
ఉత్తరాఖండ్ శాసనసభకు రీతూ ఖండూరీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. ఆ రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా స్పీకర్‌గా ఆమె చారిత్రక గుర్తింపు పొందనున్నారు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరీ కుమార్తె అయిన రీతూ తొలిసారిగా 2017లో యమ్‌కేశ్వర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. అప్పటికీ ఆమెకు ఉన్న గుర్తింపు ‘బీసీ ఖండూరీ కుమార్తె’ ‘బీజేపి మహిళా మోర్చా అధ్యక్షురాలు’.
మరోవైపు చూస్తే...శైలేంద్రసింగ్ రావత్, విజయ బర్త్వల్ లాంటి దిగ్గజాలు. సిట్టింగ్ ఎంఎల్‌ఏ. విజయకు టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీజేపికి చెందిన బలమైన నాయకుడు శైలేంద్రసింగ్ రావత్ పార్టీ మారీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలోకి దిగారు. ఈ ఇద్దరికీ క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది.
మరోవైపు... ‘రీతూ నాన్ లోకల్’ అనే ప్రచారం. ఒక మాదిరి చిన్నపట్టణాలతో పాటు 230 గ్రామాల హృదయాలను గెలుచుకోవడం అంత తేలికైన విషయం కాదు. తన తండ్రి పేరు మాత్రమే విజయానికి బాట కాదనే విషయం తెలుసు. ఎన్నో ప్రతికూలతలను తట్టుకొని రీతూ ఖండూరీ యమ్‌కేశ్వర్ నుంచి గెలిచారు.
మొన్నటి ఎన్నికల్లో...
పార్టీ అధిష్ఠానం ఆమెను యమ్‌కేశ్వర్ నియోజక వర్గం నుంచి కాకుండా కొద్వార్ నుంచి పోటీ చేయించింది. ‘ఈసారి రీతూ ఓటమి నుంచి తప్పించుకోలేరు’ అనే మాట బలంగా వినిపించింది. పదిలమైన నియోజకవర్గం యమ్‌కేశ్వర్ నుంచి కాకుండా కొద్వార్ నుంచి పోటీ చేయడం రీతూకు కూడా ఇష్టం లేదు. అలా అని పెద్దల నిర్ణయాన్ని ధిక్కరించలేదు.
తాను గెలిస్తే నియోజకవర్గానికి చేయబోయే అభివృద్ధి పనులే తన ఎన్నికల ప్రణాళిక అయింది. అభివృద్ధి నినాదంతో రీతూ గెలిచారు. ఈసారి విశేషం ఏమిటంటే ‘ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి’గా రీతూ పేరు గట్టిగా వినిపించింది. ఇక ఆమె పేరు ప్రకటించడం లాంఛనమే అన్నంతగా ప్రచారం అయింది. ఏ సమీకరణలు ఆమె ముఖ్యమంత్రి కావడానికి అడ్డుపడ్డాయోగానీ, ముఖ్యమంత్రి పదవి దక్కకున్నా శాసనసభకు స్పీకర్‌గా ఎంపికయ్యారు.
తనకు గర్వాల్‌లో ఒక ఎన్జీవోను నడిపిన అనుభం ఉంది. టీచర్‌గా నోయిడాలోని ఒక విశ్వవిద్యాలయంలో పనిచేసిన అనుభవం ఉంది. స్పీకర్‌గా తన తొలి ప్రాధాన్యం మహిళా ప్రజాప్రతినిధులకు మరింత సౌకర్యవంతంగా శాసనసభను నిర్వహించడమే అంటున్నారు రీతూ ఖండూరీ భూషణ్.
Comments
Please login to add a commentAdd a comment