ఈశాసింగ్‌.. ట్రిగర్‌ నొక్కితే బుల్లెట్‌ లక్ష్యాన్ని ఛేదించాల్సిందే..! | Sakshi Special Story On Hyderabad Shooter Esha Singh | Sakshi
Sakshi News home page

ఈశాసింగ్‌.. ట్రిగర్‌ నొక్కితే బుల్లెట్‌ లక్ష్యాన్ని ఛేదించాల్సిందే..!

Published Tue, Jan 18 2022 11:22 PM | Last Updated on Wed, Jan 19 2022 1:21 PM

Sakshi Special Story On Hyderabad Shooter Esha Singh

ఈశాసింగ్‌... తొమ్మిదో ఏట పిస్టల్‌ పట్టుకుంది.తొలి పిస్టల్‌ ఖరీదు డెబ్బై వేలు. పాతికకు పైగా జాతీయ పతకాలు. పదికి పైగా అంతర్జాతీయ పతకాలు. ఇప్పుడు స్టార్‌ పిస్టల్‌ పట్టుకుంది. మరిన్ని పతకాలకు గురిపెడుతోంది... తెలుగు నేల మీద పుట్టిన ఈ స్టార్‌ షూటర్‌.

ఈశాసింగ్‌... గురి చూసి ట్రిగర్‌ నొక్కితే బుల్లెట్‌ లక్ష్యాన్ని ఛేదించాల్సిందే. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో గురితప్పని ఈ షూటర్‌ అత్యున్నత లక్ష్యం ఒలింపిక్స్‌. ఆమె వివరాల్లోకి వెళ్తే... నాలుగు తరాల వెనుక (ఈశాసింగ్‌ తండ్రి తాతగారు) తెలుగు రాష్ట్రానికి వచ్చి స్థిరపడిన రాజ్‌పుత్రుల కుటుంబం వారిది. ఈశా షూటింగ్‌ ప్రస్థానం కాకతాళీయంగా జరిగిపోయింది. ఈశా తండ్రి సచిన్‌ సింగ్‌కి బైక్‌ ర్యాలీ, కార్‌ ర్యాలీలంటే మహాఇష్టం. ఒకరోజు ‘నాన్నా! లాంగ్‌రైడ్‌కి వెళ్దామా’ అని ఈశాసింగ్‌ అడగడం, సచిన్‌ కారు తీయడం, కూతుర్ని సరదాగా తిప్పి ఆ తర్వాత గచ్చిబౌలిలోని షూటింగ్‌ రేంజ్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న తన మిత్రుడి దగ్గరకు వెళ్లడం ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే జరిగిపోయింది. ఆ ప్రయాణం... ఆశాసింగ్‌ కొత్తదారి ప్రయాణానికి శ్రీకారం చుడుతుందని ఆరోజు ఎవరూ అనుకోలేదు.

‘నాకు పిస్టల్‌ కావాలి’ అని ఆశాసింగ్‌ అడిగినప్పుడు, డెబ్బై వేలు పెట్టి కొనిచ్చేటప్పుడు కూడా ‘ఈశా ఇంత సీరియెస్‌గా ప్రాక్టీస్‌ చేస్తుందనుకోలేద’న్నారు సచిన్‌ సింగ్‌. ‘షూటింగ్‌ పట్ల నా ఆసక్తిని గమనించిన తర్వాత నాన్న నన్ను పూణెలో జరిగే శిక్షణ కార్యక్రమాలకు తీసుకువెళ్లారు. అక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోటీల్లో 2015, 16, 17 సంవత్సరాల్లో వరుసగా మూడుసార్లు బంగారు పతకాలు వచ్చాయి. ఆ పతకాలు చూసి నాన్న తాను ర్యాలీలో గెలిచినంతగా సంతోషించారు’’ అని గుర్తు చేసుకుంది ఆశాసింగ్‌. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ రెండవ ఎడిషన్‌లో బంగారు పతకాన్ని సాధించినప్పటికి ఆమె వయసు 15. షూటింగ్‌లో ఒలింపిక్‌ విజేత మనూ భాకర్‌ మీద విజయం, 2020 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కారాన్ని అందుకోవడం ఈశాసింగ్‌కి షూటింగ్‌ కెరీర్‌ ఇచ్చిన తీపి జ్ఞాపకాలు.

