బాలీవుడ్ సినిమా ‘దంగల్’లో ఒక డైలాగ్... ‘పతకాలు సాధించే విజేతలు చెట్లపై పెరగరు. కష్టపడి ప్రేమతో, అంకితభావంతో వారిని తయారు చేయాలి’ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన సాదియా అల్మాస్ గురించి తెలుసుకునే క్రమంలో ‘దంగల్’ గుర్తుకు వస్తుంది. మల్లయోధుడైన తండ్రి తన కూతుళ్లు రెజ్లింగ్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కలలు కంటాడు. ఎన్నో కష్టాలు పడతాడు. సాదియా తండ్రి సందానీ కూడా అలాంటి కలల తండ్రే.
‘పవర్ లిఫ్టింగ్’లో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన సమ్దానీకి తనలోని ఛాంపియన్‌ను కూతురిలో చూసుకోవాలనుకున్నాడు. జీవిక కోసం కొబ్బరి బొండాలు అమ్ముతూ కూతురిని పవర్ లిఫ్టింగ్‌లో తీర్చిదిద్దాడు. అతడి శ్రమ వృథా పోలేదు. సాదియా అల్మాస్ అంతర్జాతీయ జూనియర్ పవర్ లిఫ్టింగ్‌లో రాణిస్తోంది. సాదియాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఎంతో ఇష్టం. కబడ్డీ బాగా అడేది. ‘యముడు’ ‘సింగం’ సినిమాలలో హీరో సూర్య సాహసాలు చూసిన సాదియాకు పోలిస్ ఆఫీసర్’ కావాలనే కల మొదలైంది. పోలీసు అంటే బలంగా ఉండాలి, ఫిజికల్ ఫిట్‌నెట్ కావాలి... అందుకే ‘పవర్ లిఫ్టింగ్’ లోకి వచ్చింది. తండ్రి సందానీ పవర్ లిఫ్టింగ్‌లో చేయి తిరిగిన ఆటగాడు. ‘నాన్న’ అనే స్కూలులో సాధన మొదలుపెట్టింది.
ఒక్కో మెట్టు ఎక్కుతూ జూనియర్ పవర్ లిఫ్టింగ్ వరల్డ్ చాంపియన్‌గా ఎదిగింది. ఉదయం కాలేజీకి వెళ్లే సాదియా సాయంత్రం 5.30గంటల నుంచి 9గంటల వరకు ్రపాక్టిస్ చేస్తుంటుంది.‘నువ్వు అమ్మాయివి. ఇంత బరువులు ఎత్తే ఆటను ఎందుకు ఎంచుకున్నావని చాలామంది అడుగుతుంటారు. నా దృష్టి్టలో కష్టం లేని ఆట లేదు. ప్రతి ఆటలోనూ విజయం కోసం శ్రమించాల్సిందే. మా నాన్న కష్టం ముందు నా కష్టం చాలా చిన్నది. కుటుంబ పోషణ కోసం నాన్న కొబ్బరి బోండాలు అమ్మారు. నన్ను ప్రపంచ చాంపియన్‌గా నిలబెట్టేందుకు ఎంతో కష్టపడ్డారు. మా అక్క కూడా నాన్నప్రోత్సాహంతో వరల్డ్ వర్సిటీ పవర్‌లిఫ్టర్ పోటీలకు వెళ్లింది. ఇప్పుడు హౌస్ సర్జన్‌గా చేస్తోంది’ అంటుంది సాదియా.
సాదియా ట్రాక్ రికార్డు
ఈ ఏడాది మల్టాలో జరిగిన పవర్ లిఫ్టింగ్ జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్‌లో మూడు విభాగాల్లో కలిపి 462.5 కిలోలు లిఫ్ట్ చేసిన సాదియా ‘57 కిలోల విభాగంలో ఇదే నా అత్యుత్తమ ప్రదర్శన’ అని చెబుతుంది. జూనియర్ విభాగంలో రెండుసార్లు వరల్డ్ చాంపియన్ పతకాలు వచ్చాయి. 2023లో షార్జాలో జరిగిన ఏషియన్ వర్సిటీ క్లాసిక్ చాంపియన్ షిప్‌లో బంగారు పతకంతో పాటు ‘స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఏషియన్ వర్సిటీస్’ టైటిల్ సాధించింది. కేరళలో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో విజేతగా, స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఏషియాగా నిలిచింది.
2022లో న్యూజిలాండ్‌లో జరిగిన కామన్‌వెల్త్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా, స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ కామన్‌వెల్త్‌గా, టర్కీలో వరల్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో వెండి పతకం, 2018, 2021, 2022లో ఏషియా పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. జాతీయస్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు సాధించింది. తాజాగా దక్షిణాఫ్రికాలో జరిగిన కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఎక్విప్డ్ చాంపియన్ షిప్‌లో స్వాట్‌లో 185 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 180 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 95 కిలోలు బరువులెత్తి మొత్తంగా 460 కిలోలు లిఫ్ట్ చేసి బంగారు పతకాలు సాధించింది. ‘సాదియా’ అనే పేరుకు ఉన్న అర్థాలలో విజయం, అదృష్టం అనేవి కూడా ఉన్నాయి. అయితే ఆమె విజయం కోసం అదృష్టంపై ఎప్పుడూ ఆధారపడలేదు. తండ్రిలా కష్టాన్నే నమ్ముకుంది. అందుకే తండ్రి కలను నిజం చేయగలిగింది.
– వరదా ఎస్‌వీ కృష్ణకిరణ్, సాక్షి, అమరావతి ఫొటోలు: కందుల చక్రపాణి
ఆటలాడితే చదువు బాగా వస్తుంది!
నా చిన్నప్పుడు స్కూల్లో సరిగా చదవని వారిని ‘స్పోర్ట్స్‌లోకి తీసుకోండి’ అనేవారు. అది నా దృష్టిలో తప్పు. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుంది. బాగా చదివే విద్యార్థి అయినా, చదువులో వెనుకబడిన వాళ్లైనా స్పోర్ట్స్‌లో ఉంటే శారీరకంగా, మానసికంగా మంచిది. తొమ్మిదో తరగతి వరకు నాకు 60 శాతం మార్కులు వచ్చేవి. ఇప్పుడు 85 శాతంపైగా మార్కులు వస్తున్నాయి. దీనికి ఆటలే కారణం అని చెబుతాను. ఆటల్లో పడి చదువును ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారోనని భయపడి ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలను ఆటల వైపుప్రోత్సహించడం లేదు. ఇది మారాలి. ఎంబీఏ తర్వాత పీహెచ్‌డీ చేయాలని ఉంది. ‘అథ్లెట్స్ మైండ్ సెట్స్ ఎడ్యుకేషన్’పై పరిశోధన చేస్తాను.
– సాదియా ఆల్మాస్
Comments
Please login to add a commentAdd a comment