అన్ని జీవులతో పాటు మనిషికి కూడా భయం పుట్టుకతోనే ఉంది. సహజమైన భయానికి తోడు మానవుడు కృత్రిమమైన భయాన్ని కల్పించుకో గలడు. మనిషి ఆ విధంగా కల్పించుకున్న భయాలు ఎన్నో! అన్నీ భయాలే. రేపటి సంగతి ఏమిటి? ఈ భయం కారణంగానే దాచుకోటాలు, దోచుకోటాలు మొదలైనవి.
ఆహార నిద్రాభయమైథునాలు సర్వజీవులకు సామాన్యమే. ప్రకృతి సిద్ధం. ఆహారం ప్రాణం నిలబడటానికి. శరీరం అనే యంత్రం పని చేయటానికి తగిన శక్తి నిచ్చే ఇంధనం ఆహారం. రక్షణ కోసం ప్రకృతి చేత సమకూర్చ బడింది భయం. తెలియకపోవటం వల్ల భయం కలుగుతుంది. భయపడటం వల్ల రక్షణ జరుగుతుంది. భయం లేకపోతే చీకటిగా ఉన్న చోటుకి అయినా నిస్సందేహంగా వెళ్ళటం జరుగుతుంది.
ఎత్తు పల్లాలు తెలియక దెబ్బలు తగలటమో, గోతిలో పడటమో, ముళ్ళో రాళ్ళో కాలికి గుచ్చుకుని గాయాలు కావటమో, ఏ తేలో పామో ఉండి ప్రాణం మీదికి రావటమో జరిగే అవకాశం ఉంది. తెలియని వారెవరైనా ఉండి మీద పడితే ప్రాణ హాని కూడా జరగ వచ్చు. భయం ఇంకా తెలియని పసిపిల్లలు చీమలని, పాములని కూడా పట్టుకునే ప్రయత్నం చేయటం గమనించ వచ్చు. వెలుగుతున్న దీపాన్ని పట్టుకోటానికి చూస్తారు. ఒకసారి వేడి తగిలితే మరొకసారి భయపడతారు.
మానవులకు జంతువుల కన్న అధికంగా మెదడు, దానితో ఆలోచన, విచక్షణాజ్ఞానం కూడా ఇచ్చింది ప్రకృతి. దానిని ఉపయోగించుకుని మేలు పొందటానికి బదులు లేనిపోని భయాలు సృష్టించుకుని బాధ పడటం జరుగుతోంది. తన అభిప్రాయాలని ఇతరులు అంగీకరించరేమో! తన గురించి ఏమనుకుంటారో? అనుకున్నది జరగదేమో! అపజయాన్ని ఎదుర్కోవలసి వస్తుందేమో! ఇవన్నీ కల్పితాలే కాని, సహజసిద్ధం కావు కదా!
ఈ భయాల వల్ల రక్షణ కలగక పోగా దుఃఖం కలుగుతుంది. జంతువులకి భయం ఉంది కాని, దుఃఖం లేదు. అవి భయాలని తాముగా కల్పించుకో లేదు కదా! వాటి భయం వాటికి రక్షణ నిస్తుంది.
ఎదుటివారి భయాన్ని తమకు రక్షణగా చేసుకో గలిగిన తెలివితేటలు కూడా ఉన్నాయి మనిషికి. పొలాల్లో కాపలా ఉండేవారు కాని, అడవిలో సంచరించేవారు కాని, రాత్రిళ్ళు నెగళ్లు (మంటలు) వేసుకుంటారు. అడవి జంతువులు మంటలని చూసి భయపడి సమీపించవు అని.
మృత్యుభయం అన్నింటి కన్న పెద్దభయం. బుద్ధిజీవులైన మానవులకి మృత్యువు తప్పదని తెలుసు. తెలియని జంతువులే నయం. ప్రాణాల మీద ఆశని సునాయాసంగా వదులుకోగలవు. శరీరం కష్టపడుతుంటే దానిని వెంటనే వదిలేస్తాయి అని పశువైద్యులు చెప్పిన మాట. మానవులు స్పృహ లేక పోయినా బతికి ఉండాలని ప్రయత్నం చేస్తారు, కష్టపడతారు. జంతువులు మరణభయాన్ని జయించి నట్టు చెప్పుకోవచ్చును. మనిషి స్వయంకృతంగా తెచ్చి పెట్టుకున్న దుఃఖహేతువయిన భయాలు శారీరక, మానసిక అనారోగ్యాలకి కారణాలు అవుతాయి. అటువంటి భయాలని వదలాలి.
కొన్ని భయాలు ఉండాలి. ధర్మం తప్పుతానేమో, ఇతరులకి నా పనుల వల్ల బాధ కలుగుతుందేమో, కర్తవ్యనిర్వహణలో ఏమరుపాటు కలుగుతుందేమో .. వంటివి ఆరోగ్యకరమైన భయాలు.
భయం అన్నది ప్రమాదాలని కొని తెచ్చుకోకుండా కాపాడటానికి ప్రకృతి సర్వజీవులకు ప్రసాదించిన వరం. జంతువులకు భయం వర్తమాన కాలానికి మాత్రమే పరిమితమై ఉంటుంది తరచుగా. కాని, మనిషి మాత్రం భూత భవిష్యత్ కాలాలలోకి కూడా భయాన్ని విస్తరింప చేయ గలడు. జరిగిపోయిన దానిని తలుచుకుని, మళ్ళీ అట్లా అవుతుందేమోనని భయం. జరిగింది మంచి అయితే మళ్ళీ అట్లా జరగదేమోనని భయం. వృద్ధాప్యంలో పిల్లలు చూడరేమోనని భయం. వాళ్ళ చిన్నతనంలో సరిగా చదవరేమో, అందరిలో అవమానం పాలు అవాలేమో, వాళ్ళకి తగిన ఉద్యోగం వస్తుందో రాదో, సరైన సంబంధాలు కుదురుతాయో లేదో... ఇలా సాగుతూ ఉంటాయి. వాటికోసం తగిన ప్రయత్నం చేయాలి కాని భయపడితే ఏం ప్రయోజనం?
– డా. ఎన్. అనంత లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment