స్వ + ఇచ్ఛ అంటే తన అసలైన ఇచ్ఛ, అంటే కోరిక ఏదైతే ఉన్నదో, బంధనాల నుండి విడివడాలని – అది నెరవేరటానికి తగినట్టుగా ఉండగలగటమే స్వేచ్ఛ. దానిని గుర్తించక పోవటం వల్ల స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండగలగటం, స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం, ఎవరినీ దేనినీ లెక్కచేయకరోవటం అనే అ΄పోహ వ్యాపించి ఉంది లోకంలో. సర్వసంగపరిత్యాగులని చూస్తే ఈ విషయం బాగా తెలుస్తుంది. వారికి ఇల్లు, బంధువులు మొదలైన బంధాలు ఉండవు. పేరు ప్రఖ్యాతులు వంటి చుట్టలలో (వలయాల్లో) ఇరుక్కోరు. ఈ క్షణాన మోక్షం ఇస్తానంటే ఏవో సద్దుకొని వస్తాను అనకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్టే బయలుదేరే వారు ఎంత మంది ఉంటారు? అదీ నిజమైన స్వేచ్ఛ అంటే.
సృష్టి లోని జీవులన్నీ కోరుకునేది స్వేచ్ఛ. కాని, అది ఎంత వరకు సాధ్యం? మనమే తల్లి తండ్రులని ఎంచుకుని, పుట్టటం మన చేతుల్లో లేదు అనుకుంటాం. పుట్టిన తరువాత ఇక చేయగలిగినది ఏమీ లేదు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ఆ బంధంలో నుండి బయట పడాలని తాపత్రయం. బొడ్డు కోసి మాయనుండి వేరైన తరువాత అసలైన బంధనాల్లో ఇరుక్కు΄పోవటం జరిగింది. అప్పటి వరకు ఉన్న జ్ఞానం కూడా పోతుంది. పూర్తిగా తల్లితండ్రుల మీద ఆధారపడతారు. అక్కడి నుండి ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధార పడక తప్పదు. జ్ఞానసము΄పార్జన కోసం గురువుల మీద ఆధారపడ వలసి వస్తుంది.
ఆహారం కోసం అయితే వడ్డించినవారి మీద, వండినవారి మీద, సంబారాలని ఇంటికి తెచ్చినవారి మీద, పంటలు పండించినవారి మీద – ఇట్లా ఎందరి మీదనో ఆధార పడకుండా నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళవు కదా! ముందుగా అవన్నీ తెచ్చుకోవటానికి కావలసిన డబ్బులు ఉండాలి. అవి ఆకాశంలో నుండి ఊడి పడవు. మనం స్వంతంగా తయారు చేయలేము. మఱి, నేను స్వేచ్ఛాజీవిని. ఎవరి మీదా ఆధారపడను అనటం ఎంత సమంజసం? ఆలోచించాల్సిన విషయమే కదా! ఇది ఇరుకుగా ఉన్న గర్భంలో నుండి బయట పడి స్వేచ్ఛాజీవిని అనుకున్న మానవుడికి తాను ఇరుక్కున్న చుట్టరికపు బంధనాల నుండి విడివడాలని అంతర్గతంగా అంతరంగపు అట్టడుగు ΄÷రల్లో మాటుపడి ఉన్న కోరిక. ఈ బంధనాలనే పురాణాలు ప్రతీకాత్మకంగా వృత్రాసురుడు అని చెప్పయి. చుట్టుకున్నవే చుట్టరికాలు, బంధించేవే బంధనాలు. నిజమైన స్వేచ్ఛ అంటే దేనినీ పట్టుకొని ఉండక
పోవటం. దేనినీ పట్టించుకోక పోవటం అనుకుంటారు. నిజమైన స్వేచ్ఛాజీవి అందరికీ సమంగా అందుబాటులో ఉంటాడు. వీరు నాకు ఇష్టులు, మేలు చేసినవారు, బంధువులు, భవిష్యత్తులో నాకు సహాయ పడతారు, నాకు కీడు చేశారు, ఎందుకూ పనికిరారు మొదలైన భావనలతో ప్రవర్తించటం అభి్రయాల ఊబిలో కూరుకుపోవటమే. అది వ్యక్తుల విషయం మాత్రమే కాదు, వస్తువులు, సిద్ధాంతాలు మొదలైనవి కూడా. ఎదుటివారి పట్ల ఎటువంటి అభిప్రాయం లేకుండా వారికి మేలు కలిగేట్టు తనకు చేతనైనంత వరకు ప్రవర్తించటం, తరువాత ఎటువంటి ప్రతిఫలం కాని, గుర్తింపు కాని ఆశించకుండా ఉండటం స్వేచ్ఛాజీవి లక్షణం.
ఏ మాత్రం ఆశించినా అది బంధమే. ఒకవేళ ఏదైనా ప్రతిఫలం లభిస్తే, దానిని ఎటువంటి వ్యామోహం లేకుండా స్వీకరించాలి. ‘‘వద్దు, అది నన్ను బంధిస్తుంది.’’ అని నిరాకరిస్తే, అదే పెద్ద బంధనం అవుతుంది. ‘‘మానవుడు పుట్టుకతో స్వేచ్ఛాజీవి. తరువాత బంధనాలలో ఇరుక్కుంటాడు’’ అన్న ఆంగ్ల సామెత వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నదో చూడండి. నిజంగానే మనం స్వేచ్ఛని అనుభవిస్తున్నామా? స్వేచ్ఛ ఎవరు ఇచ్చేది కాదు. తనంతట తాను అనుభవించ వలసినది. ఆ విధంగా ఉండటానికి చేసే ప్రయత్నమే సాధన అంతా.
– డా. ఎన్. అనంత లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment