
నేలపై సైకిల్ తొక్కుతూ కరోనా బాధితులను ధైర్యంగా ఆదుకున్న స్త్రీ... నింగిలోకి దూసుకెళ్లి అంతరిక్షాన్ని అవలీలగా చుంబించి వచ్చిన యువతి... ఫుడ్ డెలివరీ గర్ల్‌గా బైక్ ఎక్కిన కాలేజీ అమ్మాయి... యుద్ధ విమానం నడిపేందుకు సిద్ధమైన మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్... భర్త వదిలేసి వెళ్లిన వ్యాపారాన్ని చక్కదిద్దిన భార్య, తండ్రి కట్టబెట్టిన సాంకేతిక సామ్రాజ్యాన్ని ఏలుతున్న కూతురు...
స్త్రీలు.. స్త్రీలు.. స్త్రీలు... ‘స్త్రీలు మారితే సమాజం మారుతుంది’ అని గతంలో అనేవారు. స్త్రీలు ఎప్పుడో మారారు. వారి వేగాన్ని, విజయాన్ని అర్థం చేసుకోవలసిందీ మారవలసిందీ ఇక మగవారే.
ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతోంది. దేశం కాని దేశం నుంచి మన విద్యార్థులు తిరిగి వస్తున్నారు. అలా వస్తున్న విద్యార్థులను అందరూ గమనించి చూస్తున్నారు. ఎందుకంటే వారిలో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారో అంతమంది అమ్మాయిలు ఉన్నారు.
ఆడపిల్లలను వీధి చివర బడికి పంపడానికి కూడా అంగీకరించని ఒకనాటి భారతీయ కుటుంబాల భావజాలం నుంచి దేశం కాని దేశానికి ఒక్కర్తినే పంపే ధైర్యం చేసే వరకు మన కుటుంబాలు మారాయి.
ఆ మార్పును సాధించుకున్నది కూతుళ్లే కాదు ఆ ఇళ్ల తల్లులు కూడా. స్త్రీలు ఒప్పించుకోకపోతే మగవారు అంత సులువుగా ఒప్పుకోరు. అంత యుద్ధంలో హరియా ణకు చెందిన ఒకమ్మాయి తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని ఉక్రెయిన్ పక్షాన యుద్ధానికి వెళ్లిపోతే అతని భార్య ముగ్గురు చిన్నపిల్లలతో మిగిలిపోతే– నేను మా దేశానికి వెళ్లను... మీకు తోడుగా ఉంటాను అని ఆగిపోయింది.
బంకర్‌లో ఆ కుటుంబంతో ఉండిపోయింది. ‘తోడు లేకపోతే ఆడపిల్ల ఎలా?’ అనే స్థితి నుంచి యుద్ధంలో కూడా తోడు నిలిచే స్థితికి మన అమ్మాయిలు ఎదిగారు. చూడాల్సింది ఈ మార్పును. గమనించాల్సింది ఈ ఎదుగుదలను.
∙∙
ఊహ తెలిసిన వెంటనే పసిబిడ్డ కూడా గోడ మీద గీతలు గీసి తన ఉనికిని చాటుతాడు. మరి బుద్ధి, దేహం, వయసు, తెలివి, సామర్థ్యం ఉన్న స్త్రీలు తమ ఉనికిని నిరాకరించి నాలుగు గోడల మధ్యన ఎందుకు ఉండిపోవాలి. కుటుంబ బాధ్యత స్త్రీ, పురుషులది. దానిని పంచుకోవాలి. నిజమే.
తల్లిగా స్త్రీ బాధ్యత మరింత ఎక్కువ. అవును. అంగీకారమే. కాని దాంతోపాటు చదువుకున్న చదువుకు, సాధన చేసి సాధించుకున్న ప్రావీణ్యానికి, పెంచుకున్న అభిరుచికి, ఏర్పరుచుకున్న లక్ష్యానికి కూడా స్త్రీలు న్యాయం చేయాలనుకుంటారు.
భార్యగా, తల్లిగా వారు పొందే బాంధవ్యాల సంతృప్తితో పాటు సామాజిక జీవనంలో సాధించాలనుకున్న విజయాల సంతృప్తి కూడా వారికి కావాలి. ‘మేము చేయగలము’ అని స్త్రీలు ప్రపంచమంతటా అరిచి చెబుతూనే ఉన్నారు. మనదేశం చాలా ఆలస్యంగా వినడం మొదలెట్టింది. ఇంత కాలం గడిచినా వినాల్సిన, వినిపించుకోవాల్సిన మగ సమాజం ఇంకా ఉండనే ఉంది.
∙∙
హిమాలయాల పర్వతారోహకుల సమాఖ్యకు ఇప్పుడు ఒక స్త్రీ డైరెక్టర్‌గా ఉంది. స్త్రీలు తాము అధిరోహించడమే కాదు పర్వతారోహకులకు మార్గదర్శకులుగా మారారు. అలాగే 2017లో మొదలెట్టి 6 మంది మన నేవీ మహిళా ఆఫీసర్లు 254 రోజుల పాటు మగవారి ప్రమేయం లేకుండా మూడు మహా సముద్రాలను అనంత జలరాశిని దాటి వచ్చారు. ఒకప్పుడు స్త్రీలకు పర్వతాలపై ప్రవేశం లేదు.
ఓడల మీద అడుగు పెట్టనివ్వలేదు. కాని ఇవాళ ఎత్తయిన తలాలను, లోతైన అగాధాలను స్త్రీలు జయిస్తున్నారు. వీటినే జయిస్తున్నప్పుడు మైదానాలలో వారికి ఎదురేముంది? పని చోట్ల ఎదురయ్యే సవాళ్లు వారికేం లెక్క?
∙∙
తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని కొడుకులు అందిపుచ్చుకోవడం పాత చరిత్ర. ఇవాళ అలాంటి బాధ్యత దక్కిన కుమార్తెలు వ్యాపార దక్షులుగా నిలస్తున్నారు. భర్త అకాల మరణం చెందితే పగ్గాలు చేతబట్టి భారీ సంస్థలను కూడా గాడిలో పడేస్తున్నారు. విద్య, వైద్య, సాంకేతిక రంగాలనే కాదు ఆర్థిక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు.
భర్త ఇచ్చే నెల ఖర్చుల కోసం ఎదురు చూసే స్త్రీలు ఉండే దశ నుంచి మన సమాజం దేశం పద్దును తయారు చేసే స్త్రీల వరకూ చేసిన ప్రయాణం చూడతగ్గది. ఆ సామర్థ్యం గమనించదగ్గది.
∙∙
చదువు ముఖ్యం అని ఇల్లు, సమాజం, పాలన గ్రహించాయి స్త్రీలకు. ఉపాధి, ఉనికి కూడా ముఖ్యం అనేచోటే ఇంకా ఘర్షణ కొనసాగుతూ ఉంది. స్త్రీ ఉనికిని అంగీకరించి, ఆమె విజయానికి తోడు నిలిచి, ఆమె ప్రయాణాన్ని ప్రోత్సహించే తండ్రి/భర్త/కొడుకు గురించే ఇప్పుడు చింత. ఈ ముగ్గురూ బయట పౌరులుగా ఉంటూ తయారు చేసే ‘పౌర సమాజపు’ ఆలోచనా రీతి గురించే చింత.
స్త్రీల కట్టు, బొట్టు, ఆహార్యం... వారి భుజాల మీద ‘కుటుంబ పరువు’ తాలూకు బరువు, సంస్కృతిని పరిరక్షించాలనే కట్టుబాటు, ప్రవర్తన మీద ఆంక్ష... వీటి గురించే మగవారి ఆలోచన మారాల్సి ఉంది.
కుటుంబం కోసం, సమాజం కోసం, దేశం కోసం అన్నింటికి మించి తమ ఆత్మసంతృప్తి కోసం స్త్రీలు రెక్కలు సాచినప్పుడల్లా వాటిని కత్తించే భావజాలం నుంచి ‘మగభావజాలంతో నిండిన సమాజం’ బయటపడాలి. పురోగామి స్త్రీ వికాసాన్ని హేళన చేసే స్త్రీలను తయారు చేసే కుట్రను అర్థం చేసుకోవాలి.
∙∙
సమస్య ఎప్పుడూ ‘ఎక్కువ.. తక్కువ... సమానం’ గురించి కానే కాదు. స్త్రీల ఆకాంక్షలను, మనోభావాలను గౌరవించడం. ప్రతి వ్యక్తికి తనకు ఇష్టమైన పని చేసే హక్కు ఉంటుంది. తనకు ఇష్టం లేనిది చేయకూడని హక్కు కూడా ఉంటుంది.
మగ సమాజం తనకు ఇష్టమైనది మాత్రమే స్త్రీలు చేయాలనుకుంటూ ఉంటే, వారి చేత వారికి ఇష్టం లేనిది చేయించాలి అనుకుంటూ ఉంటే ఆ రోజులు ఇంకా చెల్లవు అని అర్థం చేసుకోవాలి.
స్త్రీలు తమ ఉమ్మడి శక్తితో ప్రభుత్వాలనే నిలదీసే శక్తి చూపుతూ, వాటిని ఓడగొడుతున్న ఉదంతాలు ఇటీవలే కనిపించాయి. స్త్రీల ఆలోచన ఎప్పుడూ కుటుంబాన్ని, కుటుంబం వంటి దేశాన్ని చక్కదిద్దాలనే ఉంటుంది.
అందుకై వారు బాగా చదివి, బాగా పని చేస్తూ, కుటుంబ బాధ్యతలు కూడా బాగా నిర్వహించాలి అని అనుకుంటే దానిని ఎలా అడ్డుకోవాలా అని కాకుండా ఎలా సపోర్ట్ చేయాలా అనుకునే పురుషుల భావజాలం ఇప్పుడు కావలసింది. స్త్రీ వికాసంలో స్త్రీ, పురుషులిద్దరూ పాల్గొన్నప్పుడు ప్రతిరోజూ నిజమైన విమెన్స్ డే అవుతుంది. హ్యాపీ విమెన్స్‌డే.
Comments
Please login to add a commentAdd a comment