షాట్ ప్రైజ్(బ్రిటన్) గెలుచుకున్నాడు విద్యుత్. తన కాన్సెప్ట్‌తో దగ్గరగా ఉండే కెవిన్ కుంగ్(యూఎస్)తో కలిసి ‘టకాచార్’ రిసైక్లింగ్ సంస్థకు శ్రీకారం చుట్టాడు. దీని ద్వారా దేశీయంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా సేవలు అందించాలనేది అతడి లక్ష్యం. ‘వేయి శుభములు జరుగు నీకు’ అని ఆశీర్వాదం ఇద్దాం..
Comments
Please login to add a commentAdd a comment