ఎన్నో ప్రయోజనాలు.. ఎంచక్కా చాక్లెట్లు లాగించేయొచ్చు! కానీ.. | International Chocolate Day: Health Benefits Interesting Facts Of Chocolate | Sakshi
Sakshi News home page

Chocolates Health Benefits: చాక్లెట్‌ డే... ఈ ఆసక్తికర విషయాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?!

Published Thu, Jul 7 2022 3:07 PM | Last Updated on Thu, Jul 7 2022 4:02 PM

International Chocolate Day: Health Benefits Interesting Facts Of Chocolate - Sakshi

కిస్‌ మీ.. క్లోజ్‌ యువర్‌ ఐస్‌.. అండ్‌ మిస్‌ మీ.. క్లోజ్‌ యువర్‌ ఐస్‌.. అంటూ టీవీలో వచ్చే ఓ యాడ్‌ మనల్ని మెస్మరైజ్‌ చేస్తుంది. ఆ యాడ్‌ చూస్తుంటే.. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు నోరూరుతుందంటే అతిశయోక్తి కాదేమో! విదేశాల నుంచి మనకు తెలిసిన బంధువులు వస్తే.. మొదటి ప్రశ్న ఏలా ఉన్నారు?

వెంటనే మరో ప్రశ్న.. చాక్లెట్లు తీసుకొచ్చారా? ఇదంతా ఎందుకంటారా? ఈ రోజు చాక్లెట్‌ దినోత్సవం. ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడు నోరు తీపి చేస్తుంటాం. అపురూపంగా చాక్లెట్‌ను తీసుకుని తింటూ పంచే వారికి విషెస్‌ చెబుతాం.

చాక్లెట్లను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా చిన్న పిల్లలు తెగతింటారు. ఒక్క రూపాయి మొదలుకొని వేల రూపాయల్లో ఉండే చాక్లెట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చాక్లెట్‌ డే సందర్భంగా ఈ రోజు తియ్యని వేడుక చేసుకుందామా? – పెదగంట్యాడ(గాజువాక)

చాకొలెట్‌.. ఇది ఒక తీపి పదార్థం. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. గొంతులో కమ్మగా దిగిపోతుంది. మంచి అనుభూతిని పంచుతుంది. తీపి అనేది శుభ సూచకం. పుట్టినరోజు వేడుక వచ్చిందంటే.. చాక్లెట్లు ఉండాల్సిందే.. వాటిని అందరికీ పంచాల్సిందే.! ప్రేమికుల రోజు నాడు కూడా పూలతో పాటు చాక్లెట్‌ ఇవ్వడం కూడా ఆనవాయితీ.

ఇవే కాదు.. ఏ వేడుక అయిన చాక్లెట్‌లతోనే నిండిపోతోంది.. చిన్నారులకైతే చాక్లెట్లంటే చెప్పలేనంత ఇష్టం.. ఇళ్లలో ఉన్న చాక్లెట్ల డబ్బాలను ఖాళీ చేసే వరకూ నిద్రపోరు. ఇలా నగరం నోరు తీపి చేసుకుంటోంది. చాక్లెట్‌ రుచికి దాసోహమంటోంది. పుట్టిన రోజైనా.. ప్రేమికుల దినమైనా.. పరీక్షల్లో పాసైనా, ఆనందించే ఊసేదైనా.. ‘చాక్లెట్‌ పార్టీ’ తప్పనిసరి అంటోంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న చాకొలెట్‌ క్రేజ్‌లో సిటీ గణనీయమైన వాటా పంచుకుంటోంది.  

రూపాలెన్నో... రుచి ఒకటే..  
ఒకప్పుడు అంటే రాపర్లలో చుట్టిన చిన్న చిన్న చాక్లెట్లు, ఆ తర్వాత డైరీ మిల్క్‌ లాంటివి... అలా కొన్నే ఉండేవి. ఇప్పుడు విభిన్న రకాల్లో అందుబాటులో ఉన్నాయి. విభిన్న రకాల ఫ్లేవర్లు, ముడి దినుసులలో సులువుగా కలిసిపోయే సుగుణం చాక్లెట్‌ను మరింతగా ప్రేమించేలా చేస్తోంది.

ఐస్‌క్రీమ్స్, మిల్క్‌షేక్స్‌.. ఇలా ప్రతి దానిలో చాక్లెట్స్‌ ఒదిగిపోతున్నాయి. పండ్ల దగ్గర్నుంచి లిక్కర్‌ దాకా ప్రతిదానికీ జత కడుతున్నాయి. సిరప్‌లతో సహా విభిన్న రూపాల్లో చాక్లెట్లు వినియోగించడం సిటీలో బాగా పెరిగింది. దీంతో చిన్నాపెద్దా తేడా లేకుండా చాకో క్రేజ్‌లో మునిగి తేలుతున్నారు.

చాక్లెట్‌ ఐస్‌క్రీమ్, చాక్లెట్‌ బార్, చాక్లెట్‌ బాల్స్, చాక్లెట్‌ మౌంటెన్, వైట్‌ చాక్లెట్, మెల్టెడ్‌ చాక్లెట్, చాక్లెట్‌ కప్‌ కేక్, హాట్‌ చాక్లెట్, మిల్క్‌ చాక్లెట్‌ .. ఇలా వందల రకాలు సిటీలో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయగానే మన చెంతకు చేరుతున్నాయి.

