ముఖ్య ఘటనలు జరగడం, ప్రత్యేక దినోత్సవం వచ్చిందంటే చాలు సింహపురి గడ్డపై సముద్రం ఒడ్డున సైకత చిత్రం వెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో మొదలుపెట్టి మొన్న భారతదేశ త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, నిన్న గానకోకిల లతామంగేష్కర్ మరణం వరకు ఎందరో ప్రముఖుల సైకత చిత్రాలు సముద్రం ఒడ్డున వెలిశాయి. గడచిన పన్నెండేళ్లుగా 284 చిత్రాలను రూపొందించి ఎన్నో ప్రశంసలు, మరెన్నో అవార్డులను అందుకున్నాడు మంచాల సనత్‌కుమార్.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సనత్‌కుమార్ బీఎస్సీ పూర్తి చేశాడు. చిన్నప్పుడు ఇసుకలో బొమ్మలు గీయడం అలవాటు చేసుకున్న సనత్ ఎదిగిన తర్వాత తన ఆలోచనలు సైకత చిత్రాల వైపు మళ్లాయి. జీవ వైవిధ్యం, సేవ్ ఓషన్, స్టాప్ టెర్ర రిజం, కాలుష్య నియంత్రణ, ఫ్లెమింగో పక్షుల సంరక్షణ...ఇలా అనేక సామాజిక స్పృహ కల్గించే సైకత చిత్రాలను రూపొందించాడు. కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సైకతశిల్పాల రూపేణా వివరించాడు.
ఎప్పటికైనా సైకత చిత్రాలు వేయడంలో అంతర్జాతీయ పోటీలలో పాల్గోని ప్రతిభ చూపెట్టాలనే లక్ష్యంతో పుష్కర కాలంగా సనత్‌కుమార్ పయనిస్తున్నాడు. విద్యార్థులకు సైకత చిత్రాలు వేయడంలో మెలకువలు నేర్పిస్తూ ఇప్పటి వరకు రెండు వేల మందికి ‘సాండ్ ఆర్ట్ ట్రైనింగ్’ ఇచ్చాడు. మైపాడు బీచ్‌లో 2017లో వంద మంది విద్యార్థులతో ఏకకాలంలో 1186 జాతీయ జెండా సైకత చిత్రాలను తయారు చేయించాడు.
దాంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అండగా సైకత శిల్పాలను ప్రదర్శిస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంపై నూతనశకం ఆరంభమంటూ (న్యూ ఎరా బిగినింగ్ ఇన్ ఎడ్యుకేషన్) సైకత చిత్రం వేశాడు. బతుకులు మార్చే గుడి అమ్మ ఒడి, రక్షాబంధన్ రోజున దిశాయాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ సైకత చిత్రాలు తయారు చేశాడు.
– మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment