జీవనం కోసం తల్లిదండ్రులు పొలాలు అమ్ముకున్నారు.. జీవితంలో ఒడిదుడుకులను ఆత్మస్థైర్యంతో అధిగమించారు. తన మనసుకి నచ్చిన కేరళ అబ్బాయిని వివాహం చేసుకున్నారు. ప్రకృతిలో నివసించాలనుకున్నారు. రెండు సైకిళ్ల మీద ఈ దంపతులు తమ యాత్ర ప్రారంభించారు.. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట చేరుకుని, అక్కడ చిన్న కుటీరం నిర్మించుకుని, మనసుకి నచ్చిన పంటలు పండిస్తూ, రచనా వ్యాసంగం చేస్తున్న జయతి లోహితాక్ష్ తమ జీవనయాత్ర గురించి ఎన్నో విషయాలు వివరించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పుట్టారు జయతి. తన ఎనిమిదేళ్ళ వయసులో వర్షాలు లేక కుటుంబం అప్పులపాలై, జీవనం కోసం కాశీబుగ్గ చేరారు. అక్కడ వరికోతలు, తూర్పార పట్టడం ఎన్నో చూశారు. ‘‘ఎన్ని చూసినా ఏదో దిగులు, ఒంటరిగా దాక్కునేదాన్ని. ఆటలంటే ఇష్టం ఉండేది కాదు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండేదాన్ని’’ అంటున్న జయతి కుటుంబం చేను అమ్మి అప్పులు తీర్చి, హైదరాబాద్ వచ్చేశారు.
ఆరు వందలకు..
జీడిమెట్లలో ఒక కంపెనీలో ఆరు వందల జీతానికి చేరి, ఐదేళ్లు కష్టపడి పనిచేశాక, సంగారెడ్డి స్కూల్లో టీచరుగా పనిచేస్తున్న సమయంలో లోహి (లోహితాక్ష్)తో పరిచయమైంది. ‘‘ఇద్దరం కలిసి జీవించాలనుకుని, కడప జిల్లా మైదుకూరు చేరుకున్నాం. అక్కడి పిల్లలు, తల్లిదండ్రులు మమ్మల్ని బాగా ఇష్టపడ్డారు. మూడు సంవత్సరాలపాటు ‘భావన క్రియేటివ్ స్కూల్’ అని సొంత స్కూలు నడిపాం. ఫీజులు రాబట్ట లేక స్కూల్ మూసేశాం’’ అంటున్న జయతి లోహితాక్ష్, అక్కడున్న రోజుల్లోనే పీజీ పూర్తిచేశారు.
అడవిలోనే హాయి...
కడప నుంచి మళ్లీ హైదరాబాద్ వచ్చారు. తగినంత డబ్బు లేకుండా నగరంలో జీవించటం కంటె అడవిలో జీవించటం నయమనుకున్నారు. ‘‘నాకు అడవికి వెళ్లి, అక్కడ స్వచ్ఛంద సంస్థతో కాని, ప్రత్యేక అవసరాలున్న పిల్లలతో కాని పనిచెయ్యాలనే కోరిక కలిగి, అడవికి చేరుకున్నాం. పొద్దున్నే ఉడుతల్ని, పక్షుల్ని ఫొటోలు తీస్తూ, సాయంత్రం ట్యూషన్ చెప్పేదాన్ని. కొంతకాలం తరవాత ఛత్తీస్‌ఘడ్ వెళ్ళిపోయాం. అక్కడి పల్లెలు, కొండలు, అడవులు, పరవళ్లు తొక్కే నది, సాలవనం, పశువుల కాపర్లను ఫోటోలు తీసేదాన్ని. ఎంతోదూరం అడవి లో నడిచి కట్టెలు తెచ్చే మహిళలతో రోజంతా నడిచాను. కెమెరా పట్టుకొని ఒంటరిగా తిరగటం నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది’’ అంటున్న జయతి ఎక్కడా ఎక్కువకాలం ఉండలేకపోయారు.
అడవి దగ్గరైంది..
ఏకాంతాన్ని ఇష్టపడే జయతికి అడవిలో ఉండాలనే కోరిక నిద్రపోనిచ్చేది కాదు. ‘‘మా అమ్మ నాతో, ‘ఎవరూ చేయని పని చెయ్యాలి. నిన్ను చూసి అందరూ ఇలా జీవించాలని అనుకోవాలి’ అన్న మాటలు నా మనసు మీద బాగా పనిచేశాయి. అడవికి వెళ్ళపోదామని అప్రయత్నంగా నా నోటి నుంచి వచ్చిన మాటలను లోహితాక్ష్ అంగీకరించాడు’’ అంటున్న జయతి లోహితాక్ష్ లు, సైకిల్ మీద ప్రయాణం ప్రారంభించాలనుకున్నాక, వస్తువులన్నీ అమ్మేశారు. 2017 జనవరి 26న సైకిల్ ప్రయాణం ప్రారంభించారు.
‘‘ఏ రాత్రి ఎక్కడ ఆగిపోతామో మాకు తెలియదు. అరవై రోజులు పులికాట్ సరస్సు దాకా ప్రయాణించాక, ఇబ్రహీంపట్నం రిజర్వ్ ఫారెస్టునానుకొని ఉన్న ఒంటరి బంగళాలో ఏడాదిన్నర ఉన్నాం’’ అంటున్న జయతి అక్కడ కూరగాయలు పండిస్తూ, నెలకి రెండు వేల రూపాయలతో జీవించటం అలవాటు చేసుకున్నారు. అప్పుడప్పుడు లోహితా„Š చేసిన కంటెంట్ రైటింగ్ ద్వారా వారి అవసరాలకి సరిపడా డబ్బు వచ్చేది.
మళ్లీ ప్రయాణం..
ఇబ్రహీంపట్టణం నుంచి తూర్పుగోదావరి ధారపల్లి జలపాతం కింద అడవికి చేరుకుని, అక్కడ కుటీరం నిర్మించుకున్నారు. ‘‘అది గొడ్లపాక. పక్కనే నిత్యం ఏరు పారుతూ ఉంటుంది. తోట పెంచాం. పక్షులు, అడవి జంతువులు చేరేవి. పైకప్పులో పాము నివాసముండేది. అడవిలో కట్టెలు తెచ్చి, తోటలో కాసిన కూరగాయలతో వంట చేసుకున్నాం. ఎండకి, వానకి, చలికి ఆ కుటీరంలోనే ఉండిపోయాం’’ అంటున్న జయతి, లోహితా„Š లు స్వయంగా కుట్టుకున్న చెరి నాలుగు జతల బట్టలతో, కరెంటు లేకుండా రెండేళ్లు అక్కడే ఉన్నారు. కొన్నాళ్లకు కొండరెడ్లు వారిని వెళ్ళిపొమ్మనటం తో, కుటీరాన్ని వదిలేసి, అదే అడవిలో చలిలో కొండ మీద ఒక మహా వృక్షం కింద నెలరోజులు నివసించి, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట చేరుకుని, అక్కడే కుటీరం నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు.
2021లో తూర్పుగోదావరి జిల్లా పల్లిపాలెం, మధునాపంతుల ఫౌండేషన్ వారు Bicycle diaries - Nature Connectednedd Bicycle journey is first book పుస్తకాన్ని ఆవిష్కరించారు. ‘అడవి పుస్తకం’ నా రెండవ రచన. ఉత్తమ సాహిత్యం చదవడం, రాయాలనిపిస్తే రాయడం, ఆకలేస్తే వండుకోవడం, తోట పెంచడం, కొద్దిసేపు ఖాళీగా ఉండటం... ఇదీ మా దినచర్య.
– జయతి లోహితాక్ష్
జయతి దంపతులు నివసిస్తున్న కుటీరం
Comments
Please login to add a commentAdd a comment