పరీక్ష... లేదా పరీక్షలు అనే మాట విద్యారంగంలో తరచూ వినిపిస్తూ ఉంటుంది. చెప్పిన పాఠాలు విద్యార్థి ఎంత శ్రద్ధగా విన్నాడు, ఎంత జ్ఞానాన్ని పొందాడు, దాని సారమెంత అన్నది ఉపాధ్యాయులు అంచనా వేయాలి. అలా వేసే అంచనానే పరీక్షంటే. పరీక్ష అతణ్ణి పైతరగతులకు పంపే ఒక పక్రియ లేదా సాధనం. అయితే పరీక్ష అనేది విద్యార్థులకు మాత్రమే పరిమితం కాదు. చదువున్నా లేకపోయినా, జీవితంలో ప్రతి ఒక్కరూ పరీక్షకు గురి అయిన వారే. తమను తాము పరీక్ష చేసుకునేవారే. ఇంతకీ పరీక్ష అంటే ఏమిటి, ఎందుకో తెలుసుకుందాం.
మన మాట తీరు, ఇతరులతో మన సంబంధాలు, వారితో మన వర్తన, విలువలు, నీతి, నిజాయితీ, తోటి మానవుల పట్ల మన భావన, ప్రేమ ఇటువంటి అనేకమైన వాటిని అంచనా వేసుకునేందుకు కూడా పరీక్ష అవసరం. మన జీవిత ప్రవాహ సారాన్ని అర్ధం చేసుకుని దాన్ని ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవాలి. అంటే మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. దాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఈ పరీక్ష అనేది ప్రతి ఒక్కరికి అవసరం.
ఇతర జీవులకు, మనకు ఉండే జనన మరణాల సారూప్యతకు భిన్నంగా, గొప్పగా మన జీవనవిధానాన్ని గమనిస్తూ జీవితాన్ని మార్పు చేసుకోగలమా? అలా మన తెలివితేటలకు, ఆధిక్యతకు ఒక విశిష్టత, అర్థం చూపగలమా? ఆ ఆలోచన వచ్చిన వారెవరైనా తమ శల్య పరీక్షకు సంసిద్ధులైతే జీవితాన్ని చక్కగా మలచు కోవటం కష్టం కానే కాదు. అది మనోవికాసానికి, గొప్ప ఆలోచనలకు దారి తీసి మానవాళికి ఉపయుక్తం అయ్యే అనేక ఆవిష్కరణలకు దారితీస్తుంది.‘శోధించని జీవిత జీవనయోగ్యం కాదు’ అన్నాడు సోక్రటీస్.
ఈ పరీక్షకు విద్యార్థి, పరీక్షాధికారి ఎవరికి వారే. విద్యార్థి సంవత్సరకాలంలో పుస్తకాలలోని తను పొందిన జ్ఞానాన్ని ఎలా జ్ఞప్తికి తెచ్చుకుంటాడో అలా ప్రతి వ్యక్తి తను గడిపిన, గడుపుతున్న జీవితాన్ని నెమరు వేసుకోవాలి. వివిధ సందర్భాలలో తన మాటలు, ప్రవర్తన అనుబంధాలకు, ఆప్యాయతలకు ఎంత విలువనిచ్చాయి, వాటిని తను ఎంత నిలబెట్టుకున్నాడో స్ఫురణకు తెచ్చుకోవాలి. తన వర్తన ఇతరుల మనస్సులనేమైనా అకారణంగా గాయపరిచిందేమో తరచి చూసుకోవాలి.
వృత్తి జీవితంలోనూ ఒక ఉద్యోగి, రచయిత, కళాకారుడు తమ కృషి లేదా పని తీరును సమీక్షించు కోవడమూ పరీక్షే. జీవితాన్ని ఎంత నిశితంగా పరీక్షలకు గురి చేస్తే అంతగా మన వ్యక్తిత్వం సార్థక మవుతుంది. ఇక్కడ పరీక్ష పత్రం తయారు చేసేది, సమాధానాలు రాసేది మనమే. దీనితో విద్యార్థి పాత్ర ఉపాధ్యాయుని పాత్రగా మారుతుంది. ఇప్పుడు పరీక్షాధికారిగా వీటి మంచి చెడులను విశ్లేషించాలి. మంచికి మురిసిపోతూ మనల్ని మనమే ప్రశంసించుకో కూడదు. మంచిని చూసినంత బాగా, నిశితంగా లోపాలను చూడాలి.
నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించగలగాలి. ఆ ఫలితాలను లోతుగా చూసి, ఒక నిజమైన, ఖచ్చితమైన మదింపు వేసుకోవాలి. అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునే వివేచన కావాలి. ఇక్కడ బేషజాన్ని, ఆహాన్ని విడిచి తప్పులను దిద్దుకునే సంస్కారం అలవరుచుకోవాలి. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. విద్యార్థి తన విద్యాభ్యాసకాలంలో రాసే పరీక్షలు కొన్నే ఉంటాయి. కాని మనం జీవితాంతం మన జీవితాన్ని పరీక్షకు గురి చేయాల్సిందే. సరిదిద్దుకుంటూ ముందుకు సాగాల్సిందే. సోక్రటీస్ చెప్పిన మాటల సారమిదే.
తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్యలు ఉపాధ్యాయులు ఈ శోధన తత్వాన్ని పిల్లలు అలవాటు చేసుకునేలా చెయ్యాలి.ఈ శోధన మనిషి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది.
కొందరు వ్యక్తులకు ఈ శోధన చిన్నతనం నుండే సహజంగా ఉంటుంది. ఆ శోధనా దృష్టి కొందరిలో అతి చిన్న వయస్సులోనే ఏర్పడి చక్కని రూపు దాల్చి ఉన్నత పథంలో పయనం చేసి మొత్తం మనవాళికి దాని ఫలితాలను అందిస్తుంది. వారు చిర స్మరణీయులవుతారు. ఈ శోధనాతత్వం ప్రతి ఒక్కరికీ అవసరం. ముఖ్యంగా ఉపాధ్యాయులకు, శాస్రవేత్తలకు, నాయకులకు చాలా అవసరం. ఎప్పటికప్పుడు తాము చేసిన పనిని, దానిలోని తప్పుల్ని తెలుసుకుని తమను తాము నూతనంగా ఆవిష్కరించుకుంటారు. సోక్రటీస్ అన్న మాటలలో పరిశీలన, తార్కికత, ఉత్సహం, ఆధ్యాత్మికత పెనవేసుకున్నాయి.
ప్రశ్నించే, శోధించే గుణాలు ఉన్నాయి.
వృత్తి జీవితంలోనూ ఒక ఉద్యోగి, రచయిత, కళాకారుడు తమ కృషి లేదా పని తీరును సమీక్షించు కోవడమూ పరీక్షే. జీవితాన్ని ఎంత నిశితంగా పరీక్షలకు గురి చేస్తే అంతగా మన వ్యక్తిత్వం సార్థకమవుతుంది.
– లలితా వాసంతి
ఏమిటి ఈ పరీక్ష? ఎందుకు?
Published Mon, Nov 7 2022 5:02 AM | Last Updated on Mon, Nov 7 2022 9:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment