నటించే పాత్రకు తగ్గట్టు పరకాయ ప్రవేశం చేయడం నటుల ప్రాథమిక లక్షణం. కట్టూ బొట్టు, ఆహార్యం ఇలా అన్నింటిలోనూ ఆ పాత్రకు న్యాయం చేసేందుకు నటీనటులు చాలా కష్టపడతారు. ప్రేక్షకులని అలరించేందుకు ఎంతో రిస్క్ చేసి మరీ తమ బాడీని మలచుకుంటారు. అలాంటి వారిలో తాజాగా రణదీప్ హుడా మరోసారి ప్రత్యేకంగా నిలిచాడు. 'స్వతంత్ర వీర్ సావర్కర్' బయోపిక్ కోసం విపరీతంగా బరువు తగ్గి తన లుక్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
పాత్రకు తగ్గట్టు శరీరాన్ని, ఆహార్యాన్నిమార్చుకోవడంలో రణదీప్ ప్రత్యేకతే వేరు.అందుకే రణదీప్ హుడాను హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ బాలేతో పోల్చుతారు. 2016లో సరబ్‌జిత్ సినిమా కోసం 20 కిలోలు, అదే ఏడాది దో లఫ్జోన్ కి కహానీ సినిమా కోసం తన బరువును 77 కిలోల నుంచి 94 కిలోలకు చేరేలా కష్టపడ్డాడు. విలక్షణ శైలితో విమర్శకుల ప్రశంసలు పొందిన నటుడాయన. 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై' నుంచి సరబ్‌జిత్ సింగ్, ఇపుడు వీర సావర్కర్ దాకా పాత్రల్లో జీవించే ప్రతిభావంతుడైన నటుడు.
సోదరి డా. అంజలి సాయం
తాజాగా స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రంలో వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్రను పోషించాడు. ఈ పాత్రకోసం రణదీప్ ఏకంగా 26 కిలోల బరువు తగ్గాడు. సెల్యులార్ జైల్లో ఉన్నప్పుడు 'కాలా పానీ' పాత్ర సజీవంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నాడు. రణదీప్ హుడా సోదరి, డాక్టర్ అంజలి సాయం తీసుకున్నాడట. ఆమె రూపొందించిన పాలియో డైట్‌తో బక్క చిక్కిన దేహంతో ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేశాడు.
నిపుణుల సమక్షంలో పాలియో డైట్
సోదరి డాక్టర్ అంజలి హుడా వృత్తిరీత్యా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అని,తన కోసం పాలియో డైట్‌ను రూపొందించిందని స్వయంగా రణదీప్ హుడా వెల్లడించాడు. వివిధ దశలలో గుడ్లు, నట్స్, ఖర్జూరాలు , డార్క్ చాక్లెట్‌లు డైట్ చేర్చుకున్నానని తెలిపాడు. దీంతోపాటు ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ ద్వారా ఐదు రోజుల వ్యవధిలో 6-7 కిలోల బరువు తగ్గాననీ, ఈ జర్నీలో విటమిన్ సప్లిమెంట్లను కూడా తీసుకున్నానని చెప్పాడు. నిపుణుల పర్యవేక్షణలోనే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. పెర్‌ఫెక్ట్‌గా ఉండటమే తనకిష్టమని తెలిపాడు. ఖర్జూరం, పాలుతో బరువు తగ్గుతారు అనేది ఫేక్ న్యూస్ అని కూడా చెప్పాడు. అంతేకాదు ఈ సినిమాకు దర్శకుడిగా రణదీప్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. మార్చి 22 న ఈ మూవీ విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment