Pooja Dhingra: Mumbai Woman Inspirational Journey Le15 Patisserie: ఇంట్లో అమ్మచేసే రకరకాల వంటకాలు తింటూ పెరిగినప్పటికీ... కొత్తప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి పాపులర్ రుచులను తెలుసుకుని మరీ టేస్ట్ చేస్తాం. వాటిలో ఏవైనా నచ్చితే అవి దొరికినప్పుడల్లా తినడానికి ప్రయత్నిస్తుంటాము. కొన్నిసార్లు ఆయా వంటకాలను స్వయంగా తయారు చేయడానికీ వెనుకాడము. ఎగ్ వైట్, పంచదార, బటర్‌తో చేసే ఫ్రాన్స్ మ్యాక్రాన్స్ రుచి నచ్చిన పూజా ధింగ్రా మాత్రం ...మ్యాక్రాన్స్‌ను చేయడం నేర్చుకోవడమేగాక, ఏకంగా ఇండియాలో తొలి మ్యాక్రాన్ స్టోర్‌ను ప్రారంభించి అందరికి మ్యాక్రాన్స్ రుచి చూపిస్తోంది. ఫ్రెంచ్ రుచులను మనదేశంలో అందిస్తూ.. ‘ఎంట్రప్రెన్యూర్ షెఫ్’గా ఎదిగి లక్షలమందికి ప్రేరణగా నిలుస్తోంది.
పూజా ధింగ్రా ముంబైలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఆరేళ్లున్నప్పుడు.. పూజా ఆంటీ బ్రౌనీలు చేయమని పూజను అడిగింది. తనకు తెలిసిన పదార్థాలతో చాక్లెట్ బ్రౌనీలను చాలా రుచిగా తయారు చేసింది పూజా. ఈ బ్రౌనీలు అందరికి నచ్చడంతో..పూజకు బేకింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. దీంతో అప్పటినుంచి వీకెండ్స్‌లో రకరకాల బ్రౌనీలు చేస్తూ ఇంట్లో వాళ్లకు, తన స్నేహితులకు పెట్టేది. అయితే ఎప్పుడూ షెఫ్ కావాలనుకోలేదు.
ఇంటర్మీడియట్ తరువాత పెద్ద లాయరు అవుదామని ‘లా’ కాలేజీలో చేరింది. రెండు వారాలపాటు తరగతులకు హాజరైన తరువాత, తనకు లా కాకుండా చెఫ్‌గా మారాలనిపించింది. దీంతో ‘లా’ వదిలేసి స్విట్జర్లాండ్ వెళ్లిపోయింది. అక్కడ సీజర్ రిట్జ్ కాలేజీలో ‘హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్’ కోర్సులో చేరింది. కోర్సు చేసే సమయంలో.. పైన్‌యాపిల్ కేక్, డచ్ ట్రుఫిల్ పేస్ట్రీస్‌ను రుచిచూసిన పూజ ఒకరోజు అనుకోకుండా మ్యాక్రాన్‌లను తింది.
మ్యాక్రాన్స్ రుచి పూజను కట్టిపడేసింది. దీంతో పేస్ట్రీల తయారీని కెరియర్‌గా మల్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలోనే మ్యాక్రాన్స్ తయారీ నేర్చుకోవాలనుకుంది. వంటశాలకు, హాస్పిటాలిటీకి ప్రపంచంలో పేరెన్నికగన్న ‘లి కార్డన్ బ్ల్యూ’ కాలేజీలో ప్యారీస్ రుచుల తయారీలపై కోర్సు చేసింది.
లి 15 పట్టేస్సరీ..
హాస్పిటాలిటి కోర్సు పూర్తిచేసి 2009లో ఇండియాకు తిరిగి వచ్చిన పూజా.. ఇంట్లో మ్యాక్రాన్‌లను తయారు చేసింది. కానీ ఎంత ప్రయత్నించినా అవి అంత బాగా వచ్చేవి కావు. దాదాపు యాభై సార్లు ప్రయత్నించిన తరువాత మ్యాక్రాన్స్ తయారు చేయడం నేర్చుకుంది. మ్యాక్రాన్స్ అయితే తయారు చేసింది కానీ వాటిని ఎలా విక్రయించాలో అర్థం కాలేదు. మరుసటి ఏడాది డిసెంబర్‌లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ధైర్యం చేసి పదిలక్షల లోన్ తీసుకుని పరేల్ ప్రాంతంలో ‘లి15 పట్టేస్సరీ’ మ్యాక్రాన్ స్టోర్‌ను ప్రారంభించింది.
ఇండియాలో తొలి మ్యాక్రాన్ స్టోర్ కావడం, రుచి సరికొత్తగా ఉండడంతో పూజా మ్యాక్రాన్స్ విక్రయాలు క్రమంగా పుంజుకున్నాయి. దీంతో పల్లాడియం మాల్, బాంద్రాలలో మరో రెండు అవుట్‌లెట్‌లను ప్రారంభించింది. లి 15లో.. మ్యాక్రాన్స్‌తో పాటు రెడ్ వెల్‌వెట్ కప్‌కేక్‌లకు మంచి డిమాండ్ ఉండడంతో స్టోర్ బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం మ్యాక్రాన్స్‌తోపాటు కప్‌కేక్స్, టార్ట్స్‌ను అందిస్తోంది. వీటిని వివిధ రకాల ఫంక్షన్‌లు, కార్పొరేట్ సెక్టార్ ఈవెంట్స్‌లో బహుమతిగా ఇచ్చేందుకు పెద్దపెద్ద ఆర్డర్లు వస్తుండడంతో పూజా ‘మ్యాక్రాన్ క్వీన్’గా పాపులర్ అయ్యింది. పూజా మ్యాక్రాన్స్ ఇష్టపడే కస్టమర్లలో సోనమ్ కపూర్, సల్మాన్‌ఖాన్, మసబా గుప్తా, అలియా భట్ వంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
ముగ్గురు పనివాళ్లతో ప్రారంభించిన “లి15 పట్టేస్సేరీ’ స్టోర్ ఇప్పుడు వందలమందితో దేశంలోని ప్రముఖ నగరాలకు సేవలనందిస్తూ విజయవంతంగా నడుస్తోంది. పూజా మ్యాక్రాన్ క్వీన్‌గా కొనసాగుతూ వెస్ట్రన్ డిజర్ట్స్‌పై మూడు పుస్తకాలను ప్రచురించింది. వీటిలో ‘ద బిగ్ బుక్ ఆఫ్ ట్రీట్స్’ బుక్ ‘ప్రపంచ గౌరమండ్ కుక్‌బుక్’ అవార్డుల కార్యక్రమంలో రెండో విజేతగా నిలిచింది. ప్రారంభంలో అనేక సమస్యలు ఎదురైనప్పటికీ నిలదొక్కుకుని ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో కూడా చోటు దక్కించుకుంది. సరికొత్త పేస్ట్రీలు, మ్యాక్రాన్స్ తయారు చేస్తూ తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్‌లో పోస్టుచేస్తోంది. దీంతో పూజను ఫాలో అయ్యేవారి సంఖ్య 70 లక్షలకు చేరింది.
చదవండి: Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
Comments
Please login to add a commentAdd a comment