భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు (Husband And Wife Relationship) కాలం గడిచే కొద్దీ మరింత బలపడతాయి. పిల్లలు, బాధ్యతలు, కష్టాలు కన్నీళ్లు ఎన్ని ఉన్నా వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. సంసార సాగరాన్ని ఈదుతున్న క్రమంలో వారి సఖ్యత మరింత దృఢపడుతుంది. పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందనేది సామెత. అలా ఒకరి పట్ల ఒకరు విశ్వాసంతో, ఒకరి ఇష్టా ఇష్టాలను గౌరవించుకుంటూ పోతే ఎలాంటి విభేదాలకు, పొరపచ్చాలకు తావుండదు. ఇద్దరిమధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుది. అది భవిష్యత్తరాలకు పునాది అవుతుంది. ఇదంతా ఎందుకంటే 25వ వార్షికోత్సవం (25th Wedding Anniversary) సందర్భంగా భార్య కోసం ఒక భర్త చేసిన రొమాంటిక్ డ్యాన్స్ ఇంటర్నెట్‌లో హృదయాలను గెలుచుకుంటోంది. సతీపతుల బంధం కాలానికి లొంగేదికాదు, ఏ వయసులోనైనా అది మనోహరమైనదే,స్వచ్ఛమైనదే తేల్చి చెప్పిన ఈ వీడియో నెట్టింట విశేషంగా నిలుస్తోంది.
మూడు ముళ్లు, ఏడు అడుగులతో మొదలైన ఆలుమగల అనుబంధం నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తారు పెద్దలు. అలా పాతికేళ్ల పాటు దంపతులుగా జీవించిన ఒక జంట తమ 25వ పెళ్లి రోజు వేడుకలను నిర్వహించుకుంటోంది. చుట్టూ కుటుంబ సభ్యులు, హితులు,సన్నిహితులు, అతిథులు అంతా ఉత్సాహంగా ఉన్నారు. దంపతులు అందంగా ముస్తాబయ్యారు. అందరి సమక్షంలో మరోసారి దండలు మార్చుకున్నారు. దీంతో ఆనందంగా శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇంతలో భర్త ఉత్సాహంగా డ్యాన్స్ వేయడం మొదలు పెట్టాడు. దీంతో పక్కనే భార్య సిగ్గుల మొగ్గైంది. అటు అతిథులు కూడా గొంతు కలిపారు. అక్కడే ఉన్న యువత చప్పట్లతో వారిని ఉత్సాహ పరిచారు. మరికొందరు ఈ ఆయన డ్యాన్స్‌ను తమ కెమెరాలలో బంధించారు.
బాలీవుడ్ మూవీ కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో షారుఖ్ ఖాన్ క్లాసిక్ సాంగ్ ‘ యే లడ్కా హై’ పాటు చక్కటి అభినయం చేస్తూ భార్యపై తన ప్రేమను బహిరంగంగా వ్యక్త పరిచడం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ రొమాంటిక్ డ్యాన్స్‌కు సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. సాక్షి బిస్త్ అనే యూజర్ ఐడీలో గత ఏడాది అక్టోబరులో పోస్ట్ అయిన ఈ వీడియో దాదాపు 11.1 లక్షల వ్యూస్ సంపాదించింది. భార్యభర్తల ప్రేమ అనురాగం పటిష్టంగా ఉండాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. భాగస్వాముల మధ్య విశ్వసనీయత ముఖ్యం అంటూ పలువురు ఈ జంటకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment