పురుషుల హక్కుల కోసమూ పోరాడాల్సిన పరిస్థితి
ఎన్నో ఏళ్లుగా మెన్స్ డే ఉన్నా సమాజానికి పట్టని వైనం
మగవారి త్యాగాల గురించి మగవారే కితాబిచ్చుకోవాలి
మాతృదినోత్సవం.. బాలల దినోత్సవం.. మహిళా దినోత్సవం.. ఇలా ఎన్నో రోజులు.. పండుగలను ఎంతో ఘనంగా జరుపుకొంటుంటాం. పురుషుల కోసం కూడా ప్రత్యేకంగా ఓ రోజు ఉంది. అదే ఏటా నవంబర్ 19న అంతర్జాతీయంగా జరుపుకోవాలని అందరూ సంకల్పం చెప్పుకొన్నారు. కానీ మహిళా దినోత్సవం మాదిరిగా పురుషుల దినోత్సవానికి పెద్దగా ప్రత్యేకత ఉండదు. వాస్తవానికి చాలాకాలం నుంచి పురుషులకూ అంకితమైన రోజు ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి చాలా ఏళ్ల చరిత్ర ఉన్నట్టే.. పురుషుల దినోత్సవానికీ ఓ చరిత్ర ఉంది. 1969 నుంచే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అనే కాన్సెప్ట్ మనుగడలో ఉంది. పైగా మిగతా దినోత్సవాలను గొప్పగా జరిపే మగవాళ్లు తమ కోసం ప్రత్యేకంగా ఉన్న రోజును మాత్రం పెద్దగా పట్టించుకోరని చెప్పుకోవచ్చు. ఎంతసేపూ మిగతా వారి గురించి ఆలోచిస్తారే తప్ప తమ గురించి ఆలోచించుకోరు. అందుకే వారి త్యాగాన్ని గుర్తిస్తూ.. పురుషులకు ఈ రోజును కేటాయించారు.
ఏటా నవంబర్ 19న అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ పురుషుల దినోత్సవం జరుపుతారు. 1992 ఫిబ్రవరి 7న ప్రొఫెసర్ థామస్ ఓస్టర్ ఈ రోజును ప్రారంభించినా.. ట్రినిడాడ్, టొబాగో దేశస్తులు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. దక్షిణ ఐరోపాకు చెందిన మాల్టా దీవిలో ఈ ఉత్సవాన్ని 1994 ఫిబ్రవరి 7 నుంచి క్రమం తప్పకుండా జరుపుతున్నారు. ఐక్యరాజ్య సమితి ఆమోదంతో మొదట 1999లో ట్రినిడాడ్ టొబాగోకు చెందిన వైద్యుడు డాక్టర్ డ్రైరోమ్ టీలక్సింగ్ అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని పునఃప్రారంభించారు. ఈ రోజున ప్రపంచంలోని మగవారంతా.. మగవారిని మెచ్చుకుంటారు. వారి శ్రమ, కృషిని ప్రశంసిస్తారు. మగవారి ద్వారా ఈ ప్రపంచం ఎలా ముందుకు వెళ్తున్నదో చర్చిస్తారు. సమాజంలో మగవాళ్ల పాత్ర ఎలా ఉందో చెప్పుకుంటారు. అలాగే సమాజానికి మేలు చేసిన గొప్ప గొప్ప పురుషులను ఈ రోజున కీర్తిస్తారు. వారిని రోల్ మోడల్స్‌గా భావిస్తూ.. వారు సమాజానికి చేసిన సేవల్ని చెబుతారు.
మన దగ్గర పుట్టి 18 ఏళ్లు..
భారత దేశంలోని పురుషుల హక్కుల సాధనా సంస్థ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (సిప్) నవంబర్ 19, 2007న దేశంలో మొదట ఈ వేడుకను నిర్వహించారు. అప్పటికే 498 చట్టం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న పురుషుల పుణ్యమానీ ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో అప్పటి నుంచీ దీన్ని ఏటా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీకి దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ శాఖలు ఉన్నాయి. పురుషుల హక్కుల కోసం సిప్ ఆధ్వర్యంలో 24/7 కాల్ సెంటర్ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అనేక అంశాల్లో పురుషుల హక్కుల గురించి సిప్ ఉద్యమిస్తోంది.
పెరుగుతున్న డ్రాప్ అవుట్స్..
అన్ని విషయాల మాదిరిగానే చుదువులోనూ గత కొంత కాలంగా మగపిల్లల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నారు. ఆర్థిక స్థితిగతులు, కుటుంబ పోషణ భారం వంటి కారణాలు, మగపిల్లాడు ఎలాగైనా బతికేస్తాడు.. అనే నిర్లక్ష్యంతో చదువుకు దూరమవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీనికితోడు మగవారిపై జరిగే గృహహింసను ఎవరూ పట్టించుకోరు. నూటికి 80 శాతం ఘటనలు వెలుగు చూడవు అంటే అతిశయోక్తి లేదు.
చుట్టుముడుతున్న ఆరోగ్య సమస్యలు..
పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక భారాలు మగవారిని మానసిక బలహీనులుగా మారుస్తున్నాయి. ఎప్పుడు ఊడతాయో తెలియని ఉద్యోగాలు, మరోవైపు పెరుగుతున్న ఖర్చులు, అటూ ఇటూ కాని జీతాలు వంటి సమస్యలతో అనేక రోగాలపాలవుతున్నారు. దీంతో బీపీ, మధుమేహం, గుండె జబ్బులు తదితర ఆరోగ్య సమస్యలతో పురుషులు సతమతమవుతున్నారు. అయినా ముఖంపై చెదరని చిరునవ్వుతో కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకుని బాధ్యగా మెలిగే మగవారికి హ్యాపీ మెన్స్ డే..
అనేక ఒత్తిళ్లు అధిగమిస్తూ..
రకరకాల వేధింపుల సంగతి పక్కనపెడితే..ఉద్యోగాలు, వ్యాపారాలు, పని ప్రదేశాల్లో వీరు ఎదుర్కొనే ఒత్తిళ్లు తక్కువేమీ కాదు.. మహిళలు చెప్పుకున్నంత తేలికగా మగవారు బయటపడలేరు. దీంతో పాటు కుటుంబ భారం, ఆర్థిక పరిస్థితులు వంటి ఇతరత్రా ఒత్తిళ్ల కారణంగా మానసికంగా పురుషులు అంతకంతకూ బలహీనులుగా మారుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఆత్మహత్యల విషయంలో మహిళల కన్నా పురుషుల్లోనే 3 రెట్లు ఎక్కువ కనిపిస్తుంది.
వెలుగు చూడనివెన్నో...
ఎక్కడ చూసినా మహిళాభివృద్ధి, సంక్షేమం గురించే మాట్లాడుతుంటాం. పురుషుల హక్కులు, వారి రక్షణ గురించి చివరికి పురుషులే పట్టించుకోరు. ఎవరైనా ముందడుగేసి చెప్పుకున్నా..! చిన్నచూపు చూస్తారు. లేదా సమాజంలో గౌరవం పోతుందని బయటపెట్టని, వెలుగు చూడని ఘటనలు లేకపోలేదు. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థల సర్వేలు సైతం తేటతెల్లం చేస్తున్నాయి. చిన్న వయసులో బాలల పై జరిగే లైంగిక దాడుల్లో ఆడపిల్లలపై జరిగే దాడులు 45 శాతం కాగా, మగ పిల్లలపై జరిగేవి 55 శాతంగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటిపై ఎవరూ మాట్లాడరు.
Comments
Please login to add a commentAdd a comment