హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో పర్విందర్ చావ్లా, ఎల్లోరాలో..., టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో...
‘నా వీల్‌చైరే నా రెక్కల గుర్రం’ అంటుంది పర్విందర్ చావ్లా. ప్రపంచంలో 196 దేశాలు ఉంటే ఇప్పటికి వీల్‌చైర్ మీదే 59 చుట్టేసింది. 15 ఏళ్ల వయసులో ఆర్థ్రయిటీస్ వల్ల వీల్‌చైర్‌కి పరిమితం అయిన చావ్లా జీవితాన్ని ఉత్సాహంగా ఉంచడానికి పర్యటనలను మార్గం చేసింది. తిరగాలన్న పురుగు కుట్టనే కూడదు... ఒక్కసారి కుట్టాక ఎన్ని అడ్డంకులొచ్చినా ఆగరు అంటున్న చావ్లా అన్నీ సక్రమంగా ఉన్నా లోకాన్ని చూడక కుదేలై ఉండేవారికి చాలా స్ఫూర్తినిస్తోంది.
ఆమెకు 15 ఏళ్లు ఉన్నప్పుడు జరిగింది అది. ఏదో పెళ్లి ఫంక్షన్. భోజనానికి కూచున్న పర్విందర్ చావ్లా తినడానికి దవడ తెరవలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి వాళ్లందరూ డాన్స్ చేస్తుంటే తానూ డాన్స్ చేయబోయి నడుము వంచలేక కింద పడిపోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళితే తీవ్రమైన రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ అన్నారు. ఆ తర్వాత పర్విందర్ చావ్లా జీవితం రెండేళ్ల పాటు నరకంగా మారింది. మంచం మీద పడుకునే ఉండిపోయింది.
ఇటు నుంచి అటు కదలాలన్నా విపరీతమైన నొప్పి.ఆ తర్వాత మెల్ల మెల్లగా కోలుకుంది. కాని చేతి వేళ్లతో సహా చాలా శరీర భాగాల్లోని జాయింట్లు దెబ్బతిన్నాయి. 21 ఏట వచ్చే సరికి వీల్ చైర్‌కు పరిమితం కాక తప్పలేదు. కొద్దిగా లేవగలదు. నాలుగు అడుగులు వేయగలదు. కాని మిగిలినదంతా వీల్‌చైర్ పైనే. శరీరాన్ని కదల్చే వీలు లేకుండా చేసి జీవితం తనను ఆపగలిగింది... కాని కదలకుండా ఉండిపోయి జీవితాన్ని గెలవనీకూడదు. దానిని ఓడించాలి అని పర్విందర్ నిశ్చయించుకుంది.
వైష్ణోదేవి యాత్ర మొదలు
పర్విందర్ చావ్లాది లూధియానా. తండ్రికి హోటల్ బిజినెస్ ఉంది. తల్లి గృహిణి. కూతురి అవస్థ చూసి తండ్రి నీ ఇష్టమైన పని చేసి సంతోషంగా ఉండు అని ప్రోత్సహించాడు. ఆ సమయంలోనే కాలేజీ ఫ్రెండ్స్ కొందరు వైష్ణోదేవిని దర్శించుకోవడానికి జమ్ము కశ్మీర్ వెళుతుంటే పర్విందర్ కూడా వాళ్లతో వెళ్లాలనుకుంది. కాని వీల్‌చైర్‌తో ఆ ప్రయాణం ఏ మాత్రం అనువుగా ఉంటుందో తెలియదు. పర్విందర్ ధైర్యం చేసింది. వైష్ణోదేవి మందిరం చేరుకుంది.
లోపలికి వెళ్లడానికి ర్యాంప్ లేదు. నలుగురు భక్తులు కుర్చీతో సహా లేపి ఆమెను లోపలికి తీసుకెళ్లారు. అందాక ఇంట్లో, పరిమిత వీధుల్లో తిరిగిన పర్విందర్‌కు ఆ హిమాలయాల చెంత, ఆ ప్రకృతి మధ్యన, ఆ ఆధ్యాత్మిక ప్రదేశంలో అమితమైన ఆనందం కలిగింది. ఏమిటి... ప్రయాణాలు చేస్తే ఇంత బాగుంటుందా? అనుకుంది. ‘అప్పుడే నన్ను తిరిగే పురుగు కుట్టింది’ అంటుంది పర్విందర్ నవ్వుతూ.
ఒంటరిగానే తిరగాలని...
పర్విందర్ ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయ్యింది. అక్కడి నుంచే ప్రపంచ దేశాలన్నీ తిరగాలని నిశ్చయించుకుంది. ఆమె అప్పటికే దాదాపు లక్షన్నర రూపాయల విలువైన మంచి నాణ్యత కలిగిన లైట్ వెయిట్ వీల్‌చైర్‌ను ఏర్పాటు చేసుకుంది. దాని మీద కూచుని రోడ్ల మీద హాయిగా తిరగొచ్చు. దానిని సెకన్లలో మడిచి ట్యాక్సీలో ఎక్కించి ఎయిర్‌పోర్ట్ వెళ్లొచ్చు. సెకన్లలో తెరిచి కూచోవచ్చు. ఎవరో ఒకరు తోడు వస్తే బాగుంటుంది కానీ వారి కదలికలకి తన కదలికలకి చాలా తేడా ఉంటుంది. అందుకే తాను ఒక్కర్తే తిరగాలని నిశ్చయించుకుంది.
దుబాయ్‌తో మొదలు
ప్రపంచ దేశాలన్నింటిలోకి వీల్‌చైర్ ఫ్రెండ్లీ దేశం దుబాయ్ అని పర్విందర్ తెలుసుకుంది. అందుకే మొదట ఆ దేశానికే ఒంటరిగా ప్రయాణం కట్టింది. ప్రయాణం చేసే ముందు తాను దిగబోయే హోటల్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటుంది పర్విందర్. అక్కడ ఉన్న మెట్ల గురించి, ర్యాంప్‌ల గురించి, గదిలో టాయిలెట్‌ల సౌకర్యం గురించి దివ్యాంగులను సపోర్ట్ చేసేలా అక్కడ వ్యవస్థ ఉందో లేదో చూసుకుని వెళుతుంది.
‘మీరు భాష రాని దేశానికి వెళుతున్నట్టయితే గూగుల్ ట్రాన్స్‌లేటర్ డౌన్‌లోడ్ చేసుకుని ఉండాలి’ అంటుంది పర్విందర్. ఆ తర్వాత ఆమె బాలీ వెళ్లింది. ఆ తర్వాత రోమ్. ఆ తర్వాత అలా అలా ఆమె ప్రయాణాలు సాగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు 53 ఏళ్లు ఆమెకు. 59 దేశాలు చూసింది. ‘ఒక వంతు ప్రపంచం చూశాను. ఇంకా మూడు వంతులు చూడాలి’ అంటుందామె. ఈ ప్రయాణాల వల్లే కాబోలు ఆమె నైరాశ్యం దరి చేరకుండా ఉత్సాహంగా ఉంటుంది.
మనుషులే తోడు
ఏ దేశం వెళ్లినా మనుషులే తోడుగా సాయం చేయడం ఆమె గమనించింది. ‘మనం మంచిని చూస్తే మంచి చెడును చూస్తే చెడు ఈ లోకంలో కనిపిస్తాయి. ఎందరో ముక్కూ మొహం తెలియని వ్యక్తులు ఈ పర్యటనల్లో నాకు సాయం చేశారు. కొందరు బస్సు ఎక్కిస్తే మరి కొందరు నేను దిగాల్సిన హోటల్ వరకూ వచ్చి దిగబెట్టి వెళ్లారు. ‘మీరు ప్రకృతిని చూడాలంటే ఆస్ట్రేలియా వెళ్లాలి.
నేను అక్కడకు వెళ్లి నెలల తరబడి ఉంటాను’ అంటుందామె. అమెరికాలో కొన్ని నగరాలు, లండన్ వీల్‌చైర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మన దేశంలో ఆగ్రా పూర్తిగా వీల్‌చైర్ ఫ్రెండ్లీ. ఆ తర్వాత మన దేశంలో ఢిల్లీ అంటుందామె. కాని చైనాలో ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ‘వాళ్లు మనం ఏం చెబుతున్నామో అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు’ అంటుంది పర్విందర్.
ఆమె ప్రయాణాలు ఆమెకు స్వస్థత కలిగిస్తూనే ఉంటాయి.
దోహాలో..., ఆస్క్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్‌లో...
Comments
Please login to add a commentAdd a comment