బిస్కెట్ల కంపెనీలు కూడా ఇప్పుడు చాక్లెట్ల రుచులతోనే తయారు చేస్తున్నాయి. చాకెట్ల అందించే ప్రత్యేక షాపులు వెలిశాయి. కేక్‌ షాపుల్లో చాక్లెట్లే క్రేజ్‌.  

ఈట్‌.. చాక్లెట్‌  
ఏదైనా ఫుడ్‌ కాస్త హెవీగా తీసుకున్న తర్వాత చాకొలెట్‌ను ఎంజాయ్‌ చేయడం బాగా పెరిగింది. డిన్నర్, స్నాక్స్‌ పూర్తి చేసిన తర్వాత కూడా సిటీజనులు లెట్స్‌ చాక్లెట్‌ అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ తర్వాత కూడా వీటి వినియోగం బాగా ఉంటోంది.

ముఖ్యంగా వారాంతాల్లో ఈ ట్రెండ్‌ మరింతగా కనిపిస్తోంది. చాక్లెట్‌ మోమో, చాక్లెట్‌ పిజ్జా, శాండ్‌విచ్, చాక్లెట్‌ గ్రిల్డ్‌ శాండ్‌విచ్, చాక్లెట్‌ టోస్ట్‌ వంటివి ఆన్‌లైన్‌ ద్వారా బాగా ఆర్డర్లు అందుకుంటున్న వాటిలో ఉన్నాయి. చాక్లెట్‌ కుకీ, చాక్లెట్‌ పేస్ట్రీస్‌ తదితర చాకెట్లు ఉత్పత్తులను బాగా ఆర్డర్‌ చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది.  

ఈ రోజే ఎందుకు?  
ఏటా జూలై 7న ప్రపంచ చాక్లెట్‌ దినోత్సవం నిర్వహిస్తున్నారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఈ దినోత్సవం జరుపుకొంటున్నారు. జూలై 7న ఐరోపాలో మొదటిసారిగా చాక్లెట్‌ తయారైందని లభించిన ఆధారాల వల్ల తెలుస్తోంది. దానికి గుర్తింపుగా తొలిసారిగా 2009, జూలై 7న ప్రపంచ చాక్లెట్‌ దినోత్సవం నిర్వహించారు. అప్పటినుంచి కొనసాగిస్తున్నారు.  

ఆరోగ్యానికి మేలు 
►డార్క్‌ చాక్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
►కోకో చెట్టు నుంచి సేకరించిన విత్తనాలతో దీనిని తయారు చేస్తారు.
►రుచితో పాటు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక గుణాలు కలిగి ఉంది.
►డార్క్‌ చాక్లెట్లు శరీరంలోని రక్త సరఫరాను మెరుగుపరస్తుంది.
►రక్తపోటు సమస్య నుంచి రక్షిస్తుంది.
►రక్తం గడ్డ సమస్య నుంచి కూడా కాపాడుతుంది.
►మెదడు నుంచి గుండెకు రక్తాన్ని సాఫీగా సాగేలా చూస్తుంది.
►యాంటీ ఆక్సి డెంట్లు పుష్కలంగా ఉంటాయి.
►డార్క్‌ చాక్లెట్లలో ముఖ్యంగా ఐరస్, మెగ్నీషియం, కాపర్‌ కలిగి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. 

చాక్లెట్ల వల్ల కలిగే నష్టాలు 
►మితంగా తింటే మేలు చేస్తాయని.. అమితింగా తింటే కీడు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
►అధికంగా చాక్లెట్లు తినే అలవాటు ఉన్న వారికి వేగంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.
►దీని వల్ల వారు మిగతా ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారని వైద్యులు అంటున్నారు.
►అంతేకాకుండా చాక్లెట్లు ఎక్కువగా తినే పిల్లల్లో కూడా పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు. 
►పళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది 
►రాత్రి వేళల్లో చిన్నారులు చాక్లెట్లు తిని పడుకుంటే పిప్పి పళ్లు వచ్చే ప్రమాదం ఉంది.
►ఒకవేళా తిన్నా.. వెంటనే బ్రష్‌ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
►ఎక్కువగా చాక్లెట్లు తినడం మంచిది కాదు. ఆరోగ్యానికి మేలు చేసేవి మాత్రమే తినాలి.  –డాక్టర్‌ వి.సుజిత్‌కుమార్, దంత వైద్యుడు 

ఊబకాయం వస్తుంది 
ఎక్కువగా చాక్లెట్లు తినడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఇతర ఆహారంపై ఆసక్తి ఉండదు. శరీరం మాత్రం భారీగా పెరిగిపోతుంది తప్ప దానికి అవసరమైన ప్రోటీన్స్‌ అందవు. దీని వల్లే ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.  –డాక్టర్‌ రమేష్‌బాబు, వైద్యాధికారి, పెదగంట్యాడ పీహెచ్‌సీ 

చాక్లెట్‌ అంటే చాలా ఇష్టం 
చాక్లెట్‌ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎక్కువగా తినేదానిని. ఇప్పుడు ఈ అలావాటు నాతో పాటు నా భర్తకు, పిల్లలకు కూడా వచ్చేసింది. రోజులో ఒక్కసారైనా.. ఒక్క చాక్లెట్‌ అయినా తినకుండా ఉండేలేం. వేడుకల్లో కూడా చాక్లెట్లే మాకు ప్రత్యేకం. – కె.శ్రీలక్ష్మి, పెదగంట్యాడ 

చదవండి: World Zoonoses Day: కని‘పెట్‌’కుని ఉండాలి..! లేదంటే కష్టమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement