ఈ చెట్టు కాండానికి నాణెం కొడితే పంటినొప్పులు తగ్గుతాయట! అలాగని భక్తుల విశ్వాసం. నేపాల్ రాజధాని కఠ్మాండూలోని దర్బార్ చౌరస్తా నుంచి థమేల్ వైపు వెళ్లే మార్గంలో ఉంటుంది ఈ విచిత్రం. వైశాదేవ్ ఆలయ ప్రాంగణంలో ‘బంగెముధా’ అనే చెట్టు కాండం శతాబ్దాలుగా ఉంది.
ఆలయాన్ని దర్శించుకునే భక్తుల్లో దంతబాధలు ఉన్నవారు ఈ కాండానికి మేకులతో నాణేలను కొట్టి తగిలిస్తారు. దీనివల్ల దంతబాధలు తగ్గిపోతాయని వారు నమ్ముతారు. నేపాల్ ప్రాంతాన్ని లిచ్ఛావి వంశస్థులు పాలించే కాలం నుంచి– అంటే, సుమారు క్రీస్తుశకం 400–750 మధ్య కాలం నుంచి ఈ కాండం ఇక్కడే ఉన్నట్లు చెబుతారు. ఆధునిక దంతవైద్యం ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందినప్పటికీ, ఇక్కడి జనాలు దంతబాధల నివారణకు ఇప్పటికీ ఈ చెట్టు కాండాన్నే నమ్ముకుంటూ ఉండటం విశేషం. ప్రతిరోజూ వందలాది భక్తులు ఈ చెట్టుకాండానికి నాణేలు కొట్టి మొక్కుకుని వెళుతుంటారు.
ఈ కాండంలోని పెద్ద తొర్ర లోపల బంగారు దేవతా విగ్రహం ఉండేదని, అది చోరీకి గురైందని కూడా కఠ్మాండూ ప్రజలు చెప్పుకుంటుంటారు. అయితే, తొర్ర లోపలి విగ్రహానికి సంబంధించి ఆధారాలేవీ లేవు. వైశాదేవ్ ఆలయ పరిసరాల్లో డజనుకు పైగా దంతవైద్యుల క్లినిక్‌లు ఉన్నా, జనాలు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుండటం చూసి విదేశీ పర్యాటకులు ఆశ్చర్యపోతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment