కష్టాలను తట్టుకొని, త్వరగా కోలుకొని, తిరిగి మామూలు స్థితిలోకి వచ్చే మానసిక దృఢత్వాన్ని ఇంగ్లిష్‌లో ‘రిజిలియన్స్’ అని, తెలుగులో ‘స్థితిస్థాపకత్వం’ అని మనం అంటే అంటూండవచ్చు కానీ.. ఇక్కడ మాత్రం.. ‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్’ అని మాత్రమే ఆ.. దృఢత్వానికి అర్థం చెప్పుకోవాలి!
జాక్వెలిన్ బాలీవుడ్‌లోకి వచ్చి 15 ఏళ్లు అయింది. ఈ ఒకటిన్నర దశాబ్దాలలో ఆమె అనేక విజయాలను చవి చూశారు. కొన్ని కష్టకాలాలు కూడా ఆమెకు తమ తడాఖా చూపించాయి. అయితే – ‘‘కష్టం లేనిదే జీవితం లేదు. ఆ కష్టం నుంచి జీవితం ఏం నేర్పిందన్నదే మనకు ముఖ్యం’’ అని అంటారు జాక్వెలిన్.
‘‘నేనైతే గాలి దుమారంలా వచ్చిపోయే ఒడిదుడుకులకు గట్టిగా నిలబడటం నేర్చుకున్నాను. నాపై నేను నమ్మకాన్ని ఏర్పరచుకోవడాన్ని సాధన చేశాను. చేస్తున్న పని నుండి పారిపోవలసి వస్తే అసలా పనిలోకి ఎన్ని ఆశలతో వచ్చామన్నది మొదట గుర్తు చేసుకోవాలి. అక్కడి వరకు సాగిన మన ప్రయాణాన్ని వృథా కానివ్వకూడదని సంకల్పించుకోవాలి. ఇక నాకైతే నన్ను ప్రేమించే కుటుంబ సభ్యులు అండగా ఉన్నారు. నన్ను సంతోషంగా ఉంచే వ్యాపకాలూ నాకు తోడుగా ఉన్నాయి’’ అంటారు జాక్వెలిన్ .
శ్రీలంక నుంచి వచ్చి, ‘అలాద్దీన్’ (2009) చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమై, ‘మర్డర్–2’ తో ఇండస్త్రీలో నిలదొక్కుకున్న జాక్వెలిన్ .. ‘‘ఇండియా నన్ను స్వీకరిస్తే చాలునన్నదే అప్పటి నా కల’’ అంటారు. ‘‘అయితే ఈ దేశం నన్ను అక్కున చేర్చుకుని, ఆ కలను మించిన గుర్తింపునే ఇచ్చింది. మొదట్లో భాష కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ, బాలీవుడ్ ప్రేక్షకులు నాకిది పరాయి దేశం అన్న భావన కలగనంతగా నన్ను ఆదరించారు’’ అని ఆమె తెలిపారు.
ఈ పదిహేనేళ్లలోనూ 30కి పైగా చిత్రాలలో నటించిన జాక్వెలిన్ రెండు నెలల క్రితమే ‘స్టార్మ్ రైడర్’ మ్యూజిక్ వీడియోతో సంగీత ప్రపంచంలోకి కూడా ప్రవేశించారు. ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న ‘హౌస్‌ఫుల్ 5’ చిత్రంలో నటిస్తున్నారు. అందులో హీరో అక్షయ్ కుమార్.
‘‘ఏ రంగంలోనైనా ఎదుగుతున్న క్రమంలో సవాళ్లు ఎదురవటం మామూలే. అయితే ఊహించని వైపుల నుంచి సవాళ్లు చుట్టుముట్టినప్పుడు (బహుశా ఈడీ దాడులు, మీడియా రాతలు అని ఆమె ఉద్దేశం కావచ్చు) జీవితం తలకిందులు అయినట్లుగా అనిపిస్తుంది. అప్పుడే మనం దృఢంగా ఉండాలి.. ’’ అని హార్పర్స్ బజార్’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు జాక్వెలిన్
(చదవండి: జస్ట్ ఏడు రోజుల్లో 8 కిలోలు బరువు తగ్గిన నటి నిమ్రా ఖాన్: ఇది ఆరోగ్యకరమేనా..?)
Comments
Please login to add a commentAdd a comment