సమీర రాజ్యాన్ని సమీరుడనే రాజు పరిపాలించేవాడు. ఒకరోజు ఆస్థానానికి ఇద్దరు యువకులతో కలిసి ఒక వ్యక్తి వచ్చాడు. ‘మహారాజా! నాపేరు సుమంతుడు. నేను కొన్ని ప్రశ్నలు అడిగి సభాసదుల తెలివిని పరీక్షించాలనుకుంటున్నాను. నా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారికి పదివేల వరహాలిస్తాను. ఎవరూ చెప్పలేకపోతే మీ రాజ్యం తరుపున మీరు ఓటమిని అంగీకరించి పదివేల వరహాలివ్వాలి’ అన్నాడు. అది రాజ్యం పరువు, ప్రతిష్ఠలకు సంబంధించినది కావడంతో రాజు అంగీకరించాడు. ‘మహారాజా! ఈ యువకుల్లో వీడు సూర్యుడు, వాడు చంద్రుడు. ఈ ఇద్దరిలో ఒకడు మాత్రమే నా కుమారుడు.
వారిని పలకరించకుండా నా కుమారుడు ఎవరో చెప్పగలరా?’ అని అడిగాడు. రాజు సభవైపు చూశాడు. ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో మంత్రి వైపు చూశాడు. మంత్రి ఆ యువకులను తన దగ్గరకు పిలిచి, కరచాలనం చేసి, వారి చేతులను తన చేతుల్లోకి తీసుకుని జాతకం చూసే వారిలాగా పరిశీలించి .. వాళ్ల స్థానాల్లోకి తిరిగి పంపించేశాడు. ‘సుమంతా! వీరిలో సూర్యుడు నీ కుమారుడు’ అన్నాడు మంత్రి.‘మహామంత్రీ.. మీరు చెప్పింది సరైన సమాధానం. ఈ ఇద్దరిలో ఒకరికి తల్లి లేదు. చిన్నప్పుడే చనిపోయింది. తల్లి లేని వారెవరో చెప్పగలరా?’ అడిగాడు సుమంతుడు. ‘సుమంతా! నీ కుమారుడు సూర్యుడే తల్లి్లలేని బిడ్డ’ చెప్పాడు మంత్రి.
‘మీ సమాధానం సరైనదే. ఈ ఇద్దరిలో ఒకరు వైద్యరంగంలో, మరొకరు విలువిద్యలో ఆరితేరారు. ఎవరు ఏ విద్య నేర్చుకున్నారో చెప్పగలరా?’ అడిగాడు సుమంతుడు.మంత్రి చిరునవ్వు నవ్వి ‘సుమంతా! నీ కుమారుడు సూర్యుడు విలువిద్య, చంద్రుడు వైద్యవిద్య నేర్చుకున్నారు’ అని చెప్పాడు.‘మంత్రివర్యా! మీరు చెప్పింది సరైనదే. వీరిలో ఒకరికి మాత్రమే వివాహమయింది. ఎవరికో చెప్పగలరా?’అని మరో ప్రశ్న అడిగాడు. ‘సుమంతా! మీ కుమారుడికి వివాహమయింది’ అన్నాడు మంత్రి.సుమంతుడు తన ఓటమిని అంగీకరించి పదివేల వరహాలు మంత్రి చేతిలో పెట్టాడు. మంత్రి ఆ వరహాలను సుమంతుడికే తిరిగి ఇస్తూ మరో పదివేల వరహాలతో సత్కరించి పంపాడు.
మంత్రితో రాజు ‘మంత్రివర్యా! నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు సరైన సమాధానాలు ఎలా చెప్పగలిగారు?’ అని అడిగాడు. సభాసదులందరూ మంత్రి మాటల కోసం చెవులు రిక్కించారు. ‘మహారాజా! ఆ యువకుల చేతులను ఒక్క నిమిషం పరిశీలించి పంపాను కదా! సూర్యుడి చేతిపై సుమంతుడి పేరు చిన్న అక్షరాల్లో పచ్చపొడిచి ఉంది. దాంతో సుమంతుడి కొడుకు అతడే అని గ్రహించాను. చేతిపై తండ్రి పేరు మాత్రమే ఉంది కాబట్టి తల్లి చిన్నతనంలోనే చనిపోయి ఉంటుందని భావించాను. విలువిద్య నేర్చినవారు వింటినారి లాగి అనేక బాణాలు సంధించడం వల్ల చూపుడువేలు, బొటనవేలు భాగాలు కంది ఉంటాయి.
సూర్యుడి చేతివేళ్లు అలా ఉండడం చూశాను కాబట్టి సూర్యుడే విలువిద్య నేర్చుకున్నాడని, చంద్రుడు వైద్యవిద్య నేర్చుకున్నాడని గుర్తించాను. సూర్యుడి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో ఆ ఇంట్లో ఆడవారు లేకుండాపోయారు. కాబట్టి సూర్యుడికి వయస్సు రాగానే వివాహం చేసి ఉంటారని గ్రహించాను’ అంటూ వివరించాడు మంత్రి.‘చేతిపై పేరు లేకుంటే ఎలా గుర్తించేవారు?’ అడిగాడు రాజు.
‘అదేముంది మహారాజా! చాలా కుటుంబాల్లో పెద్దల పేర్లు, పిల్లల పేర్లు వారు నమ్మిన దైవం పేరులోని మొదటి అక్షరంతో ఉంటాయి. అలా పెట్టుకోవడం విశ్వాసం. ఇక్కడ తండ్రి పేరు సుమంతుడు, కనుక కొడుకు పేరులో మొదటి అక్షరం ‘సు’ ఉండాలి. కాబట్టి సుమంతుడి కొడుకు సూర్యుడని గ్రహించేవాడిని. మంత్రి సునిశిత పరిశీలనకు, నేర్పుకు రాజు ఆశ్చర్యచకితుడై అభినందించాడు. సభాసదులు హర్షధ్వానాలు చేశారు.
∙డి.కె.చదువులబాబు
Comments
Please login to add a commentAdd a comment