 

నాన్న త్యాగం
‘‘నాన్న నా కోసం తన ర్యాలీలను మానుకున్నారు. నన్ను కోచింగ్‌కి తీసుకువెళ్లడం, కాంపిటీషన్‌లకు తీసుకువెళ్లడమే నాన్న ఫుల్‌టైమ్‌ జాబ్‌ అయింది. నాన్న నాతో వచ్చినప్పుడు మా స్పోర్ట్స్‌ షాప్‌ని  అమ్మ చూసుకుంటుంది. నేను జర్మనీ, బ్రెజిల్, లిమాపెరూ, చెక్‌ రిపబ్లిక్‌లలో ఇంటర్నేషనల్‌ కాంపిటీషన్‌లకు వెళ్లాను. మనదేశంలో జరిగే ప్రతి పిస్టల్‌ షూటింగ్‌ కాంపిటీషన్‌లోనూ పార్టిసిపేట్‌ చేశాను, మెడల్స్‌ తెచ్చుకున్నాను. గడచిన డిసెంబర్‌లో (2021) న్యూఢిల్లీ, ఫరీదాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి ఎయిర్‌పిస్టల్‌షూటింగ్‌ పోటీల్లో రెండు గోల్డ్, నాలుగు బ్రాంజ్‌ మెడల్స్‌ వచ్చాయి. ఇప్పటి వరకు జాతీయ స్థాయి పతకాలు ఇరవై ఐదు వరకు ఉన్నాయి, ఇంటర్నేషనల్‌ మెడల్స్‌ పద్నాలుగు. ఇప్పుడు జర్మనీ కంపెనీ బహూకరించిన స్టార్‌ పిస్టల్‌తో ప్రాక్టీస్‌ చేస్తున్నాను. 

ఆరు గంటల ప్రాక్టీస్‌
నా ప్రాక్టీస్‌ కోసం సికింద్రాబాద్‌లోని మా ఇంట్లోనే చిన్న షూటింగ్‌ రేంజ్‌ ఏర్పాటు చేశారు మా నాన్న. రోజుకు ఆరు గంటల సేపు షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తాను. కోవిడ్‌ కారణంగా రెండేళ్లుగా ఆన్‌లైన్‌ క్లాసులే కావడంతో ప్రాక్టీస్‌కి టైమ్‌ కలసి వస్తోంది. రాంపల్లిలోని రీక్వెల్‌ ఫోర్డ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో లెవెన్త్‌ క్లాస్‌ చదువుతున్నాను. నేను కాంపిటీషన్‌లకు వెళ్లడానికి, స్పెషల్‌ ట్రైనింగ్‌ క్లాసులకు వెళ్లడానికి పర్మిషన్‌ ఇస్తూ మా టీచర్లు, ప్రిన్సిపల్‌ చాలా బాగా ఎంకరేజ్‌ చేస్తున్నారు. నిజానికి ఇది చాలా క్లిష్టమైన ప్రయాణమే. ఇష్టంగా మొదలు పెట్టాను. కాబట్టి కష్టం అనుకోవడం లేదు. ప్రతి విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. ప్రాక్టీస్, స్కూలు రెండింటినీ సమన్వయం చేసుకోవడంలో ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లలేను. సినిమాలకు కూడా తక్కువే. బంధువుల ఇళ్లలో పెళ్లిళ్లు ఇతర వేడుకలను కూడా వదులుకోవాల్సిందే. ఎక్కువగా టోర్నమెంట్‌ ప్రయాణాల్లో ఉంటాను. టోర్నమెంట్‌ నుంచి వచ్చిన తరవాత అప్పుడు మిస్‌ అయిన పాఠాల నోట్స్‌ రాసుకోవాలి.

ఇదంతా ఒక వైపు అయితే మరోవైపు ఈ ప్రాక్టీస్‌కి అయ్యే ఖర్చు. షూటింగ్‌ ప్రాక్టీస్‌కి చాలా ఖర్చవుతుంది. పూజా బిల్డర్స్‌ కొంత వరకు సపోర్ట్‌ చేస్తున్నారు. ఇక మిగిలిన ఖర్చులన్నీ నాన్న చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు నేను సాధించిన మెడల్స్‌ చూసుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. అలాగే అవి నా బాధ్యతను గుర్తు చేస్తుంటాయి కూడా. ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం తీసుకురావాలనేది నా లక్ష్యం మాత్రమే కాదు, బాధ్యత కూడా. భారతదేశానికి మెడల్‌ తెచ్చిన రోజున నేను గర్వంగా ఫీలవుతాను. అప్పటి వరకు సాగే ఈ ప్రయాణం అంతా లక్ష్యసాధనలో అధిరోహిస్తున్న మెట్లు మాత్రమే’’ అని చెప్పింది ఈశాసింగ్‌. ఆమె లక్ష్యం నెరవేరాలి. మనజాతీయ పతాకం ఒలింపిక్స్‌లో మెరవాలి. గురి తప్పకూడదు. (చదవండి: చండీగఢ్‌ కరే ఆషికీ..ఈ కథకు ధైర్యం ఎక్కువ)
– వాకా మంజులారెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement