సునీత దిగొస్తే.. కల్పన మళ్లీ పుట్టినట్లే! | Sunita Williams won't be back on Earth before March 19 | Sakshi
Sakshi News home page

సునీత దిగొస్తే.. కల్పన మళ్లీ పుట్టినట్లే!

Published Sun, Mar 16 2025 8:01 AM | Last Updated on Sun, Mar 16 2025 8:01 AM

Sunita Williams won't be back on Earth before March 19

మూణ్ణాలుగు రోజుల్లో సునీతా విలియమ్స్‌ ఈ నెల 19న లేదా 20న ‘దివి’ నుండి దిగి వస్తారన్న ఆశతో ఈ భూగోళమంతా విశ్వాంతరాళంలోకి వెన్నెల కన్నులతో ఎదురు చూస్తోంది! ఒకవేళ ఇప్పటికే ‘నాసా’ ఆమెను భూమి మీదకు చేర్చి ఉంటే కనుక ఆ సంబరాలకు... రేపు కల్పనా చావ్లా జన్మదినమైన మార్చి 17 కూడా తోడవుతుంది. కల్పన అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ కాగా, సునీత అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళ. వ్యోమనౌకలో తలెత్తిన లోపాల కారణంగా సునీతా విలియమ్స్‌ తొమ్మిది నెలలుగా పైనే ఉండిపోతే,  ఇరవై రెండేళ్ల క్రితం – భూమి పైకి తిరిగొస్తుండగా స్పేస్‌ షటిల్‌ పేలిపోయి కల్పన కలలా మిగిలారు. సునీత ఇప్పుడు క్షేమంగా భువికి దిగి రావటమంటే సునీతే కాదు, కల్పన కూడా మళ్లీ పుట్టినట్లే!

వారం అనుకున్నది...!
సునీతా విలియమ్స్‌ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది! 2024 జూన్‌ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్‌ 12న లేదా 15న భూమి మీదకు తిరిగి రావాలి. కానీ రాలేదు! భూకక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్‌.ఎస్‌.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్‌ స్టార్‌లైనర్‌’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! ‘నాసా’ టీమ్‌ భూమి మీద నుంచి స్టార్‌లైనర్‌కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు. ఏమైతేనేం, వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్‌ భూమి పైకి తిరిగొచ్చే తేదీ ఖరారైంది. అందుకోసం ఎలాన్‌ మస్క్‌ సంస్థ ‘స్పేస్‌ఎక్స్‌’ దగ్గర రన్నింగ్‌లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను సిద్ధం చేశారు. మార్చి 19న సునీతను, విల్మోర్‌ను భూమిపైకి తేవాలని ‘నాసా’ ప్రయత్నం. యాదృచ్ఛికం ఏమిటంటే – స్టార్‌లైనర్‌ మానవ ప్రయాణానికి పనికొస్తుందా లేదా పరీక్షించటానికి వెళ్లిన సునీత, విల్మోర్‌ అదే స్టార్‌లైనర్‌ పని చేయకపోవటంతో అక్కడే చిక్కుకుపోవటం!

బరువు తగ్గి.. బుగ్గలు పీక్కుపోయినా.. 
నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోవటం వల్ల సునీత ఆరోగ్యం క్షీణించినట్లుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన కొన్ని ఫొటోలను బట్టి తెలుస్తోంది. ఆ ఫొటోలలో బరువు తగ్గినట్లుగా, బుగ్గలు లోపలికి పోయి, బాగా బక్కచిక్కినట్లుగా సునీత కనిపిస్తున్నారు. అంతరిక్షంలో ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికన్‌ వైద్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు కూడా. దీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్నవారికి ‘స్పేస్‌ ఎనీమియా’ వస్తుందని, ‘మైక్రో–గ్రావిటీ’కి గురవుతున్నప్పుడు ఎర్ర రక్తకణాల ఉత్పత్తి కన్నా, వాటి క్షీణత ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. అయితే వైరల్‌ అవుతున్న ప్రతి ఫొటోలో కూడా సునీత ఆత్మవిశ్వాసంతో, చిరునవ్వుతో కనిపిస్తుండటం విశేషం! సునీత అంతరిక్షంలోకి వెళ్లటం ఇది మూడోసారి.

రెండు దశాబ్దాల క్రితం 
2003 జనవరిలో అంతరిక్షంలోకి వెళ్లి, రెండు వారాల తర్వాత భూమిపైకి తిరిగి వస్తున్నప్పుడు ఫిబ్రవరి 1న కొలంబియా స్పేస్‌ షటిల్‌ పేలిపోయి కల్పనా చావ్లా కన్ను మూశారు. ఆ ఘటన యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కల్పన తొలిసారి 1997 నవంబర్‌ 19న అంతరిక్షానికి బయల్దేరి, తిరిగి పదహారు రోజుల తర్వాత డిసెంబర్‌ 5న భూమి పైకి తిరిగి వచ్చారు. తర్వాత ఐదేళ్లకు రెండోసారి అదే స్పేస్‌ షటిల్‌లో ఆరుగురు క్రూ మెంబర్స్‌తో కలిసి అంతరిక్ష పరిశోధనలను ముగించుకుని వస్తూ.. భూమికి చేరువవుతుండగా జరిగిన ఆ ఘోర దుర్ఘటనలో తక్కిన వ్యోమగాములందరితో పాటు ప్రాణాలు కోల్పోయారు. వారి వ్యోమ నౌక 84,000 ముక్కలైంది. భారతీయుల గుండెలు కోట్ల తునాతునకలయ్యాయి.

సునీత అంతరిక్షంలో చిక్కుకుపోయిప్పటి నుండీ ప్రపంచ ప్రజలకు, ముఖ్యంగా భారతీయులకు కల్పనే గుర్తుకు వస్తున్నారు. ఈ సమయంలో సునీత క్షేమంగా భూమి పైకి తిరిగి రావటం అంటే తనొక్కరే రావటం కాదు. తన రూపంలో కల్పన ఆత్మను భౌతికంగా సాక్షాత్కరింప జేయడం కూడా.

పాలపుంత పౌరులు
సునీతా విలియమ్స్‌ 1965లో యు.ఎస్‌.లో జన్మించారు. తండ్రి దీపక్‌ పాండ్యా గుజరాతీ. తల్లి ఉర్సులిన్‌ స్లోవేనియన్‌ మహిళ. సునీత ఫిజిక్స్‌లో డిగ్రీ, ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. అమెరికన్‌ నావికాదళంలో డైవింగ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. 1998లో రోదసీయానంలో శిక్షణ తీసుకున్నారు. తర్వాత ‘నాసా’ వ్యోమగామి అయ్యారు.

కల్పనా చావ్లా 1962లో హరియాణాలో జన్మించారు. తండ్రి బనారసీ లాల్‌ చావ్లా టైర్ల ఉత్పత్తి కంపెనీ యజమాని. తల్లి సంజోగ్తా ఖర్బందా. కల్పన ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, టెక్సాస్‌ యూనివర్సిటీ నుండి ఎమ్మెస్సీ చేశారు. అనంతరం స్పేస్‌ ప్రోగ్రామ్‌లో చేరారు. అక్కడి నుంచి నాసాకు వెళ్లారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement