విన్న ప్రతి వాయిస్ ఫ్రెష్‌గా ఉంది
3వ ఎడిషన్ ముగింపులో ‘సాక్షి’తో తమన్
‘ఓ 13 ఏళ్ల అమ్మాయి అద్భుతంగా పాడుతుంటే వినడం కాదు నేర్చుకోవడం కూడా మా వంతు అవుతోంది. ఇలా కూడా పాడవచ్చు అని కొందరు సింగర్స్ మాకు తెలియజెబుతున్నారు. ఇదో గొప్ప లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్’ అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న తమన్.. 3వ ఎడిషన్ పూర్తయిన సందర్భంగా సాక్షితో ముచ్చటిస్తూ తన అనుభవాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
పాట వింటున్నా.. ప్రోత్సహిస్తున్నా..
పాటల పోటీల్లో ప్రతిభావంతుల్ని విభిన్న రకాలుగా ప్రోత్సహిస్తున్నాం. ఆ క్రమంలోనే ఓజీ సినిమాలో భరత్, నజీరుద్దీన్‌లతో కలిసి పనిచేశాను. గేమ్ ఛేంజర్‌లో కూడా అవకాశం ఇవ్వబోతున్నాం. బహుశా కీర్తి, కీర్తన కూడా నా సినిమాలో పాడవచ్చు.. నేను ఇవ్వడం మాత్రమే కాకుండా తెలిసిన రచయితలు, సంగీత దర్శకులకు కూడా న్యూ టాలెంట్‌ని పరిచయం చేస్తున్నాం.
నొప్పింపక తానొవ్వక..
గత 3 సీజన్స్‌గా కొత్త గాత్రాలను జడ్జి చేస్తున్నాను. ఇది కొంచెం సంక్లిష్టమైన పనే అయితే.. 9 ఏళ్ల వయసులో అడుగుపెట్టి పాతికేళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్నాను. ఔత్సాహికుల గురించి తెలుసు కాబట్టి ఎవరి మనోభావాలనూ దెబ్బతీయకుండా జడ్జి చేయగలుగుతున్నాను.
విదేశాల నుంచి.. పల్లెల వరకూ..
ఆ్రస్టేలియా, అమెరికా లాంటి విదేశాల నుంచి మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల పల్లెటూర్ల నుంచి కూడా గాయకులు రావడం, ఎంతో టాలెంట్ చూపిస్తుండడం చూస్తుంటే ఇక భవిష్యత్తులో గాయకుల కొరత అనే మాటే వినపడదనే నమ్మకం బలపడింది.
ఒత్తిడికి చెక్..
‘సంగీతం ఒత్తిడి నుంచి విముక్తం చేయడంలో సహాయపడుతుంది. అందుకే సంగీత కళాకారులు ఎక్కువ కాలం జీవిస్తారనుకుంటున్నాను. నా జీవితంలోనూ సంగీతం చాలా ముఖ్యమైన భాగమైపోయింది. అది లేని జీవితాన్ని నేనూహించుకోలేను.
Comments
Please login to add a commentAdd a comment